ఢిల్లీ మునిసిపల్ ఎన్నికల ముందు తీర్ధయాత్రలు!

మరో ఆరు నెలల్లో జరుగనున్న ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో గెలుపుకోసం స్థానిక బీజేపీ, ఆప్ నాయకులు పోటాపోటీగా ప్రజలను తీర్థయాత్రలకు తీసుకు వెడుతున్నారు. ఢిల్లీ బిజెపి నాయకులు తమ నియోజకవర్గాల ప్రజల కోసం బృందావన్, మధుర, హరిద్వార్, అయోధ్య వంటి ప్రదేశాలకు ‘తీర్థ యాత్రలు’ నిర్వహిస్తున్నారు.

ద్వారక నుండి కౌన్సిలర్, నితిఖా శర్మ, బృందావన్, మధురలకు ప్రజలను తీసుకువెడుతున్నారు.  పుట్ ఖుర్ద్ కౌన్సిలర్ అంజు అమన్ వారిని హరిద్వార్‌కు తీసుకువెళతారు. మండవలి మండల అధిపతి కైలాష్ యాదవ్ ఆదివారం 55 మంది బృందంతో మథుర, బృందావన్, బర్సనాలకు ఒక రోజు పర్యటనలో వెళ్లారు.

ఇక్కడ వరుసగా మూడు పర్యాయాలు గెలుపొందిన బిజెపి ఇప్పుడు సహజంగా  ఎదురుకాగల `ప్రభుత్వ వ్యతిరేకత’ నుండి బయటపడటం కోసం వినూత్నంగా వ్యవహరిస్తున్నది. యాదృచ్ఛికంగా, ఢిల్లీ ప్రభుత్వం ముఖ్యమంత్రి తీర్థ యాత్ర యోజనను కూడా నిర్వహిస్తుంది, దీని కింద 60 ఏళ్లు పైబడిన నివాసితులు తమ జీవిత భాగస్వామితో పాటు అనేక పవిత్ర స్థలాలకు ఉచిత తీర్థయాత్రలు చేయడానికి అర్హులు. 

వరుసగా రెండుసార్లు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో గెలుపొందిన మునిసిపల్ కార్పొరేషన్ లో మాత్రం  గెలవలేకపోతున్న ఆప్ ఈ పర్యాయం ప్రతిష్టాకరంగా సన్నాహాలు చేస్తున్నది. ప్రతి నెల ఉచిత పర్యటనలు నిర్వహించాలని బిజెపి కార్యకర్తలను కోరినట్లు పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి సిద్ధార్థన్, ఢిల్లీ పార్టీ అధ్యక్షుడు ఆదేశ్ గుప్తా ఆదేశించారు.

పటేల్ నగర్ నుండి కౌన్సిలర్ గుప్తా తన నియోజకవర్గం నుండి హరిద్వార్ తీర్థయాత్రకు తీసుకువెళ్లడానికి జాబితాను సిద్ధం చేస్తున్నారు. 500 మందికి పైగా నమోదు చేసుకున్నారని, మొదటి బ్యాచ్ ఈ నెలలోనే బయలుదేరుతుందని ఆయన చెప్పారు.

కరోనా కారణంగా, సీనియర్ సిటిజన్లు ఇంట్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అందువల్ల పార్టీ కార్యకర్తలు వారిని తీర్థయాత్రలకు తీసుకెళ్లడానికి ఏర్పాట్లు చేయాలని ఢిల్లీ బిజెపి  అధ్యక్షుడు పార్టీ నేతలకు సూచించారు.

షహబాద్ డెయిరీలోని డిటియు కళాశాల నుండి సెప్టెంబర్ 11 నుండి తీర్థయాత్రలు ప్రారంభమవుతాయని కౌన్సిలర్ అంజు అమన్ తెలిపారు. “ప్రతిరోజూ పది బస్సులు హరిద్వార్ వెళ్తాయి. ఇది రెండు రోజుల పర్యటన, ఈ సమయంలో నేను వారి బస, ఆహారం కోసం ఏర్పాట్లు చేస్తాను” అని చెప్పారు.