కరోనా టీకాలలో భారత్ ఆగష్టులో ప్రపంచ రికార్డు 

రోజుకు సగటున దాదాపు 60 లక్షలు.. నెలకు 18 కోట్లు..! గత నెలలో దేశంలో కరోనా టీకా పంపిణీ జోరిది. ప్రపంచంలో ఏ దేశంలోనూ లేనివిధంగా భారత్‌లో ఆగస్టులో రెండుసార్లు రోజుకు కోటిపైగా టీకాలు పంపిణీ చేశారు. మరికొన్ని రోజులు 80 లక్షల టీకాలు వేశారు. ఫలితంగా ఒక్క నెలలో 18 కోట్ల మందికి వ్యాక్సిన్‌ అందింది. 
 
జీ-7 కూటమిలోని.. అభివృద్ధి చెందిన దేశాలైన అమెరికా, కెనడా, ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ, జపాన్‌, యూకే అన్నిట్లో కలిపినా ఆగస్టులో 10 కోట్ల టీకాలే పంపిణీ అయ్యాయని.. వాటితో పోలిస్తే మన దేశంలో 8 కోట్ల టీకాలు అధికంగా ఇచ్చామని కేంద్ర ప్రభుత్వం ఆదివారం తెలిపింది. ఇక శనివారం 72 లక్షల మందికి టీకా ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రాల వద్ద 4.37 కోట్ల డోసులున్నాయి. త్వరలో 1.56 కోట్ల టీకాలు అందనున్నాయి. దేశవ్యాప్తంగా 68.75 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని ప్రభుత్వం తెలిపింది. 
 
కాగా, దేశ‌మంతటా క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌భావం త‌గ్గుతుంటే కేర‌ళ‌లో మాత్రం అంత‌కంత‌కే పెరుగుతున్న‌ది. అక్క‌డ గత కొన్ని రోజులుగా ప్ర‌తిరోజూ 25 వేల‌కు పైగా కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. దేశంలో న‌మోద‌వుతున్న‌ మొత్తం కేసుల్లో దాదాపు 60 శాతం కేసులు కేర‌ళ నుంచే ఉంటున్నాయి. దేశంలో కొత్తగా 38,948 కరోనా కేసులు నమోదుకాగా, కేరళలోనే 26,701 పాజిటివ్‌ కేసులు ఉన్నాయి.
ఇక క‌రోనా మ‌ర‌ణాలు కూడా కేర‌ళ‌లో ఎక్కువ‌గానే న‌మోద‌వుతున్నాయి. ఇవాళ కూడా 74 మంది క‌రోనా బాధితులు ప్రాణాలు కోల్పోవ‌డంతో మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 21,496కు పెరిగింది.  మరోవంక, కరోనా నకిలీ టీకాలపై రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం అప్రమత్తం చేసింది. వ్యాక్సినేషన్‌లో భాగంగా ప్రస్తుతం ప్రజలకు ఇస్తున్న కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌, స్పుత్నిక్‌ వీ టీకాల్లో ఏవి అసలైనవి? ఏవి నకిలీవి? అన్నది గుర్తించడానికి మార్గదర్శకాలు జారీచేసింది.
 
ఆగ్నేయాసియా, ఆఫ్రికా దేశాల్లో నకిలీ టీకాలు వినియోగిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తంచేసింది. భారత్‌లోనూ నకిలీ కొవిషీల్డ్‌ టీకాలు ఇస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో టీకా తయారీదారులు ఇచ్చిన సమాచారం ఆధారంగా కేంద్రం మార్గదర్శకాలను విడుదల చేసింది.
 
దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. రాష్ట్రంలోని 29 జిల్లాల్లో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య సున్నాగా ఉంది. గడచిన 24 గంటల్లో నిర్వహించిన కోవిడ్ పరీక్షలో మొత్తం 62 జిల్లాల్లో ఒక్క కొత్త కరోనా కేసు కూడా నమోదు కాలేదు, గడచిన 24 గంటల్లో 2 లక్షల 34 వేల 971 కోవిడ్ టెస్టులు చేయగా కేవలం 18 మందికి మాత్రమే కరోనా సోకిందని తేలింది.