మోదీ పుట్టిన రోజుకి 20 రోజుల ‘సేవ సమర్పన్ అభియాన్’

ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 17న 71వ ఏట అడుగుపెడుతున్నారు. ఆయన పుట్టిన రోజు, 20 ఏండ్ల ప్రజా సేవను పురస్కరించుకుని ‘సేవ సమర్పన్ అభియాన్’ పేరుతో 20 రోజుల మెగా ఈవెంట్‌కు కేంద్రంలోని అధికార బీజేపీ సన్నాహాలు చేస్తున్నది. 

ఈ నెల 17 నుంచి అక్డోబర్‌ 7 వరకు 20 రోజుల పాటు భారీగా స్వచ్ఛభారత్‌ కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయనున్నది. 2001 అక్టోబర్‌ 7న నరేంద్ర మోదీ తొలిసారి గుజరాత్‌ సీఎం అయ్యారు. సీఎం నుంచి ప్రధాని వరకు 20 ఏండ్ల ప్రజా సేవను పురస్కరించుకుని పలు కార్యక్రమాలకు బీజేపీ సిద్ధమైంది.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యాలయాలకు పలు సూచనలు జారీ చేశారు. ‘పార్టీ సభ్యులు ప్రజా సేవకు అంకితమవుతారు. మోదీ కృషికి అభినందనలు తెలిపేందుకు దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ బూత్‌ల నుండి ఐదు కోట్ల పోస్ట్‌ కార్డులు ప్రధానమంత్రికి పంపుతారు’ అని అధికార ప్రకటనలో పేర్కొన్నారు. 

ప్రచారంలో భాగంగా ఉచిత ఆహార ధాన్యాలు, పేదలకు టీకాలు వేసినందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపే హోర్డింగ్‌లు కూడా ఏర్పాటు చేయనున్నారు. ప్రధాని జీవితానికి అంకితమైన ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహించాలని పార్టీ సభ్యులను నడ్డా కోరారు. నామో యాప్‌ ద్వారా వర్చువల్ ఈవెంట్‌లకు హాజరు కావచ్చని పేర్కొన్నారు.

నరేంద్ర మోదీ జీవితాన్ని వివరించేందుకు ప్రత్యేక ప్రదర్శనలను ఏర్పాటు చేయాలని బీజేపీ నేతలను ఆదేశించారు. దళితులు, ఆదివాసీలు, వెనుకబడిన వర్గాలు, రైతులకు మోదీ చేసిన సేవలను వివరించాలని తెలిపారు. నమో యాప్ ద్వారా వర్చువల్ ఈవెంట్స్‌లో కూడా పాల్గొనవచ్చునని తెలిపారు. 

రేషన్ దుకాణాలకు వెళ్ళి రేషన్ సరుకులు తీసుకునేవారితో మోదీకి ధన్యవాదాలు చెప్పిస్తూ వీడియోలు చిత్రీకరించాలని ఆదేశించారు. రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయాలని ఆ పార్టీ యువజన విభాగాన్ని కోరారు. కాగా, ఈ నెల 17న జిల్లా స్థాయిలో ఆరోగ్య శిభిరాలు నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీ కార్యకర్తలు 71 చోట్ల గంగా నదిని శుభ్రం చేసే కార్యక్రమాన్ని చేపడతారు. ‘ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన’ కింద ఆహార పదార్థాలను మహిళా నాయకులు పంపిణీ చేస్తారు.

 ప్రజాప్రతినిధులంతా వ్యాక్సిన్ కేంద్రాలకు వెళ్లి అవగాహన కల్పించడంతోపాటు ప్రధానమంత్రికి కృతజ్ఞతలు చెబుతారు. అక్టోబర్‌ 2 గాంధీ జయంతి రోజున భారీగా పరిశుభ్రత ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఖాదీ, స్థానిక ఉత్పత్తుల వాడకాన్ని ప్రోత్సహిస్తూ బహిరంగ సందేశాలు ఇస్తారు.

కరోనా కారణంగా అనాథలైన పిల్లలకు పీఎం కేర్‌ ప్రయోజనం కోసం వారి పేర్లను బీజేపీ కార్యకర్తలు నమోదు చేశారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ అందుకున్న అన్ని బహుమతులను ప్రభుత్వ వెబ్‌సైట్ pmmemontos.gov.in ద్వారా వేలం వేస్తారు. ఈ కార్యక్రమాలను పర్యవేక్షించే బాధ్యతలను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయవర్గియా, డీ పురందేశ్వరి, వినోద్ సోంకర్, రాష్ట్రీయ కిసాన్ మోర్చా అధ్యక్షుడు రాజ్‌కుమార్ చాహర్‌కు అప్పగించారు.

 దేశ ప్రజల ఆమోదంలో మోదీకి ఫస్ట్ ప్లేస్
 
దేశ ప్రజల ఆమోదం విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ ఫస్ట్ ప్లేస్ లో నిలిచారు. 13 దేశాల అధినేతలకు సొంత ప్రజల ఆమోదం (అప్రూవల్) ఎంత ఉందన్న అంశంపై ‘మార్నింగ్ కన్సల్ట్’ సంస్థ నిర్వహించిన ‘గ్లోబల్ లీడర్ అప్రూవల్ రేటింగ్స్’ సర్వేలో మోదీ  70 శాతం రేటింగ్స్ తో మొదటి స్థానం దక్కించుకున్నారు. 
 
జో బైడెన్, బోరిస్ జాన్సన్, ఏంజెలా మెర్కెల్ వంటి పాపులర్ లీడర్లను సైతం మోదీ అధిగమించారు. ఇక మెక్సికో ప్రెసిడెంట్ ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఓబ్రడార్ 64 శాతం అప్రూవల్ రేటింగ్స్ తో మోడీ తర్వాత రెండో స్థానంలో నిలిచారు. ఇటలీ ప్రధాని మారియో ద్రాఘి 63 శాతం రేటింగ్స్ తో థర్డ్ ప్లేస్ పొందారు. 
 
అమెరికాకు చెందిన డేటా ఇంటెలిజెన్స్ సంస్థ మార్నింగ్ కన్సల్ట్ 13 దేశాల అధినేతలకు ప్రజల ఆమోదంపై వారానికి ఓసారి సర్వే రిజల్ట్ ను తన వెబ్ సైట్ లో పొందుపరుస్తోంది. ఆయా దేశాల్లోని పెద్ద వయసు వారితోనే సర్వే నిర్వహిస్తోంది. దేశాన్ని బట్టి, సర్వేలో పాల్గొన్న  వారి సంఖ్యను నిర్ణయిస్తుంది. తాజాగా ఆగస్ట్ 31 నాటికి గత వారం రోజుల్లో జరిగిన సర్వేలో ప్రధాని మోడీ మొదటి స్థానంలో నిలిచారు.