పోలీసు వ్యవస్థ ప్రతిష్ఠను ప్రజల్లో మెరుగుపరచాలి

ప్రభుత్వ ఉద్యోగులందరిలోనూ పోలీసులు చేసే పని చాలా కఠినమైనది కేంద్ర హోం మంత్రి అమిత్ షా  చెప్పారు.  యావత్తు ప్రభుత్వ వ్యవస్థలోనూ అత్యంత కష్టమైన పనిని పోలీసులు నిర్వహిస్తున్నారని తెలిపారు. బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (బీపీఆర్ అండ్ డీ) 51వ వ్యవస్థాపక దినోత్సవాల సందర్భంగా న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొంటూ అటువంటి పోలీసు వ్యవస్థ ప్రతిష్ఠను ప్రజల్లో మెరుగుపరచవలసిన అవసరం ఉందని సూచించారు. 

ప్రజాస్వామ్యం విజయవంతం కావడంలో బీట్ కానిస్టేబుళ్ళు చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారని ప్రశంసించారు. పోలీసు వ్యవస్థలో ఉద్యోగులు సెలవులు తీసుకోరని గుర్తు చేశారు. దీపావళి, రక్షా బంధన్ వంటి అనేక పండుగలనాడు సైతం సెలవులు తీసుకోరని పేర్కొన్నారు. 

పోలీసు వ్యవస్థ ప్రతిష్ఠను మసకబార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెబుతూ ఇలా ఎందుకు జరుగుతోందో తనకు తెలియదని తెలిపారు. కొన్ని సంఘటనలను అతిగా చూపిస్తూ ప్రచారం చేస్తున్నారని, మరికొన్ని మంచి సంఘటనలకు స్థానం ఇవ్వడం లేదని పేర్కొన్నారు.

భౌగోళిక, సముద్ర సరిహద్దుల్లో భద్రత పట్ల అజాగ్రత్తగా వ్యవహరించరాదని అమిత్ షా స్పష్టం చేశారు. దేశంలో ప్రజాస్వామ్యం పురోగతి సాధించాలంటే ప్రజలకు భద్రత తప్పనిసరి అని తెలిపారు. భౌగోళిక, సముద్ర సరిహద్దులు సురక్షితంగా ఉండాలని, ఈ విషయంలో ఎటువంటి ఉదాసీనత పనికిరాదని చెప్పారు.

 ప్రజాస్వామ్యంలో అతి ముఖ్యమైనది వ్యక్తిగత స్వాతంత్య్రం, భావవ్యక్తీకరణ స్వేచ్ఛ అంటూ ప్రజాస్వామ్యం అంటే కేవలం ఓటు వేయడం కాదని అమిత్ షా స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యం అంటే కవలం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కూడా కాదని తెలిపారు.  ఇది ప్రజాస్వామ్య విధానంలో ఒక భాగం మాత్రమే అని చెప్పారు. 

 ప్రజాస్వామ్య ఫలాలు ఏమిటంటే.. దేశంలోని 130 కోట్ల మంది ప్రజలు తమ సామర్థ్యాలు, తెలివితేటల ప్రకారం తమను తాము అభివృద్ధి చేసుకుంటూ, దేశాభివృద్ధికి ప్రయోజనాన్ని అందివ్వడం అని వివరించారు. భద్రత కట్టుదిట్టంగా ఉంటే ప్రజాస్వామ్యం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. శాంతిభద్రతల నిర్వహణ కోసం పోలీసు వ్యవస్థలను అనుసంధానం చేయడంలో బీపీఆర్ అండ్ డీ అత్యంత కీలక పాత్ర పోషించిందని కొనియాడారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు 3,700 మంది నక్సలైట్లు లొంగిపోయారని చెప్పారు. వారిని ప్రధాన జీవన స్రవంతిలోకి తెస్తామని తెలిపారు. బీపీఆర్ అండ్ డీ ప్రస్తుత పరిణామాలకు అనుగుణంగా మారాలని సూచించారు. అవసరానికి తగినట్లుగా మారే వ్యవస్థలకు మంచి పేరు వస్తుందని, ఆకర్షణ కలుగుతుందని చెప్పారు. బీపీఆర్ అండ్ డీ లేకపోతే మంచి పోలీసింగ్‌ను ఆశించలేమని తాను ఓసారి ఇక్కడి సందర్శకుల పుస్తకంలో రాశానని గుర్తు చేసుకున్నారు.