చారిత్రక కర్బి అంగ్‌లాంగ్ శాంతి ఒప్పందం

కర్బి అంగ్‌లాంగ్ శాంతి ఒప్పందం అస్సాం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. ఆరు సంస్థలకు చెందిన దాదాపు వెయ్యి మంది ఆయుధాలను వదిలిపెట్టి, ప్రధాన జీవన స్రవంతిలో కలిశారని చెప్పారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని చెప్పారు.

అమిత్ షా, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, కర్బి సంస్థల ప్రతినిధుల సమక్షంలో త్రైపాక్షిక కర్బి శాంతి ఒప్పందంపై శనివారం సంతకాలు జరిగాయి. కర్బి లోంగ్రి నార్త్ కచర్ హిల్స్ లిబరేషన్ ఫ్రంట్, పీపుల్స్ డెమొక్రాటిక్ కౌన్సిల్ ఆఫ్ కర్బి లోంగ్రి, యునైటెడ్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ, కర్బి పీపుల్స్ లిబరేషన్ టైగర్స్, కర్బి పీపుల్స్ లిబరేషన్ టైగర్స్ (ఆర్), కర్బి పీపుల్స్ లిబరేషన్ టైగర్స్ (ఎం) ప్రతినిధులు సంతకాలు చేశారు. 

‘‘చారిత్రక కర్బి అంగ్‌లాంగ్ శాంతి ఒప్పందం కర్బి రీజియన్, అస్సాం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖిస్తారు. నేడు దాదాపు 1,000 మంది ఆయుధాలను వదిలిపెట్టి, ప్రధాన జీవన స్రవంతిలో చేరారు. వారికి పునరావాసం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం, అస్సాం రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉన్నాయి’’ అని అమిత్ షా ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. 

అస్సాం ప్రజలను అభినందిస్తూ  కర్బి అంగ్‌లాంగ్ ప్రాంతంలో చాలా కాలం తర్వాత శాంతి శకం ప్రారంభమవుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి ఈశాన్య భారత దేశం చాలా ముఖ్యమైన ప్రాంతంగా మారిందని తెలిపారు. ఈ ప్రాంతం శాంతియుతంగా అభివృద్ధి సాధించడంపై మోదీ ప్రధానంగా దృష్టి పెట్టారని చెప్పారు. 

కర్బి ప్రాంతం అభివృద్ధి కోసం అస్సాం ప్రభుత్వం రానున్న ఐదేళ్ళలో సుమారు రూ.1,000 కోట్లు ఖర్చు చేస్తుందని అమిత్ షా వెళ్ళైద్నచారు. ఒప్పందంలో పేర్కొన్న వాగ్దానాలన్నిటినీ నెరవేర్చాలన్నదే మోదీ ప్రభుత్వ విధానమని తెలిపారు. అస్సాంలో శాంతి నెలకొనడంపైనా, ఆ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందడంపైనా మోదీ దృష్టి సారించారని తెలిపారు. 

రాష్ట్రంలో తీవ్రవాదం, హింసలను నిరోధించేందుకు కృషి చేస్తున్నారని చెబుతూ ఆయుధాలను వదిలిపెట్టి వచ్చేవారితో మోదీ ప్రభుత్వం గౌరవ, మర్యాదలతో మాట్లాడుతుందని హామీ ఇచ్చారు. వారిని అభివృద్ధి ప్రవాహంలో భాగస్వాములను చేయడం కోసం వారు అడిగినదాని కన్నా ఎక్కువ ఇస్తుందని పేర్కొన్నారు. ఈ విధానం ఫలితంగానే పాత సమస్యలు ఒకదాని తర్వాత మరొకటి పరిష్కారమవుతున్నాయని చెప్పారు.-