మమతా కోసం ఉపఎన్నిక… హుజురాబాద్ ఎన్నిక వాయిదా 

కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా 31 అసెంబ్లీ, 3 లోక్ సభ నియోజకవర్గాలలో జరుగవలసిన ఉపఎన్నికలు నిరవధికంగా వాయిదా వేసిన భారత ఎన్నికల కమీషన్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీచేయాలని చూస్తున్న భవానీపూర్ లో మాత్రం “ప్రత్యేకంగా” ఎన్నిక జరపాలని నిర్ణయించింది. 
 
బిజెపి ప్రతిష్టాకరంగా తీసుకున్న తెలంగాణలోని హుజురాబాద్ ఉపఎన్నికను కూడా వాయిదా వేశారు. ఇక్కడ టి ఆర్ ఎస్ నుండి వచ్చిన ఈటెల రాజేందర్ ను గెలిపించుకోవడం ద్వారా తెలంగాణాలో రాబోయే రోజులు తమవే అనే సంకేతం ఇవ్వాలనే బిజెపి నాయకత్వం ప్రయత్నాలకు బ్రేక్ పడినట్లు అయింది. 
 
ఆలస్యంగా ఎన్నికలు జరిగితే తమకు అనుకూలంగా మార్చుకోవచ్చనుకొంటున్న కేసీఆర్ ప్రభుత్వం ప్రస్తుతం ఎన్నికలు జరుపవడేదని ఎన్నికల కమీషన్ ను కోరింది. అప్పుడే ఇక్కడ ఒక వైపు బిజెపి, మరోవైపు టి ఆర్ ఎస్ ఉధృతంగా ప్రచారం చేసుకొంటున్నాయి. అదే విధంగా, ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాలో ఖాళీగా ఉన్న బద్వేల్ ఉపఎన్నికను కూడా జరపడం లేదు. 
మమతా బెనర్జీ పోటీ చేయబోతున్న భవానీపూర్ స్థానంతో సహా ఒడిశాలోని ఒక అసెంబ్లీ నియోజకవర్గం, పశ్చిమ బెంగాల్‌లోని మూడు అసెంబ్లీ స్థానాలకు సెప్టెంబర్ 30 న ఉప ఎన్నికలను నిర్వహిస్తున్నట్లు ఎన్నికల కమీషన్ ప్రకటించింది.

ఎన్నికల కమిషన్ విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం, పరిపాలన అవసరాలు, ప్రజల ప్రయోజనాలు, రాష్ట్రంలో సన్యాన్ని నివారించడం కోసం ముఖ్యమంత్రి పోటీచేయాలి అనుకొంటున్న భవానీపూర్ లో ఎన్నికలు జరపాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కోరడంతో ఎన్నికలు జరపాలని కమీషన్ నిర్ణయించింది. 


“రాజ్యాంగ ఆవశ్యకత, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నుండి ప్రత్యేక అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుని, ఇతర 31 అసెంబ్లీ నియోజకవర్గాలు, మూడు పార్లమెంటరీ నియోజకవర్గాలలో (భారతదేశం అంతటా) ఉప ఎన్నికలు నిర్వహించకూడదని కమిషన్ నిర్ణయించినప్పటికీ, భవానీపూర్ లో ఉప ఎన్నిక నిర్వహించాలని నిర్ణయించాము” అని కమీషన్ స్పష్టం చేసింది. 
 
గతంలో తాను ప్రాతినిధ్యం వహించిన భవానీపూర్ ను వదిలివేసి, తనకు 170 కిమీ దూరంలో గల నందిగ్రామ్ నుండి పోటీచేసి బిజెపి అభ్యర్థి, తన మాజీ సహచరుడు సువెందు అధికారి చేతిలో ఓటమి చెందారు. అయితే ఆమె పార్టీ 213 సీట్లు గెల్చుకోవడంతో గత మేలో వరుసగా మూడో సారి ముఖ్యమంత్రిగా  పదవీబాధ్యతలు  స్వీకరించారు. 
 
ఆరు నెలలలోగా, అంటే నవంబర్ 5 లోగా ఆమె శాసనసభకు ఎన్నిక కావలసి ఉంది. కరోనా కారణంగా ఎన్నికలు జరుగని పక్షంలో ఆమె ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయవలసి రావచ్చు. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రత్యేక అభ్యర్ధనను ఎన్నికల కమీషన్ పరిగణలోకి తీసుకున్నట్లు కనిపిస్తున్నది. 
భవానీపూర్‌తో పాటు, పశ్చిమ బెంగాల్‌లోని జంగీపూర్, సంసర్‌గంజ్‌లో కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల  ప్రచార దశలో అభ్యర్థుల మరణం కారణంగా అక్కడ పోలింగ్ జరగలేదు., ఒడిశాలోని పిపీలి లో కూడా ఉపఎన్నికలు జరుగనున్నాయి. అక్టోబర్ 3 న ఫలితాలు ప్రకటిస్తారు. భవానీపూర్ లోనే నివసించే బెనర్జీ అక్కడి నుండి 2011, 2016 లలో గెలుపొందారు. గత మేలో టీఎంసీ సీనియర్ నేత శోభందేబ్ ఛటర్జీ భవానీపూర్ నుంచి గెలిచినప్పటికీ, ముఖ్యమంత్రి ఉప ఎన్నికలో పోటీ చేయడం కోసం రాజీనామా చేశారు. ఆయన ప్రస్తుతం రాష్ట్ర మంత్రి కూడా.

ఛటర్జీ ఖార్దా నుంచి పోటీ చేయాల్సి ఉంది. ఇక్కడ నుండి  టీఎంసీ అభ్యర్థి ఎన్నికల ప్రకటనకు ముందే కరోనాతో మరణించారు. 

కానీ ఖర్దా, బెంగాల్ లోని మరో మూడు స్థానాలకు ఉప ఎన్నికల తేదీలు ప్రకటించలేదు. టిఎంసి గోసాబా ఎమ్యెల్యే జయంత నాస్కర్ ఎన్నికైన తర్వాత కరోనాతో మరణించారు. అక్కడ కూడా ఉప ఎన్నిక జరుపవలసి ఉంది.

ఉప ఎన్నికలు అవసరమయ్యే ఇతర స్థానాలలో శాంతిపూర్, దిన్హాట ఉన్నాయి. వీటిలో సిట్టింగ్ బిజెపి ఎంపిలు జగన్నాథ్ సర్కార్, నిషిత్ ప్రామాణిక్ గెలిచారు.  కానీ వారు తమ లోక్‌సభ సభ్యత్వాన్ని నిలుపుకోవడానికి శాసన సభ్యత్వానికి రాజీనామా చేశారు. భవానీపూర్ కంటే ముందు నుండే ఈ సీట్లు ఖాళీగా ఉన్నాయి.