
హైదరాబాద్‌లో వర్షం బీభత్సం సృష్టిస్తున్నది. గత వారం రోజులుగా దాదాపు ప్రతిరోజూ వర్షాలు పడుతూ ప్రజా జీవనాన్ని కల్లోల పరుస్తున్నాయి. నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. దీంతో రోడ్లపై వాహనదారులు ఇక్కట్లు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో విద్యుత్ నిలిచిపోయింది.
భారీ వర్షం కారణంగా అంబర్‌పేట్ ముసారాంబాగ్ బ్రిడ్జ్ నీటమునిగింది. అంబార్‌పేటలోని బాపూనగర్‌లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరింది. అంబర్‌పేట-ముసారాంబాగ్ మార్గంలో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. మలక్‌పేట, చాదర్‌ఘాట్ సరిసరాలు జలమయం అయ్యాయి.వర్షాల నేపథ్యంలో గండిపేటకు భారీగా వరద నీరు చేరుకోవడంతో నాలుగు గేట్లు ఎత్తి అధికారులు నీటిని దిగువకు వదులుతున్నారు.
మూసీ పరివాహక ప్రాంతంలోకి వరద నీరు పెద్ద ఎత్తున చేరుకోవడంతో అంబర్‌పేట్- మూసారాంబాగ్ వంతెన నీటమునిగింది. మలక్‌పేటలోని ముసారాంబాగ్ బ్రిడ్జి నీటిలో మునిగిపోవడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో అధికారులు వాహనాలను దారి మళ్లీంచారు.
రానున్న మూడు రోజులు హైదరాబాదలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. శుక్రవారం తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాగల 48 గంటల్లో ఉత్తర మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. డిజాస్టర్, మాన్సూన్ బృందాలు రంగంలోకి దిగాయి. నగరంలోని బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట ప్రాంతాల్లో వాన పడింది. ఎస్‌ఆర్ నగర్, ఎర్రగడ్డ, కూకట్‌పల్లి, కోఠి, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర, వనస్థలిపురం ప్రాంతాల్లో వర్షం నీటీతో రహదారులు జలమయం అయ్యాయి.
తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల ధాటికి లోతట్టు ప్రాంతాల్లోకి నీరు వచ్చి చేరింది. పలు ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. వికారాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలో వర్షాల కారణంగా పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇప్పటికే కురిసిన వర్షాలతో చెరువులు, ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి.
వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాలు ఇప్పటికే జలమయం కాగా, పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. ఇక నగరంలో ప్రతి రోజు ఏదో ఒక సమయంలో కుండపోతగా వర్షం కురుస్తుండడంతో వాహనదారులు, లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
బంగాళాఖాతంలో 4.5 కిలోమీటర్ల ఎత్తున మరో ఉపరితల ఆవర్తనం వ్యాపించి ఉందని దీని ప్రభావంతో ఈనెల 6వ తేదీ నుంచి 12లోగా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ స్పష్టంచేసింది. రుతుపవనాల కదలికలు సాధారణంగానే ఉన్నాయని, అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆదివారం నుంచి అతి భారీ నుంచి ఓ మోస్తరు వర్షాలు రాష్ట్రవ్యాప్తంగా కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది.
More Stories
హైదరాబాద్ లో పురుషాంగం పునఃసృష్టి
బీసీ కులగణన కాంగ్రెస్ కుట్ర
పాలమూరు- రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వలేం