పోలీసుల కౄరత్వంపై `సుప్రీం’ నియమావళి ఏర్పర్చాలి

దేశంలో నిత్యం పౌరులతో పోలీసుల క్రూర ప్రవర్తనను కట్టడి చేయడం కోసం పౌరులతో వ్యవహరించేటప్పుడు పోలీసులకు ప్రవర్తనా నియమావళిని రూపొందించాలని స్వతంత్ర సెంటర్ వ్యవస్థాపక డైరెక్టర్, యూత్ పార్లమెంట్ ప్రోగ్రాం వ్యవస్థాపకుడు రాఘవేందర్ ఆస్కాని సుప్రీం కోర్ట్ ను అభ్యర్ధించారు. ,
తద్వారా పోలీసుల క్రూరత్వం నుండి  పౌరుల మానవ హక్కులను కాపాడాలని సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమృతి జస్టిస్ ఎన్ వి రమణకు వ్రాసిన లేఖలో కోరారు. ప్రజల ప్రయోజనాల దృష్ట్యా తన లేఖను సుమోటో పిఐఎల్ పిటిషన్‌గా పరిగణించాలని కోరుతూ, భారత పోలీసు వ్యవస్థపై చర్చ సందర్భంగా చీఫ్ జస్టిస్ స్వయంగా ఆవేదనను వ్యక్తం చేసారని గుర్తు చేశారు.
లాఠీలతో ప్రజలను కొట్టడం, హింస, దుర్భషలాడటం  ద్వారా దేశవ్యాప్తంగా పోలీసు సిబ్బంది పౌరులను ఎలా పరిగణిస్తున్నారనే దానిపై తన లేఖ ప్రధాన న్యాయమూర్తి దృష్టిని ఆకర్షించాలని కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు.
 
పోలీసులు, బ్యూరోక్రాట్లు అనుసరిస్తున్న నిరంకుశ సంస్కృతి కారణంగా భారతీయ పౌరులు తమ ప్రాథమిక హక్కులను కోల్పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగం ద్వారా హామీ ఇవ్వబడిన పౌరుల మానవ హక్కులు, పౌర హక్కులు, ప్రాథమిక హక్కులను జ్యుడీషియల్ అధికారులు కాపాడాలని రాఘవేందర్ కోరారు. 
 
ముఖ్యంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 గౌరవప్రదంగా, వ్యక్తిగత స్వేచ్ఛతో జీవించే హక్కును నిర్ధారిస్తుందని గుర్తు చేశారు. కరోనా
మహమ్మారి సమయంలో, సాధారణ పనులు చేయడానికి లేదా ఆసుపత్రికి హాజరు కావడానికి లేదా మరేదైనా ప్రయోజనం కోసం బయటకు వచ్చిన చాలా మంది ప్రజలను విచక్షణారహితంగా కొట్టారని ఆయన విచారం వ్యక్తం చేశారు.
 
ఈ సందర్భంగా, సుప్రీంకోర్టు  పలు సందర్భాలలో పౌరుల హక్కుల పరిరక్షణ గురించి ప్రస్తావించిందని ఆయన గుర్తు చేశారు. పదేపదే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం, అరెస్టు సమయంలో నిందితుల హక్కులకు సంబంధించి డీకే బసు వర్సెస్ బెంగాల్ ప్రభుత్వం కేసులో  మార్గదర్శకాలు రూపొందించడం వంటి చర్యల ద్వారా అరెస్ట్ సమయంలో పోలీసులు అనుసరించే వైఖరికి సంబంధించి పలు సంస్కరణలు తీసుకొచ్చినదని వివరించారు. 
ప్రకాష్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో పోలీసు సంస్కరణలకు సంబంధించి మార్గదర్శకాలు (2006), సిబిఐ వినీత్ నారాయణ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టిన్నట్లు తెలిపారు.

ఒక వ్యక్తిని లాఠీతో కొట్టడం లేదా వారి వ్యక్తిగత ఆస్తులను దెబ్బతీయడం సరికాదని ఆయన స్పష్టం చేశారు. ప్రజలందరి  శ్రేయస్సు కోసం ఈ కేసును సీరియస్‌గా తీసుకోవాల్సిందిగా ఆయన సుప్రీం కోర్ట్ ను అభ్యర్ధించారు. రాఘవేందర్ తన లేఖను సుప్రీంకోర్టు న్యాయమూర్తులందరికీ, దేశంలోని అన్ని హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులకు కూడా పంపారు.