ఇక సైనిక శిక్షణలో భ‌గ‌వ‌ద్గీత‌, కౌటిల్యుని అర్థశాస్త్రం!

భార‌త సాయుధ బ‌ల‌గాల్లో మ‌రింత భార‌తీయ‌త క‌నిపించాల‌న్న‌ది ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఆకాంక్ష‌. ఆ దిశ‌గా ఇప్పుడు సికింద్రాబాద్‌లోని కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్‌మెంట్ (సీడీఎం) అడుగులు వేస్తోంది. ప్రాచీన భార‌త సంస్కృతి, యుద్ధ నీతిని మ‌న సాయుధ బ‌ల‌గాల‌కు నేర్పించాల‌ని భావిస్తోంది. 

అందులోభాగంగా భ‌గ‌వ‌ద్గీత‌తోపాటు కౌటిల్యుని అర్థ‌శాస్త్రాన్ని కూడా శిక్ష‌ణ‌లో చేర్చాల‌ని సీడీఎం సిఫార్సు చేసింది. దీనిని సాధ్యం చేసే దిశ‌గా ఇండియ‌న్ క‌ల్చ‌ర్ స్ట‌డీ ఫోరమ్ ఏర్పాటు చేసి, అందులో ప్ర‌త్యేకంగా ఫ్యాక‌ల్టీని నియమించాల‌ని కూడా చెప్పింది.

సికింద్రాబాద్‌లోని ఈ సీడీఎం త్రివిధ ద‌ళాల‌కు శిక్ష‌ణ ఇచ్చే సంస్థ‌. ప్రాచీన భార‌త సంస్కృతి, యుద్ధ నీతులు.. వాటిని ప్ర‌స్తుత కాలానికి అనుగుణంగా ఎలా నేర్పించాల‌న్న‌దానిపై సీడీఎం ఓ నివేదిక‌ను రూపొందించింది. వ్యూహాత్మ‌క ఆలోచ‌నా విధానం, నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాల‌ను పెంపొందించ‌డానికి కొన్ని ఎంపిక చేసిన భార‌త‌దేశ ఇతిహాసాల‌ను శిక్ష‌ణ‌లో భాగంగా అందించాల‌ని సిఫార్సు చేశారు.

ఈ ఏడాది మార్చిలో గుజ‌రాత్‌లోని కెవాడియాలో కంబైన్డ్ కమాండ‌ర్స్ కాన్ఫ‌రెన్స్‌లో పాల్గొన్న ప్ర‌ధాని మోదీ భారతీయ సైన్యాన్ని  భార‌తీయీక‌రించాల్సిన అవ‌స‌రం ఉన్న‌ద‌ని పేర్కొన్నారు. అప్ప‌టి నుంచి ర‌క్ష‌ణ వ‌ర్గాలు ఆ దిశ‌గా ప‌ని చేస్తున్నాయి.