టీకాలు వేసుకున్న వారే పండుగ సంబరాలలో పాల్గొనాలి!

వరుసగా ముఖ్యమైన పండుగలు వస్తున్నందున ఈ సందర్భంగా పెద్ద పెద్ద జనసమూహాలను నిరుత్సాహ పరచాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది. పండుగ సంబరాలలో పాల్గొనే వారంతా కరోనా టీకాలు వేసుకున్న వారే అయి ఉండాలని స్పష్టం చేసింది.

పాజిటివిటీ రేటు తగ్గుతున్నప్పటికీ, రెండో వేవ్ కరోనావైరస్ ఇన్‌ఫెక్షన్లు ఇంకా ముగియలేదని పేర్కొంటూ,  ఇంట్లోనే  పండుగలను జరుపుకోవాలని కేంద్రం ప్రజలను కోరింది. “కరోనా నిబంధనలు పాటించండి. టీకాను స్వీకరించండి” అని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ విజ్ఞప్తి చేశారు.

ఆగస్టు 31 తో ముగిసిన వారంలో దేశంలోని 39 జిల్లాలు 10 శాతానికి పైగా వీక్లీ పాజిటివిటీ రేటును నివేదించాయని, 38 జిల్లాలు 5 నుంచి 10 శాతం మధ్య పాజిటివిటీ రేటును చూశాయని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. గత రెండు నెలల్లో అత్యధికంగా గురువారం 47,092 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. 

ప్రస్తుతం 1 లక్షకు పైగా యాక్టివ్ కోవిడ్ -19 కేసులు ఉన్న ఏకైక రాష్ట్రం కేరళ కాగా, నాలుగు రాష్ట్రాలలో 10,000 నుండి 1 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి. అవి మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు,  ఆంధ్రప్రదేశ్. మిగిలిన రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో 10,000 కంటే తక్కువ యాక్టివ్ కేసులు ఉన్నాయని ఆరోగ్య కార్యదర్శి వివరించారు.

దేశంలో టీకాల స్థితికి సంబంధించి, భారతదేశంలోని వయోజన జనాభాలో 16 శాతం మంది కరోనా టీకా రెండు మోతాదులను పొందారని ఆయన పేర్కొన్నారు. కాగా, 54 శాతం మందికి కనీసం మొదటి డోస్ ఇచ్చారు. 

సిక్కిం, దాద్రా నాగర్ హవేలి,  హిమాచల్ ప్రదేశ్‌లలో, వయోజన జనాభాలో 100 శాతం మంది కనీసం ఒక మోతాదు కరోనా టీకాలు  అందుకున్నారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. సార్స్ డెల్టా ప్లస్ వేరియంట్ 300 కేసులను ఇప్పటి వరకు దేశంలో కనుగొన్నారు.