ఆఫ్ఘన్ ప్రభుత్వంలో స్థానం కోసం మహిళల నిరసన

ఆఫ్ఘనిస్థాన్‌లో తదుపరి ఏర్పడే ప్రభుత్వంలో మహిళలకు స్థానం కల్పించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. మహిళా హక్కుల కార్యకర్తలు ఇప్పటి వరకు సాధించిన విజయాలకు తెర పడకూడదనే లక్ష్యంతో ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆఫ్ఘనిస్థాన్ మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం ఇరాన్ సరిహద్దుకు సమీపంలోని హెరాత్ నగరంలో పెద్ద సంఖ్యలో మహిళలు ధర్నా నిర్వహించారు. మహిళా హక్కుల కార్యకర్తలు, ప్రభుత్వోద్యోగాలు చేసే మహిళలు, విద్యార్థినులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. 

తాలిబన్ల ప్రభుత్వంలో మహిళలకు చోటు దక్కక పోవచ్చన్న ఊహాగానాల నేపథ్యంలో ఈ నిరసనలు కీలక ప్రాధాన్యం సంతరించుకున్నాయి. విద్య, భద్రతను , పనిని పొందడం తమ హక్కు అంటూ మహిళలు నినాదాలు చేశారు. ‘‘మహిళలు లేనిదే ఏ ప్రభుత్వమూ కొనసాగదు’’, ‘‘మహిళలను ప్రభుత్వంలో చేర్చుకోవాలి’’ అని రాసి ఉన్న బ్యానర్లతో ప్రదర్శన నిర్వహించారు.

 తమకేం భయం లేదని, తామంతా ఐక్యంగా ఉన్నామని అంటూ దాదాపు 50 మంది మహిళలు ప్లకార్డులతో రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ కేబినెట్‌లో మహిళలకు చోటు కల్పించాలని బసీరా తాహెరీ అనే మహిళ డిమాండ్ చేశారు. తాలిబన్లు తమతో చర్చలు జరపాలని కోరుకుంటున్నామని తెలిపారు. 

అఫ్గాన్ మహిళలకు ఉద్యోగాలు చేసేందుకు అవకాశం కల్పించినప్పటికీ వారికి కేబినెట్‌లో కానీ, ప్రభుత్వ ఉన్నత పదవుల్లో కానీ స్థానం కల్పించే అవకాశం లేదంటూ తాలిబన్ల సీనియర్ నేత మహమ్మద్ అబ్బాస్ ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో పేర్కొనడం గమనార్హం. గతంలో తమ పాలనలో అసమ్మతిని నిర్ధాక్షిణ్యంగా అణచివేసిన తాలిబాన్లకు ఇటువంటి నిరసన ప్రదర్శనలు మింగుడు పడటం లేదు.

నేడే తాలిబన్ల ప్రభుత్వం 

కాగా,  ‘‘ప్రభుత్వ కూర్పుపై కసరత్తు పూర్తయింది. కేబినెట్‌ సభ్యుల పేర్లనూ ఖరారు చేశాం. శుక్రవారం ప్రార్థనల తర్వాత ఆ పేర్లను ప్రకటిస్తాం. ఆ వెంటనే ప్రమాణ స్వీకారాలు జరుగుతాయి. కొత్త ప్రభుత్వం కొలువుదీరుతుంది’’ అని తాలిబాన్ల రాజకీయ విభాగం ఉప నేత షేర్‌ మహమ్మద్‌ అబ్బాస్‌ స్థానిక్జాయ్‌ ప్రకటించారు. గత ప్రభుత్వంలో పనిచేసిన నేతలు మినహా.. గిరిజనులు, మహిళలు.. ఇలా అన్ని వర్గాలకు కొత్త సర్కారులో ప్రాతినిధ్యం ఉంటుందని వెల్లడించారు.