జాతీయ రాజకీయాలపై కేసీఆర్ పగటి కలలు

ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఖచ్చితంగా నెరవేరే అవకాశాలు లేని జాతీయరాజకీయాలపై పగటి కలలు కంటున్నారని బిజెపి రాష్ట్ర ప్రధాన అధికార ప్రతినిధి కె కృష్ణసాగరరావు ఎద్దేవా చేశారు. ఢిల్లీలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి భూమి పూజ చేయడం అనేది ఏదైనా కొత్త భవనానికి సాధారణ ఆచారం అని  పేర్కొన్నారు.

అయితే ఏదేమైనా, సిఎం కెసిఆర్ ఏ రెగ్యులర్ ఈవెంట్‌కైనా బహిరంగ కార్యక్రమం చేయడం అలవాటు ఉన్నదని గుర్తు చేశారు. భారీ భవనాలు కట్టడమే గాని వాటిల్లో పనిచేసే అలవాటు కేసీఆర్ కు లేదని స్పష్టం చేసారు.  సచివాలయం, అసెంబ్లీ వంటి ఉదాహరణలు `భవన నిర్మాణం’ పట్ల ఆయనకున్న మక్కువను వెల్లడి చేస్తున్నాయని చెప్పారు. 

జాతీయ రాజకీయాలలో రాణించే దృష్టితోనే ఆయన ఢిల్లీలో పార్టీ భావన భూమిపూజకు హడావుడి చేతున్నారని అంటూ భారతదేశంలో ప్రతిపక్ష పార్టీలో ఎవరూ కెసిఆర్, ఆయన పార్టీ టిఆర్‌ఎస్‌తో పనిచేయడానికి విశ్వసనీయమైన, నమ్మదగిన వారుగా భావించడం లేదని కృష్ణసాగరరావు స్పష్టం చేశారు. ఇదే ఆయనకు చివరిసారిగా ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశం అని కూడా తేల్చి చెప్పారు.

దేశ రాజ‌ధాని ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర స‌మితి పార్టీ కార్యాల‌యానికి ఇవాళ శంకుస్థాప‌న జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా జ‌రిగిన భూమి పూజ‌లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. మొత్తం దక్షిణాది రాష్ట్రాలలోని ఒక ప్రాంతీయ పార్టీ ఢిల్లీలో కార్యాలయ భవనం నిర్మించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.

తెలంగాణ ప్ర‌భుత్వ ప‌నితీరును దేశం న‌లుమూల‌ల‌ తెలియ‌జేయడానికి తెలంగాణ భ‌వ‌న్‌ ఒక వేదిక కాబోతుంద‌ని అని  రాష్ట్ర రోడ్లు, భ‌వ‌నాల శాఖ మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డి ఈ సందర్భంగా పేర్కొనడం గమనిస్తే జాతీయ రాజకీయాలలో గుర్తింపు కోసమే ఈ నిర్మాణం చేపట్టిన్నట్లు వెల్లడి అవుతుంది.