నీటి అవసరాలున్నప్పుడే శ్రీశైలం నుండి జలవిద్యుత్‌

నాగార్జునసాగర్‌, కృష్ణా డెల్టా పరిధిలో సాగు, తాగు నీటి అవసరాలు ఉన్నప్పుడు మాత్రమే శ్రీశైలం ప్రాజెక్టు నుండి జలవిద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని కృష్ణా నది యాజమాన్య బోర్డు తెలుగు రాష్ట్రాలకు స్పష్టం చేసింది. దీనికి భిన్నంగా వ్యవహరించి విద్యుత్‌ ఉత్పత్తి చేస్తే నీరు వృథాగా సముద్రం పాలవుతుందని దీనిని సమర్ధించలేమని పేర్కొంది. 
 
నీటి అవసరాలున్నప్పుడే విద్యుత్‌ ఉత్పత్తి చేసే విధానాన్ని రెండు తెలుగు రాష్ట్రాలు తప్పనిసరిగా పాటించాలని సూచించింది. అయితే, ఈ నిర్ణయంపై తెలగాణ ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. తెలంగాణ తరపున హాజరైన అధికారులు సమావేశం నుండి వాకౌట్‌ చేశారు. కెఆర్‌ఎంబి చైర్మన్‌ ఎంపి సింగ్‌ అధ్యక్షతన బోర్డు సమావేశం బుధవారం హైదరాబాద్‌లోని జలసౌధలో జరిగింది. 
 
ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల అధికారులు హాజరయ్యారు.సుమారు ఐదు గంటల పాటు జరిగిన ఈ సమావేశం  ప్రారంభం కాగానే ట్రిబ్యునల్‌ తీర్పు వచ్చే వరకు కృష్ణా జలాలను రెండు రాష్ట్రాలు సమనిష్పత్తిలో వినియోగించుకునేలా కేటాయింపులు జరపాలని తెలంగాణ డిమాండ్‌ చేసింది. 
 
గతంలో 512:219 నిష్పత్తిలో నీటి కేటాయింపులకు తెలంగాణ అంగీకరించినా అది కేవలం 2015-16 సంవత్సరానికి మాత్రమే వర్తిస్తుందని తెలంగాణ అధికారులు వాదించారు. ఈ వాదనను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తోసిపుచ్చింది. ట్రిబ్యునల్‌ ఇప్పటికే చేసిన కేటాయింపుల ప్రకారమే నీటి పంపిణీ జరగాలని పేర్కొంది.
 
గతంలో ఒప్పందాలు, ట్రిబ్యునల్‌ తీర్పు మేరకే తమ రాష్ట్రం కృష్ణా జలాలను వినియోగించుకుంటోందని, ఎక్కడా నిబంధనలను అతిక్రమించలేదని ఎపి ఇరిగేషన్‌ కార్యదర్శి జె.శ్యామలరావు, కృష్ణా నది జలాల వినియోగానికి సంబంధించి ఎపి ఇంజినీరింగ్‌ ఇన్‌ చీఫ్‌ నారాయణరెడ్డి బోర్డుకు తెలిపారు. దీనిపై బోర్డు సుదీర్ఘంగా చర్చించింది.
శ్రీశైలంలో తెలంగాణ ప్రభుత్వం అవసరానికి మించి జలవిద్యుదుత్పత్తి చేసి నీటిని దిగువకు వదలడం వల్ల కృష్ణా డెల్టా రైతాంగానికి తీవ్ర నష్టం జరుగుతోందని ఆంధ్రప్రదేశ్‌ అధికారులు బోర్డు దృష్టికి తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన వివరాలను అందచేశారు.  దీనిపై స్పందించిన బోర్డు ఛైర్మన్‌ కృష్ణా డెల్టా పరిధిలో నీటి అవసరాలున్నప్పుడు మాత్రమే శ్రీశైలంలో జలవిద్యుదుత్పత్తి చేసి నీటిని దిగువకు విడుదల చేయాలని స్పష్టం చేశారు. ఈ నిర్ణయంపై తెలంగాణ అధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
శ్రీశైలంలో విద్యుదుత్పత్తి ఆపమని చెప్పడానికి కెఆర్‌ఎంబికి ఎటువంటి ఆధారమూ లేదని తెలంగాణ ఇరిగేషన్‌ శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్‌ రజత్‌కుమార్‌ వాదించారు. జలవిద్యుదుత్పత్తి ద్వారా 180 టిఎంసిలను నాగార్జునసాగర్‌కు విడుదల చేయాల్సి ఉందని, ఇదే విషయాన్ని బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ కూడా ధ్రువీకరించిందని ఆయన బోర్డు దృష్టికి తీసుకెళ్లారు.
తెలంగాణకు జల విద్యుదుత్పత్తి చాలా అవసరమని, భౌగోళిక స్వరూపం దృష్ట్యా ఎత్తిపోతల పథకాల ద్వారా తాగు, సాగునీరు ఇవ్వాల్సి ఉందని, వ్యవసాయ బోరు బావులకు కూడా విద్యుదుత్పత్తి కావాలని పేర్కొన్నారు. శ్రీశైలం ప్రాజెక్టును జల విద్యుదుత్పత్తి కోసమే నిర్మించారని మరోసారి గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టులో జలవిద్యుదుత్పత్తి తప్పనిసరిగా చేస్తామని, ఆంధ్రప్రదేశ్‌ విద్యుదుత్పత్తి చేసినా అభ్యంతరం లేదని రజత్‌కుమార్‌ తెలిపారు.
కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్‌ అక్రమంగా బేసిన్‌ అవతలకి తరలిస్తున్నా నిరోధించడంలో బోర్డు విఫలైందని తెలంగాణ ఆరోపించింది. ట్రిబ్యునల్‌ తీర్పులను కచ్చితంగా అమలుచేయాలని డిమాండ్‌ చేసింది. అనంతరం సమావేశం నుంచి తెలంగాణ అధికారులు బయటకు వచ్చేశారు.
ఆ తర్వాత కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల సంయుక్త సమావేశం జరిగింది. కెఆర్‌ఎంబి, జిఆర్‌ఎంబి చైర్మన్లు ఎంపి సింగ్‌, చంద్రశేఖర్‌ అయ్యర్‌ నేతృత్వంలో జరిగిన ఉమ్మడి భేటీలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ అధికారులు పాల్గన్నారు. కేంద్రం జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలు కార్యాచరణపై సమావేశంలో చర్చించారు.