గణేశ్‌ ఉత్సవాలపై ప్రజల సెంటిమెంట్‌ను గౌరవించాలి

వినాయక నిమజ్జనం హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌లో నిషేధించాలని న్యాయవాది వేణుమాధవ్ వేసిన పిటిషన్‌పై బుధవారం తెలంగాణ హైకోర్టు విచారణ చేసింది. ప్రజల సెంటిమెంట్‌ను గౌరవిస్తూనే.. ప్రస్తుత పరిస్థితులు కూడా చూడాలని హైకోర్టు పేర్కొంది.  నిమజ్జనం సందర్భంగా ఆంక్షలు, నియంత్రణ చర్యలు సూచించాలని హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశించింది. 
ప్రభుత్వం, గణేష్ ఉత్సవ సమితి, పిటిషనర్ నివేదికలు సమర్పించాలని కోరింది. కరోనా పరిస్థితులు, కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకోవాలని ధర్మాసనం సూచించింది. స్థానికంగానే నిమజ్జనం చేస్తే బాగుంటుందని హైకోర్టు పేర్కొంది. సామూహిక నిమజ్జనంతో హుస్సేన్ సాగర్ దెబ్బతినకుండా చూడాలని న్యాయస్థానం తెలిపింది. అందరి సూచనలు పరిగణనలోకి తీసుకొని ఈ నెల 6వ తేదీన తగిన ఆదేశాలు జారీ చేస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. 
ట్యాంక్‌బండ్‌పై నిమజ్జనం చేస్తే పెద్ద ఎత్తున ప్రజలు గుమికూడడంతో కరోనా వ్యాప్తి పెరగడంతో పాటు హుస్సేన్‌సాగర్‌లో రసాయనాలు పెరిగిపోతాయని పిటిషనర్‌ వాపోయాడు. వాదన విన్న హైకోర్టు సమర్ధిస్తూనే ప్రభుత్వం ఎక్కడికక్కడ నిమజ్జనం ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని అభిప్రాయం చెప్పింది. ఈ పిటిషన్‌పై తుది ఆదేశాలు ఈ నెల 6వ తేదీన రానున్నాయి.
జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో 50 వేల ఉచిత గణేశ్‌ మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్నామని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది హరీందర్‌ హైకోర్టుకు నివేదించారు. ఎవరికి వారు ఇంట్లోనే మట్టి వినాయకులను నిమజ్జనం చేసుకోవాలని సూచిస్తున్నామని తెలిపారు. ‘జంటనగరాల జనాభా ఎంత, మీరిచ్చే 50 వేల ఉచిత విగ్రహాలు ఎలా సరిపోతాయి, విగ్రహాలు ఉచితంగా పంపిణీ చేశాం, మన బాధ్యత అయిపోయిందని అనుకుంటే ఎలా’అని ధర్మాసనం ప్రశ్నించింది.
ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌తో భారీ విగ్రహాలు ఏర్పాటు చేయకుండా, మట్టివిగ్రహాలను ఏర్పాటు చేసేలా చూడాలని, సహజ రంగులనే వినియోగించేలా చర్యలు తీసుకోవాలని పిటిషనర్‌ కోరారు. ‘హుస్సేన్‌సాగర్‌లో గణేశ్‌ విగ్రహాల నిమజ్జనంపై కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) అనేక సూచనలు చేసింది. వాటి అమలు తీరును పర్యవేక్షించడం మరిచింది. పీసీబీ సూచనలను ఇతర విభాగాల అధికారులు పాటించకపోతే వారిపైనా చర్యలు తీసుకోవచ్చు. అయినా ఎందుకు మౌనంగా ఉంటోంది’’అని పీసీబీ తరఫున హాజరైన న్యాయవాది శివకుమార్‌ను ధర్మాసనం ప్రశ్నించింది.