గోవును జాతీయ జంతువుగా ప్రకటించండి 

కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో “గోవుల రక్షణ” కోసం ఒక బిల్లును తీసుకు రావాలని, “గోసంరక్షణ”ను హిందువుల ప్రాధమిక హక్కుగా ప్రకటించాలని అలహాబాద్ హైకోర్టు సూచించింది. ఉత్తర ప్రదేశ్ లో ఆవు హత్య నిరోధక చట్టం కింద అరెస్ట్ అయిన ఒక  వ్యక్తి  బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి శేఖర్ కుమార్ యాదవ్ ఈ సూచన చేశారు. గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కూడా సూచించారు.
“పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలి. గోవుల రక్షణ హిందువుల ప్రాథమిక హక్కుగా ఉండాలి ఎందుకంటే దేశ సంస్కృతి, విశ్వాసం దెబ్బతిన్నప్పుడు దేశం బలహీనంగా మారుతుందని మాకు తెలుసు” అని జస్టిస్ యాదవ్ స్పష్టం చేశారు. 
యుపి గోవధ నిరోధక చట్టం కింద ఐపీసీ సెక్షన్ 379 కేసులో గత ఫిబ్రవరిలో సంబల్ జిల్లాలో అరెస్ట్ అయినా జావేద్ గత మార్చ్ 8 నుండి జైలులో ఉన్నాడు. సంఘటన జరిగిన చోట అతను లేనందున అతనిపై గోవధ ఆరోపణలు వాస్తవం కాదని, పోలీసులతో కుమ్మక్కై నకిలీ  కేసు నమోదు చేశారు అంటూ బెయిల్ పిటీషన్ లో వాదించారు.

జస్టిస్ యాదవ్ బెంచ్ తన 12 పేజీల ఉత్తర్వులో హిందీలో ఇలా చెప్పింది: “కొందరి రుచి కోసం మీరు ప్రాణాలు తీయలేరు … చంపే హక్కు కంటే జీవించే హక్కు ఎక్కువ … ఆవు మాంసం తినడం ఎప్పటికీ  ప్రాథమిక హక్కు కాదు … ఆవు మాంసం తినేవారికి ప్రాథమిక హక్కులు అక్కరకు రావు. ఆవుపై ఆధారపడిన వారికి, ఆవులను ఆరాధించే వారికి కూడా అర్థవంతమైన జీవితానికి హక్కు ఉంటుంది”.

“ఆక్సిజన్‌ని పీల్చి, వదిలే పీల్చే ఏకైక జంతువు ఆవు అని శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు” అని న్యాయమూర్తి పేర్కొన్నారు.
“ఆవు పాలు, పెరుగు, వెన్న, మూత్రం, ఆవు పేడతో చేసిన పంచకవ్యం కొన్ని వ్యాధుల చికిత్సలో ప్రయోజనకరంగా ఉంటుంది.  హిందూ మతం ప్రకారం, ఆవులో 33 మంది దేవతలు నివసిస్తున్నారు” అని జస్టిస్ యాదవ్ వివరించారు. 

 
“కేవలం హిందువులే కాదు. ముస్లింలు భారతీయ సంస్కృతిలో ఆవు  ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నారు. బాబర్, అక్బర్, హుమయూన్ వంటి ముస్లిం పాలకులు తమ పండుగలలో గోవధను నిషేధించారు” అని న్యాయమూర్తి గుర్తు చేశారు. మంగళ్ పాండే నేతృత్వంలోని 1857 తిరుగుబాటును కూడా న్యాయమూర్తి ప్రస్తావిస్తూ  “భారతదేశ సంస్కృతి, ఆవులపై అఘాయిత్యాలకు వ్యతిరేకంగా భారతదేశంలోని ప్రతి పౌరుడు నిలబడిన సంఘటనలతో చరిత్ర నిండి ఉంది” అని తెలిపారు.

“భారతదేశంలో ఎక్కువ మంది ముస్లింలు గోవధను నిషేధించడానికి అనుకూలంగా ఉన్నారు” అని పేర్కొంటూ, జస్టిస్ యాదవ్  “గోసంరక్షణ భారతీయ సంస్కృతికి పర్యాయపదంగా ఉంది, ఒక మతానికి మాత్రమే పరిమితం కాదు, కానీ ఇక్కడ నివసించే పౌరులందరూ మతంతో సంబంధం లేకుండా పాటించాలి” అని స్పష్టం చేశారు.

“… మన సంస్కృతి గురించి మనం మర్చిపోయిన ప్రతిసారీ, విదేశీయులు మనపై దాడి చేసి, మనల్ని బానిసలుగా చేసుకున్నారు, ఈరోజు కూడా మనం అప్రమత్తంగా ఉండకపోతే, తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్‌ను స్వాధీనం చేసుకున్న ఉదాహరణ మన ముందు ఉంది  మనం దానిని మర్చిపోకూడదు,” జస్టిస్ యాదవ్ తన ఉత్తర్వులో హెచ్చరించారు. ఆవుకు  హాని కలిగించే వాటి గురించి మాట్లాడే వారిపై, ఆవుల రక్షణ కోసం పని చేస్తున్నట్లు నటించే వారిపై కూడా గోసంరక్షణ బిల్లు కఠినంగా ఉండాలని ఆయన సూచించారు. 

 
జావెద్ బెయిల్ దరఖాస్తును జస్టిస్ యాదవ్ తిరస్కరిస్తూ, ప్రాథమికంగా, నేరం అతనే చేసినట్లు అనిపిస్తోందని స్పష్టం చేశారు. సమాజంలో శత్రుత్వానికి దారితీసే గోవధకు ఇది తన మొదటి నేరం కాదని న్యాయమూర్తి తన ఆదేశంలో పేర్కొన్నారు. “… అతను బెయిల్‌పై విడుదలైతే, అతను మళ్లీ అదే నేరానికి పాల్పడతాడు, అది సమాజంలో ఉద్రిక్తతకు దారితీస్తుంది” అని న్యాయమూర్తి తెలిపారు.