ఫేస్‌బుక్‌, ట్విట్ట‌ర్‌, యూట్యూబ్‌పై చీఫ్ జ‌స్టిస్ ఆగ్ర‌హం

సోష‌ల్ మీడియాల్లో వ్యాప్తి చెందుతున్న న‌కిలీ వార్త‌ల ప‌ట్ల ఇవాళ సుప్రీంకోర్టు ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌, ట్విట్ట‌ర్ లాంటి సంస్థ‌ల్లోనూ న‌కిలీ వార్త‌లు వ్యాపిస్తున్నాయ‌ని, ఇలాంటి సంస్థ‌లు జ‌డ్జ్‌ల‌కు కూడా స్పందించ‌డంలేద‌ని సుప్రీంకోర్టు పేర్కొన్న‌ది. ఎఫ్‌బీ, ట్విట్ట‌ర్‌, యూట్యూబ్ లాంటి సంస్థ‌లు కేవ‌లం శ‌క్తివంత‌మైన మ‌నుషుల‌కు మాత్ర‌మే స్పందిస్తున్నాయ‌ని, న్యాయ‌వ్య‌వ‌స్థ‌ల ప‌ట్ల సోష‌ల్ మీడియా సంస్థ‌ల‌కు జవాబుదారీత‌నం లేద‌ని సుప్రీంకోర్టు వెల్ల‌డించింది. 

ట్విట్ట‌ర్‌, ఎఫ్‌బీ, యూట్యూబ్ లాంటి ఛాన‌ళ్లు న్యాయ‌వ్య‌వ‌స్థ ప‌ట్ల స్పంద‌న ఇవ్వ‌డం లేద‌ని, న్యాయ‌వ్య‌వ‌స్థ గురించి అవి చెడుగా రాశాయ‌ని, స్పందించ‌క‌పోవ‌డ‌మే కాకుండా, అది త‌మ హ‌క్కుగా పేర్కొంటున్నాయ‌ని చీఫ్ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ త‌న తీర్పులో పేర్కొన్నారు.

కోవిడ్‌19 వ్యాప్తికి ఢిల్లీలో మార్చి 2020లో జ‌రిగిన త‌బ్లిగ్ జ‌మాత్ కార‌ణ‌మ‌ని సోష‌ల్ మీడియాలో వార్త‌లు వ్యాపించాయి. దానిపై వేసిన పిటిష‌న్ల‌ను ఇవాళ సుప్రీం విచారించింది. ఈ సంద‌ర్భంగా ఎన్వీ ర‌మ‌ణ వ్యాఖ్యానిస్తూ  అలాంటి సంద‌ర్భాల్లో సోష‌ల్ మీడియా వేదిక‌ల్లో వార్త‌ల‌కు మ‌తం రంగు పూస్తున్నార‌ని పేర్కొన్నారు. 

మీరు యూట్యూబ్‌లో చూస్తే తెలుస్తుంది, దాంట్లో ఎంత ఫేక్ న్యూస్ ఉంటుందో, వెబ్ పోర్టల్స్‌ను నియంత్రించే సంస్థ‌లు లేవు, ప్ర‌తివార్త‌కు మ‌త కోణాన్ని చూపిస్తున్నార‌ని, అదే స‌మ‌స్య అని, ఇది దేశానికి చెడు పేరు తీసుకువ‌స్తుంద‌ని చీఫ్ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ తెలిపారు. 

2021 ఐటీ చ‌ట్టం సోష‌ల్ మీడియాను నియంత్రిస్తుంద‌ని సోలిసిట‌ర్‌జ‌న‌ర‌ల్ తుషార్ మెహ‌తా స‌మాధానం ఇచ్చారు. మ‌ళ్లీ ఆరు వారాల్లోగా ఈ కేసులో విచార‌ణ చేప‌ట్ట‌నున్న‌ట్లు సీజే తెలిపారు. ఇక వివిధ హైకోర్టుల్లో దాఖలైన సోషల్ మీడియా కేసులకు సంబంధించిన పిటిషన్లన్నింటినీ సుప్రీం కోర్టుకు బదిలీ చేసి విచారించాలని కేంద్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిపై ధర్మాసనం స్పందించింది.

అన్ని పిటిషన్‌లను కలిపి విచారించడంపై నిర్ణయం తీసుకునేందుకు కేసును ఆరు వారాల తర్వాల లిస్ట్ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సీజీఐ ఎన్వీ రమణ సూచించారు. ఆ తర్వాత సోషల్ మీడియా కేసులన్నీ సుప్రీంకోర్టుకు బదిలీ చేయడంపై నిర్ణయం తీసుకోనున్నారు.