నారద స్టింగ్ కేసులో ఈడీ ఛార్జ్‌షీట్‌

టిఎంసి నేతల అవినీతి చర్యలను వెల్లడించిన నారద స్టింగ్ ఆపరేషన్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) బుధవారం ప్రత్యేక కోర్టుకు ఛార్జ్‌షీట్‌ సమర్పించింది. పశ్చిమ బెంగాల్ మంత్రులు ఫిర్హాద్ హకీమ్, సుబ్రతా ముఖర్జీ, టీఎంసీ ఎమ్మెల్యే మదన్ మిత్రా, కోల్‌కతా మాజీ మేయర్ సోవన్ ఛటర్జీలను ఈడీ ఛార్జ్‌షీట్‌లో చేర్చింది.

ప్రత్యేక కోర్టు ఛార్జ్‌షీట్‌లోని నలుగురు టీఎంసీ నేతలకు సమన్లు జారీచేసింది. సెప్టెంబర్‌ 16హాజరు కావాలని పేర్కొంది. టిఎంసి నేతలతో పాటు సస్పెండ్ చేయబడిన ఐపీఎస్‌ అధికారి ఎస్‌ఎంహెచ్‌ మీర్జాకు కూడా కోర్టు నోటీసు పంపింది. ముఖర్జీ, హకీమ్‌, మిత్రాకు రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ కార్యాలయం ద్వారా సమన్లు అందజేయాలని కోర్టు ఆదేశించింది.

మిగిలిన ఇద్దరికి నేరుగా వారి చిరునామాలకు సమన్లు పంపిస్తున్నామని పేర్కొంది. ఇక ఈ ఏడాది సీబీఐ ముఖర్జీ, హకీమ్‌, మిత్రా, సోవన్ ఛటర్జీలను అరెస్ట్‌ చేయగా.. వారికి మే నెలలో కోల్‌కతా హైకోర్టు తాత్కాలిక బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే. హ‌కీం, ముఖ‌ర్జీ, మిత్రా, ఛ‌ట‌ర్జీల ప్రాసిక్యూష‌న్‌కు సీబీఐకి బెంగాల్ గ‌వ‌ర్న‌ర్ జ‌గ్దీప్ ధంక‌ర్ అనుమతించిన నేప‌థ్యంలో వారిని అరెస్ట్ చేశారు. 2016లో ఈ స్కామ్ వెలుగుచూసిన స‌మ‌యంలో ఈ న‌లుగురు నేత‌లు మ‌మ‌తా బెన‌ర్జీ ప్ర‌భుత్వంలో మంత్రులుగా ఉన్నారు.

 ఇటీవ‌ల జ‌రిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో హ‌కీం, ముఖ‌ర్జీ, మిత్రా తిరిగి ఎన్నిక‌వ‌గా, టీఎంసీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన ఛ‌ట‌ర్జీ ప్ర‌స్తుతం రెండు పార్టీల‌కు దూరంగా ఉన్నారు. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో అవినీతిని బయటపెట్టడం కోసం ‘నారద న్యూస్’ అనే న్యూస్ ఔట్‌లెట్ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించింది. దీనినే నారద స్టింగ్ ఆపరేషన్ అంటారు.

నారద న్యూస్ వ్యవస్థాపకుడు మాథ్యూ శామ్యూల్ 2014-2016 మధ్య కాలంలో దాదాపు 12 మంది టీఎంసీ నేతలపైనా, ఓ ఐపీఎస్ అధికారి పైన స్టింగ్ ఆపరేషన్ నిర్వహించారు. 2014లో ఈ స్టింగ్ ఆపరేషన్ జరిగినప్పటికీ, 2016లో ‘తెహల్కా’ ప్రచురించింది. పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికలకు ముందు దీనిని వెలుగులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.