25 బిలియన్ డాలర్లకు భారత్- వియత్నాం ద్వైపాక్షిక వాణిజ్యం

25 బిలియన్ డాలర్లకు భారత్- వియత్నాం ద్వైపాక్షిక వాణిజ్యం

ద్వైపాక్షిక సంబంధాలను సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి చేర్చడంతో పాటు 2030 నాటికి 25 బిలియన్ డాలర్లకు చేరుకోవాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నాయి. భారత్‌, వియత్నాం నిర్ణయించాయి. ఆర్థిక, రక్షణ సహకారాన్ని మరింత విస్తరించాలని నిశ్చయించాయి. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం కోసం సంయుక్తంగా చర్యలు చేపట్టాలన్న అవగాహనకు వచ్చాయి.  

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, వియత్నాం అధ్యక్షుడు తో లామ్ మధ్య జరిగిన చర్చల అనంతరం ఇరుపక్షాలు 13 ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందాలు డిజిటల్ చెల్లింపులు, అరుదైన ఖనిజాలు, ఫార్మాస్యూటికల్స్, విద్య, బ్యాంకింగ్, సంస్కృతితో సహా పలు రంగాలలో లోతైన ద్వైపాక్షిక సంబంధాలకు అవకాశం కల్పిస్తాయి.  భారత పర్యటనకు వచ్చిన వియత్నాం అధ్యక్షుడు టో లాం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయిన సందర్భంగా  సంయుక్త సమావేశంలో ప్రసంగిస్తూ భారత్ అనుసరిస్తున్న ‘యాక్ట్ ఈస్ట్’ విధానంలో వియత్నాం కీలక దేశమని తెలిపారు.

వియత్నాం సహకారంతో ఆసియాన్‌ దేశాలతో భారత్‌ సంబంధాలను మరింత విస్తరిస్తామని చెప్పారు.  ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, శ్రేయస్సు కోసం వియత్నాంతో కలిసి భారత్ పని చేస్తుందని తెలిపారు. పహల్గాం ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండించి, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం చేస్తున్న పోరాటంలో అండగా నిలిచినందుకు వియత్నాంకు కృతజ్ఞతలు తెలిపారు. 

ఆర్థిక అనుసంధానతను పెంపొందించేందుకు రెండు దేశాల కేంద్ర బ్యాంకుల మధ్య సహకారాన్ని బలోపేతం చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు మోదీ వెల్లడించారు. ఇందులో భాగంగా యూపీఐ వ్యవస్థను వియత్నాం ఫాస్ట్ పేమెంట్ సిస్టమ్‌తో త్వరలో అనుసంధానం చేయనున్నట్లు ప్రధాని వివరించారు. ఇరు దేశాల మధ్య భద్రత సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించినట్లు వియత్నాం అధ్యక్షుడు టో లాం తెలిపారు.

“2030 నాటికి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 25 బిలియన్ డాలర్లకు తీసుకెళ్లేందుకు అనేక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నాం. మన ఔషధ అధికార వర్గాల మధ్య కుదిరిన ఈ అవగాహన ఒప్పందం వియత్నాంలో భారతీయ ఔషధాల లభ్యతను పెంచుతుంది. వియత్నాంకు భారతీయ వ్యవసాయ, మత్స్య, పశు ఉత్పత్తుల ఎగుమతి కూడా సులభతరం కాబోతోంది” అని ప్రధాని మోదీ తెలిపారు.

 
త్వరలోనే భారతదేశపు ద్రాక్ష, దానిమ్మ పండ్లను వియత్నాం రుచి చూస్తుందని, అలాగే మనం వియత్నాం పోమెలో పండ్లను రుచి చూస్తామని చెప్పారు.  అంతేకాకుండా, ఈ ఏడాది చివరి నాటికి భారత్-ఆసియాన్ వాణిజ్య ఒప్పందాన్ని ఆధునీకరించడానిక అంగీకరించామని, ఇది భారతదేశానికి, అన్ని ఆసియాన్ దేశాలకు మధ్య వాణిజ్యానికి, పెట్టుబడులకు కొత్త ఊపునిస్తుందని తెలిపారు. కీలక ఖనిజాలు, అరుదైన భూలోహాలు, ఇంధన సహకారంలో కొత్త కార్యక్రమాలు మన రెండు దేశాల ఆర్థిక భద్రతను, సరఫరా గొలుసు మెరుగుపరుస్తాయని పేర్కొన్నారు.