ఐదు అసెంబ్లీ ఎన్నికల్లో రూ.1,444.96 కోట్లకు పైగా జప్తు

ఐదు అసెంబ్లీ ఎన్నికల్లో రూ.1,444.96 కోట్లకు పైగా జప్తు

తాజాగా జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, ఉప ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఉద్దేశించిన నగదు, మద్యం, డ్రగ్స్, ఇతర వస్తువులను భారీ ఎత్తున సీజ్ చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం(ఇసిఐ) వెల్లడించింది. ఈ మొత్తం విలువ రూ.1,444.96 కోట్లకు పైగా ఉంటుందని తెలిపింది.  ఇందులో నగదు రూ.154.89 కోట్లు, మద్యం విలువ రూ.183.33 కోట్లు (69,88,793.38 లీటర్లు), డ్రగ్స్ రూ.337.88 కోట్లు, విలువైన లోహాలు రూ.250.14 కోట్లు, ఉచితాలు తదితరాల విలువ రూ.518.73 కోట్లని ఇసిఐ వివరించింది. ఈ మేరకు గురువారం ఒక ప్రకటనలో ఈ వివరాలను వెల్లడించింది. 

ఎన్నికల అక్రమాలను అరికట్టేందుకు ‘ఎలక్షన్ సీజర్ మేనేజ్‌మెంట్ సిస్టమ్’ (ఇఎస్ఎంఎస్) అనే ఐటి ప్లాట్‌ఫామ్ ను వినియోగిం చినట్లు తెలిపింది. దీని ద్వారా వివిధ ఏజెన్సీల మధ్య సమన్వయం మెరుగుపడి సమాచార మార్పిడి వేగవంతమైందని వెల్లడించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 26న ఇఎస్ఎంఎస్ యాక్టివేట్ చేసినప్పటి నుంచి మే 6 వరకు పట్టుబడిన మొత్తం సొత్తు వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. 

ఎన్నికలు జరిగిన అన్ని ప్రాంతల్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసిసి) పటిష్టంగా అమలు చేసినట్లు తెలిపింది. అయితే బెంగాల్ లోని ఫాల్టా (144) అసెంబ్లీ నియోజకవర్గం మినహా మిగిలిన అన్ని చోట్లా మోడల్ కోడ్ ముగిసినట్లు పేర్కొంది. ఈ ఐదు రాష్ట్రాల్లో గత ఎన్నికల్లో పట్టుబడిన సొత్తు తో పోల్చితే తాజా ఎన్నికల్లో స్వాధీనం చేసుకొన్న సొమ్ము ఏకంగా 40.14 శాతం పెరిగింది. 2021 సాధారణ ఎన్నికల్లో రూ.1029.93 కోట్లు రికవరీ చేసినట్లు ఇసిఐ వెల్లడించింది.

కాగా ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఉద్దేశించన డబ్బులో ఎక్కువ భాగం తమిళనాడులోనే స్వాధీనం చేసుకోవడం గమనార్హం. తమిళనాడులో అత్యధికంగా రూ.662.28 కోట్లు సీజ్ చేయగా పశ్చిమ బెంగాల్ రూ.573.41 కోట్లతో రెండో స్థానంలో ఉంది. అస్సాంలో రూ.117.24 కోట్లు, కేరళలో రూ.80.67 కోట్లు, పుదుచ్చేరిలో రూ.9.72 కోట్లు పట్టుబడినట్లు ఇసి వెల్లడించింది.