ఖాదీని ‘జాతీయ వస్త్రాలు’గా పరిగణించి ధరిద్దాం

ఖాదీ వస్త్రాలను ‘జాతీయ వస్త్రాలు’గా భావించి గర్వంగా ధరించడమే కాకుండా విస్తృతంగా ప్రచారం చేయాలని భారత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు సూచించారు. ఖాదీ వస్త్రాల వాడకాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు వివిధ రంగాల ప్రముఖులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. 

‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ (కేవీఐసీ) నిర్వహించిన ‘ఖాదీ ఇండియా క్విజ్ పోటీ’లను ఉపరాష్ట్రపతి ప్రారంభింభిస్తూ ఈ పోటీలు మన స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ మన మూలాల్లోకి తిరిగి వెళ్ళేందుకు చక్కటి మార్గమని తెలిపారు.

భారత స్వాతంత్య్ర సంగ్రామాన్ని దేశభక్తి, ధైర్యం, స్థితిస్థాపకతల వీరగాధగా వెంకయ్యనాయుడు అభివర్ణించారు. మానవ చరిత్రలో భారత స్వాతంత్య్ర సంగ్రామం అసమానమైన గొప్ప అంశంగా పేర్కొన్నారు. మన స్వాతంత్య్ర సమరయోధుల జీవితాల నుంచి నేర్చుకోవలసింది ఎంతో ఉన్నదన్న ఆయన, ముఖ్యంగా మన మాతృభూమి ప్రయోజనాలను అన్నిటికంటే గొప్పవిగా భావించే స్ఫూర్తి వారి నుంచి లభిస్తుందని తెలిపారు.

గడచిన ఏడేండ్లలో ఖాదీ అభివృద్ది పట్ల జరుగుతున్న కార్యక్రమాలపై సంతోషాన్ని వ్యక్తం చేసిన ఉపరాష్ట్రపతి  వృద్ధిని వేగవంతం చేసిన ప్రభుత్వం, కేవీఐసీతోపాటు భాగస్వాములందరినీ ప్రశంసించారు. ఖాదీకి విద్యుత్ తప్ప ఎలాంటి ఇతర ఇంధనాల అవసరం లేదని, ఖాదీ తయారీలో ఏవిధమైన కర్బన ఉద్గారాలు విడుదల కావని పేర్కొన్నారు. 

యూనిఫామ్స్ కోసం ఖాదీని విస్తృతంగా వినియోగించాలని విద్యా సంస్థలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సూక్ష్మ. చిన్న, మధ్యతరహా పరిశ్రమల కేంద్ర మంత్రి నారాయణ్ రాణె, సహాయమంత్రి భాను ప్రతాప్ సింగ్ వర్మ, కార్యదర్శి బీబీ స్వైన్ తదితరులు పాల్గొన్నారు.