జలియన్‌వాలా బాగ్ పై రాహుల్ కు అమరిందర్ షాక్!

ఏ సందర్భం వచ్చినా ప్రధాని నరేంద్ర మోదీపై ఒంటెత్తు విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ధోరణి ఆ పార్టీ నేతలకే మింగుడు పడటం లేదు. తాజాగా మన దేశ చరిత్రలో బ్రిటిష్ వారి దారుణమైన నరమేధంకు ప్రత్యక్ష నిదర్శనంగా మిగిలిన జలియన్‌వాలా బాగ్ ఆధునీకరణపై రాహుల్ చేసిన విమర్శలు కలకలం రేపుతున్నాయి. 

ఆధునికీకరణ తర్వాత జలియన్ వాలా బాగ్ స్మారక కేంద్రాన్ని ఆగస్టు 28న వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. ఈ సముదాయంలోని ప్రదర్శన శాలలను కూడా ప్రారంభించారు. గతంలో జరిగిన సంఘటనలు మనకు అనేక అంశాలను బోధిస్తాయని చెప్పారు. భవిష్యత్తులో మనం ఎలా నడుచుకోవాలో సూచిస్తాయని పేర్కొన్నారు.
 
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఓ  ట్వీట్‌లో, జలియన్ వాలా బాగ్ స్మారకాన్ని ఆధునికీకరించడం అమరులను అవమానించడమేనని ఆరోపించారు. ఆత్మ బలిదానానికి అర్థం తెలియని ఓ వ్యక్తి మాత్రమే ఈ విధంగా అవమానించగలరని అంటూ ప్రధానిపై వ్యక్తిగత దాడులకు దిగారు. ఈ ట్వీట్‌కు ఓ మీడియా కథనాన్ని కూడా జత చేశారు. ఆధునికీకరణ పేరుతో చరిత్రను ధ్వంసం చేశారని ఈ కథనం పేర్కొంటోంది.
 
దేశం మొత్తం ఆధునికరణను కొనియాడుతూ ఉండగా, కేవలం వామపక్షాలకు చెందిన నేతలు, మేధావులు మాత్రమే రాహుల్ తో స్వరం కలిపి విమర్శిస్తుండటం గమనార్హం. 
 
అసలే తన అభిష్టంకు వ్యతిరేకంగా నవజ్యోత్ సింగ్ సిద్దును ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షునిగా నియమించి తన ప్రభుత్వాన్ని ఎన్నికల ముందు అస్థిరం కావించేందుకు కారణమైన రాహుల్ పై ఆగ్రహంతో ఉన్న పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ మాత్రం రాహుల్ విమర్శల పట్ల వ్యంగ్యంగా స్పందించారు. 
 
ఈ  ఆధునికీకరణ పనుల తర్వాత జలియన్ వాలా బాగ్ చాలా బాగుందని పేర్కొన్నారని ఓ వార్తా సంస్థ తెలిపింది. ‘‘ఇక్కడి నుంచి వేటిని తొలగించారో నాకు తెలియదు. నాకు మాత్రం ఇది చాలా బాగుంది’’ అని సీఎం చెప్పినట్లు పేర్కొంది.

బ్రిటిష్ పరిపాలనా కాలంలో 1919 ఏప్రిల్ 13న శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వేలాది మందిపైకి జనరల్ రెజినాల్డ్ ఎడ్వర్డ్ హ్యారీ డయ్యర్ కాల్పులు జరిపించాడు. బ్రిటిష్ దళాలు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో దాదాపు 500 మంది అమరులయ్యారు, అంతకు మూడు రెట్ల మంది గాయాలపాలయ్యారు.