రాజ్యసభ సెక్రటరీ జనరల్ గా రామాచార్యులు

పార్లమెంటు ఎగువ సభ రాజ్యసభకు కొత్త సెక్రటరీ జనరల్‌గా డాక్టర్ పరాశరమ్ పట్టాభి కేశవ రామాచార్యులను రాజ్యసభ చైర్మన్ ఎం వెంకయ్యనాయుడు నియమించారు. నాలుగు దశాబ్డల పాటు పార్లమెంట్ సచివాలయంలో వివిధ హోదాలలో పనిచేసిన రామాచార్యులు, రాజ్యసభ సచివాలయం నుండి సెక్రటరీ జనరల్ కు ఎదిగిన తొలి వ్యక్తి కావడం విశేషం. పైగా ఆయన తెలుగువారు. 

రామాచార్యులు 2018 నుండి రాజ్యసభ సచివాలయంలో కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ప్రస్తుత సెక్రటరీ జనరల్ దేశ్ దీపక్ వర్మ పదవి విరమణ చేయడంతో, ఆయన వారసుడిగా బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు తొమ్మిది మంది ఉద్యోగులు లోక్ సభ సెక్రటరీ జనరల్రుగా నియామకం పొందినా, 1952లో ఏర్పడిన  రాజ్యసభ నుండి ఈ హోదాకు ఎదిగిన  మొదటి వ్యక్తి రామాచార్యులు మాత్రమే.

తనను ఈ పదవికి నియమించిన రాజ్యసభ చైర్మన్ ను ధన్యవాదాలు తెలుపుతూ ఇది తనకు గొప్ప గౌరవం అని, గొప్ప బాధ్యత అని చెబుతూ తన శక్తిమేరకు న్యాయం చేకూర్చే ప్రయత్నం చేస్తానని చెప్పారు. 1958 మార్చ్ 20న విజయవాడ సమీపంలో  జన్మించిన రామాచార్యులు పార్లమెంటు సచివాలయంలో  పలు హోదాలలో పనిచేశారు. రాజ్యసభ కార్యదర్శి కాకముందు కొద్దీ నెలల పాటు ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ కార్యదర్శిగా కూడా పనిచేశారు.

“ఆయన ఒక సంవత్సరం పాటు లోక్ సభ సచివాలయంలో పనిచేసిన తర్వాత 1983లో రాజ్యసభ సచివాలయంలో చేశారు.  2017 లో ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రత్యేక కార్యదర్శిగా పనిచేశారు” అని రాజ్యసభ సచివాలయం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. తదుపరి ఉత్తర్వులు వెలువడేంతవరకు ఆయన ఈ హోదాలో కొనసాగుతారు.

శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో రాజనీతి శాస్త్రంలో ఎంఎ పట్టా పొందారు. ఆ తర్వాత బి ఎల్ చేసిన రామాచార్యులు జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ ద్వారా “భారత పార్లమెంటు, అమెరికా కాంగ్రెస్ లలో కమిటీల పనితీరు: ఒక తులనాత్మక అధ్యయనం” అనే అంశంపై ఆయన సమర్పించిన పరిశోధనా వ్యాసంకు 2005 లో డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (పిహెచ్ డి)ని  పొందారు.