దుబాయిలో భారత్‌కు మరో నాలుగు స్వర్ణాలు

దుబాయిలో ఇక్కడ జరుగుతున్న ఆసియా యూత్, జూనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్ల హవా కొనసాగుతోంది. మంగళవారం మహిళల యూత్ విభాగంలో భారత్ మరో నాలుగు స్వర్ణాలు సాధించింది. 

54 కిలోల విభాగంలో నేహా పసిడి పతకం సొంతం చేసుకుంది. కజకిస్థాన్ బాక్సర్ అయేషాగుల్‌తో జరిగిన హోరాహోరీ పోరులో నేహా 32తో విజయం సాదించి పసిడి పతకాన్ని సాధించింది. ఇక మహిళల 60 కిలోల విభాగంలో ప్రీతి దహియా స్వర్ణం గెలుచుకుంది. అసాధారణ ఆటతో అలరించిన ప్రీతి కజకిస్థాన్ బాక్సర్ సయక్‌మెటోవాను ఓడించి పసిడి సొంతం చేసుకుంది.

మరోవైపు 66 కిలోల విభాగంలో స్నేహ కుమారి పసిడి పతకం గెలుచుకుంది. ఇక 75 కిలోల విభాగంలో భారత బాక్సర్ ఖుషి పసిడి సాధించింది. దుబాయి వేదికగా జరుగుతున్న యూత్, జూనియర్ బాక్సింగ్‌లో భారత్ ఏకంగా 39 పతకాలు సాధించింది. ఇందులో రికార్డు స్థాయిలో 14 స్వర్ణ పతకాలు ఉండడం విశేషం. 

జూనియర్ విభాగంలో భారత్‌కు 19 పతకాలు లభించాయి. ఇందులో 8 స్వర్ణాలు, ఐదు రజతాలు, మరో ఆరు కాంస్య పతకాలు ఉన్నాయి. ఇక యూత్ బాక్సింగ్ విభాగంలో భారత్‌కు 20 పతకాలు దక్కాయి. వీటిలో ఆరు స్వర్ణాలు ఉండగా మరో 9 రజతాలు, మరో ఐదు కాంస్య పతకాలను భారత బాక్సర్లు సొంతం చేసుకున్నారు.