రాఫెల్, జాగ్వార్‌ విమానాల ‘ఎలిఫెంట్ వాక్‌’

భారత వైమానిక దళం (ఐఏఎఫ్‌) మంగళవారం ‘ఎలిఫెంట్ వాక్’   కన్నులపండువగా నిర్వహించింది. ఈ వేడుకలు ‘ఆజాది కా అమృత్ మహోత్సవ్’ కార్యక్రమంలో భాగంగా ఎయిర్‌ఫోర్స్‌ చేపట్టింది. భారతదేశానికి స్వాతంత్య్రం లభించి 75 ఏండ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ఎలైట్ ఫైట్ జెట్‌లతో అద్భుతమైన ‘ఎలిఫెంట్‌ వాక్‌’ చేపట్టారు. 

ఈ కార్యక్రమంలో భారత వైమానిక దళం అమ్ములపొదిలోని అత్యంత ముఖ్యమైన రాఫెల్‌, జాగ్వార్‌ వంటి యుద్ధ విమానాలు ప్రత్యేక ఆకర్శణగా నిలిచాయి. ఈ ఎలిఫెంట్‌ వాక్‌లో దాదాపు 75 ఎయిర్‌క్రాఫ్ట్స్‌ పాలుపంచుకున్నాయి. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘స్టే ట్యూన్ ఫర్ మోర్ …’ అని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ట్విట్టర్‌లో రాసి ఎలిఫెంట్ వాక్‌ కు సంబంధించిన ఫొటోలను పోస్ట్‌ చేసింది.

స్విఫ్ట్, లెథల్ #75@75 అని ఎయిర్‌ఫోర్స్‌ ట్వీట్ చేసింది. స్వాతంత్య్ర దినోత్సవం రోజున పశ్చిమ విభాగంలో 75 స్కైడైవర్లతో ట్రై-సర్వీసెస్ స్కైడైవింగ్ ప్రదర్శనను నిర్వహించింది. రాఫెల్‌, జాగ్వార్‌ విమానాల రాకతో భారత వైమానిక దళం పటిష్ఠంగా తయారైందన్న విషయాన్ని ప్రపంచానికి చాటిచెప్పినట్లుగా ఎలిఫెంట్ వాక్‌ కొనసాగింది.