20.1 శాతంకు పరుగులు తీసిన జీడీపీ

కరోనా మహమ్మారి రెండో వేవ్ కారణంగా చతికలపడిన భారత ఆర్ధిక వ్యవస్థ వేగంగా కోలుకొంటున్నది. జీడీపీ పరుగులు తీయడం ప్రారంభమైనది. ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రం (2021-22) తొలి త్రైమాసికం (ఏప్రిల్‌-జూన్‌)లో జీడీపీ వృద్ధి చాలా బాగుంది.

క‌రోనా రెండో వేవ్ త‌ర్వాత ఈ ఏడాది జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో జీడీపీ 20.1 శాతం పెరిగింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఇదే అత్య‌ధిక రికార్డు. గ‌త ఆర్థిక సంవ‌త్స‌రం (2020-21) మార్చితో ముగిసిన త్రైమాసికంలో కేవ‌లం 1.6 శాతం వృద్ధి మాత్ర‌మే న‌మోదు చేసింది. గ‌తేడాది తొలి త్రైమాసికంలో మైన‌స్ 24.4 % గ్రోత్ రేట్ న‌మోదు కావ‌డం గ‌మ‌నార్హం. భార‌తీయ రిజ‌ర్వు బ్యాంక్ (ఆర్బీఐ) సైతం జూన్ త్రైమాసికంలో జీడీపీ 21.4 శాతం వృద్ధి చెందొచ్చున‌ని అంచ‌నా వేసింది.

మొత్తం జీడీపీ విలువ రూ 30.1 ల‌క్ష‌ల కోట్లు. రంగాల వారీగా నిర్మాణ రంగంలో 68.3 శాతం గ్రోత్ రికార్డైంది. ఉత్పాద‌క రంగంలో 49.6 శాతం, మైనింగ్ సెక్టార్‌లో 18.6 శాతం జీడీపీ న‌మోదైంది. ఇదిలా ఉంటే, ఏప్రిల్‌-జూలై మ‌ధ్య ద్ర‌వ్య‌లోటు 21.3 శాతానికి చేరుకున్న‌ది. ఇది ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రంలో కేంద్ర ప్ర‌భుత్వం నిర్దేశించుకున్న మొత్తంతో స‌మానం. తొలి నాలుగు నెల‌ల్లో ద్ర‌వ్య‌లోటు రూ.3.21 ల‌క్ష‌ల కోట్లు. ప‌న్ను వ‌సూళ్లు రూ. 5.21 ల‌క్ష‌ల కోట్ల‌యితే, ఖ‌ర్చు చేసిన మొత్తం రూ. 10.03 ల‌క్ష‌ల కోట్లు.

కాగా, భార‌త్‌లో ఆర్థిక కార్య‌క‌లాపాలు పుంజుకుంటున్నాయ‌ని ప్ర‌ముఖ ఇన్వెస్ట‌ర్స్ స‌ర్వీసెస్ సంస్థ మూడీస్ పేర్కొంది. కోవిడ్‌-19 ఆంక్ష‌ల‌ను స‌డ‌లిస్తున్నా కొద్దీ ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ‌లు వృద్ధి దిశ‌గా అడుగులు వేస్తున్నాయ‌ని వ్యాఖ్యానించింది. 2021లో భార‌త్ వృద్ధి రేటు 9.6 శాతాన్ని కొన‌సాగిస్తుంద‌ని, 2022లో ఏడు శాతం వ‌ద్ద నిలుస్తుంద‌ని మంగ‌ళ‌వారం అంచ‌నా వేసింది.

దేశీయ ఆర్థిక వృద్ధి మెరుగు ప‌డే వ‌ర‌కూ ఆర్బీఐ సానుకూల ద్ర‌వ్య ప‌ర‌ప‌తి విధానాన్ని కొన‌సాగిస్తుంద‌ని భావిస్తున్న‌ట్లు తెలిపింది. ఈ ఏడాది చివ‌రి వ‌ర‌కు ఇదే విధానాన్ని ఆర్బీఐ అనుస‌రిస్తుంద‌ని అంచ‌నా వేస్తున్న‌ట్లు పేర్కొంది. తాజాగా ముగిసిన త్రైమాసికంలో 2011 -12 ధరల ప్రకారం జీడీపీ రూ. 32,38,020 కోట్లుకాగా, కొవిడ్‌ తొలివేవ్‌ సంక్షోభకాలమైన 2020 ఏప్రిల్‌-జూన్‌లో 26,95,421 కోట్లు. కొవిడ్‌ ముందస్తు సంవత్సరమైన 2019 జూన్‌ త్రైమాసికంలో రూ.35,66,708 కోట్ల విలువైన జాతీయోత్పత్తి జరిగింది.

 కొవిడ్‌ సెకండ్‌వేవ్‌ కారణంగా 2021-22 తొలి త్రైమాసికంలో పలు రాష్ట్రాలలో లాక్‌డౌన్లు జరిగాయని, ఈ నియంత్రణల కారణంగా ఆర్థిక కార్యకలాపాలు, గణాంకాల సేకరణ యంత్రాంగాలపై కూడా ప్రభావం పడిందని, దీంతో త్రైమాసిక జీడీపీ అంచనాలు కూడా ప్రభావితమై ఉండవచ్చని ఎన్‌ఎస్‌వో విడుదల చేసిన ప్రకటన తెలిపింది. 

కాగా, వ్యవసాయ రంగం మినహా మిగిలిన రంగాలన్నీ కొవిడ్‌ ముందస్తుస్థాయికంటే తక్కువగానే ఉన్నాయి. తయారీ రంగం 2019 ఏప్రిల్‌-జూన్‌లో రూ.5.67 లక్షల కోట్లుకాగా, ఈ జూన్‌ క్వార్టర్లో ఇది రూ.5.43 లక్షల కోట్లు. సర్వీసుల రంగం రూ.6.64 లక్షల కోట్ల నుంచి రూ.4.63 కోట్లకు తగ్గగా, వ్యవసాయ రంగం రూ.4.49 లక్షల కోట్ల నుంచి రూ. 4.86 లక్షల కోట్లకు పెరిగింది.