జమ్మూ-కశ్మీరులో పారిశ్రామికాభివృద్ధి కోసం ఓ వెబ్ పోర్టల్‌ను కేంద్ర హోం మంత్రి అమిత్ షా మంగళవారం ఆవిష్కరించారు. న్యూ సెంట్రల్ సెక్టర్ స్కీమ్, 2021 క్రింద పరిశ్రమలను ఏర్పాటు చేయాలనుకునేవారు ఈ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు.
ఈ వెబ్ పోర్టల్‌ను అమిత్ షా వీడియో కాన్పరెన్సింగ్ ద్వారా ఆవిష్కరించారు. జమ్మూ-కశ్మీరులో పారిశ్రామికాభివృద్ధి కోసం న్యూ సెంట్రల్ సెక్టర్ స్కీమ్, 2021ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్, కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పాల్గొన్నారు.
జమ్మూ-కశ్మీరులో పారిశ్రామికాభివృద్ధి కోసం న్యూ సెంట్రల్ సెక్టర్ స్కీమ్, 2021ని ఈ ఏడాది ఫిబ్రవరి 19న నోటిఫై చేశారు. పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ దీనిని నోటిఫై చేసింది. ఇది 2021 ఏప్రిల్ 1 నుంచి 2037 మార్చి 31 వరకు అమల్లో ఉంటుంది. దీనికోసం రూ.28,400 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఈ వివరాలను కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సోమ్ ప్రకాశ్ లోక్‌సభకు ఆగస్టు 4న తెలిపారు.
వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) క్రింద నమోదైన వ్యాపార సంస్థలు, అర్హత గల పారిశ్రామిక (తయారీ) సంస్థలు, అర్హత గల సేవా రంగ సంస్థలు ఈ పథకం క్రింద నమోదు చేసుకోవచ్చు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని శాఖలు నడిపే సంస్థలకు ఈ పథకం వర్తించదు.
ఈ పథకం ద్వారా నాలుగు రాయితీలను పొందవచ్చు. మూల ధన పెట్టుబడి ప్రోత్సాహకం, మూల ధన వడ్డీ ఉపశమనం, జీఎస్‌టీ అనుబంధ ప్రోత్సాహకం, వర్కింగ్ క్యాపిటల్ ఇంటరెస్ట్ సబ్‌వెన్షన్ రాయితీగా లభిస్తాయి. ఉపాధి అవకాశాల పెంపు, పర్యాటకాభివృద్ధికి ఈ పథకం దోహదపడుతుందని కేంద్ర మంత్రి ప్రకాశ్ చెప్పారు.
More Stories
ఆర్బిఐ కొత్త గవర్నర్ గా సంజయ్ మల్హోత్రా
కొత్తగా వంద ఎయిర్‌బస్ విమానాలకు ఆర్డర్
నోయిడా విమానాశ్రయం రన్‌వేపై తొలి విమానం