ఉద్యోగులకు ఇక వారానికి మూడు రోజుల సెలవులు!

ప్రస్తుతం చివరిదశలో సిద్దమవుతున్న నూతన వేజ్ కోడ్ ప్రకారం ఉద్యోగులకు ఇక వారానికి మూడు రోజుల సెలవులు రానున్నాయి. ఆ మేరకు వారి రోజువారీ పని గంటలలో మార్పు జరుగనుంది. ఈ కోడ్ వచ్చే అక్టోబర్ నుండి అమలులోకి తీసుకు రావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది. 

ఉద్యోగుల పని వేళలను కొత్త వేతన కోడ్ ప్రకారం 9 నుంచి 12 గంటల వరకు పెరుగుతాయి.  కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ వర్గాల ప్రకారం, వారంలో 48 గంటల పని నియమం వర్తిస్తుంది. కొన్ని యూనియన్లు 12 గంటల పని, 3 రోజుల సెలవు నియమాలను ప్రశ్నించాయి.

దానితో వారంలో 48 గంటల పని పాలనలో, ఒక ఉద్యోగి రోజుకు 8 గంటలు పనిచేస్తే వారికి వారంలో ఒక రోజు సెలవు లభిస్తుందని,  ఎవరైనా రోజుకు 12 గంటలు పనిచేస్తే, ఆ ఉద్యోగికి మూడు రోజులు సెలవు ఇవ్వాల్సి ఉంటుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నారు.

ఉద్యోగుల జీతంని నిర్ణయించడంలో కూడా మార్పులు జరుగనున్నాయి. టేక్-హోమ్ జీతం తగ్గుతుంది. వేజ్ కోడ్ చట్టం, 2019 ప్రకారం, ఉద్యోగి  ప్రాథమిక జీతం కంపెనీ వ్యయంలో 50 శాతం కంటే తక్కువ ఉండకూడదు. ప్రస్తుతం.  చాలా కంపెనీలు ప్రాథమిక వేతనాన్ని గణనీయంగా తగ్గించి, ఇతర బత్యాలను ఎక్కువగా ఇస్తున్నాయి. 

కొత్త వేతన కోడ్ కింద ఉద్యోగులు ఎక్కువ సెలవులు తీసుకోవచ్చు. సెలవులను 240 నుండి 300 కి పెంచనున్నారు. దేశంలోని కార్మికులందరూ కనీస జీతం పొందడం ఇదే మొదటిసారి కాగలదు.  వలస కార్మికుల కోసం కొత్త పథకాలు కూడా రూపొందిస్తున్నారు. సామాజిక భద్రతను అందించడానికి ప్రతి ఒక్కరి జీతంలో  ప్రావిడెంట్ ఫండ్ భాగం కానున్నది.