భారత్ తో బలమైన సంబంధాలు కోరుకొంటున్న తాలిబన్ 

“ఈ ప్రాంతంలో ముఖ్యమైన దేశం” అయిన భారత్‌తో ఆఫ్ఘనిస్తాన్ బలమైన వాణిజ్య, ఆర్థిక, రాజకీయ సంబంధాలను కొనసాగించాలని కోరుకుంటున్నట్లు తాలిబాన్ ప్రతినిధులు వెల్లడించారు. సీనియర్ నాయకుడు షేర్ మొహమ్మద్ అబ్బాస్ స్టానెక్‌జాయ్ మాట్లాడుతూ  “భారతదేశంతో మా వాణిజ్యం, ఆర్థిక, రాజకీయ సంబంధాలకు మేము చాలా ప్రాముఖ్యతనిస్తున్నాము. ఆ  సంబంధాన్ని కొనసాగించాలనుకుంటున్నాము” అని చెప్పారు.

మాజీ సైనికుడు, భారత దేశంలోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో ఒకప్పుడు శిక్షణ ఒపండిన స్టానిక్జాయ్ కాబోయే విదేశాంగ మంత్రిగా భావిస్తున్నారు. దోహాలోని గ్రూప్ కార్యాలయంలో తాలిబాన్ ప్రధాన సంధానకర్తగా కీలక పాత్ర వహించారు. న్యూస్ 18 స్టానిక్జాయ్ లో ప్రచురించిన ఆయన ఇంటర్వ్యూలో  తాలిబన్ పాలనలో భారత దేశంతో కొనసాగించే భవిష్యత్ సంబంధాల గురించి ఆశాభావం వ్యక్తం చేశారు.

 భారత్,  ఆఫ్ఘనిస్తాన్ ల మధ్య ఎయిర్ కారిడార్ గురించి ప్రస్తావిస్తూ, రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని పెంపొందించడానికి ఉద్దేశించినది. అయితే పాకిస్తాన్ రవాణా ప్రాప్యతను అనుమతించలేదు” అని తెలిపారు. పాకిస్తాన్ మార్గం ద్వారా భారతదేశంతో ఆఫ్ఘనిస్తాన్ వాణిజ్యం కొనసాగించడం తమకు చాలా ముఖ్యం అని పేర్కొన్నారు. 

భారత్ వ్యతిరేక తీవ్రవాద గ్రూపులకు అభయారణ్యంగా ఆఫ్ఘానిస్తాన్ మారుతుందని వ్యక్తం అవుతున్న భయాందోళనలను ప్రస్తావిస్తూ  “చరిత్రలో భారత్ తో సహా మా పొరుగు వారెవ్వరికి  కి ఆఫ్ఘనిస్తాన్ నుండి ఎలాంటి ముప్పు లేదు. ఆ విధంగా జరిగే అవకాశం లేదు” అని స్పష్టం చేశారు. 

అదేవిధంగా ఆఫ్ఘన్ లో ఉన్న హిందువులు, సిక్కులను ఖాళీ చేయించవలసిన “అవసరం” భారత్ కు లేదని కూడా భరోసా ఇచ్చారు. “ఆఫ్ఘనిస్తాన్ వారి మాతృభూమి, మాతృ దేశం. కాబట్టి వారు ప్రశాంతంగా జీవించవచ్చు. వారి జీవితాలకు ఎలాంటి హాని ఉండదు. వారు ఇంతకు ముందు ఎలా జీవిస్తున్నారో అలాగే జీవించవచ్చు” అంటూ భరోసా ఇచ్చారు.

పైగా, గత 20 సంవత్సరాలుగా భారత్ కు వలస వచ్చిన ఆఫ్ఘానిస్తాన్‌లో ఉండే హిందువులు, సిక్కులు త్వరలో తిరిగి వస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అదే విధంగా ఆఫ్ఘానిస్తాన్ లో భారత్ చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రశంసిస్తూ, పెండింగ్ లో ఉన్న పనులను భారత్ పూర్తి చేయాలని కోరుకొంటున్నట్లు చెప్పారు. అందుకోసం తాము భారత్ ను ఆహ్వానిస్తున్నామని చెబుతూ, ఆయా ప్రాజెక్ట్ లకు తగు భద్రత ఉండగలదని హామీ కూడా ఇచ్చారు.

భారత్ తో తమకున్న వివాదం దృష్ట్యా అందుకోసం ఆఫ్ఘానిస్తాన్ భూభాగాన్ని ఉపయోగించడానికి అనుమతిపబోమని స్పష్టం చేశారు. , “భారత్, పాకిస్తాన్ మధ్య సుదీర్ఘ రాజకీయ, భౌగోళిక వివాదం ఉన్నదనడంలో ఎటువంటి సందేహం లేదు. వారు తమ అంతర్గత పోరులో ఆఫ్ఘనిస్తాన్‌ని ఉపయోగించరు, వారికి సుదీర్ఘ సరిహద్దు ఉంది, సరిహద్దులో తమలో తాము పోరాడవచ్చు. దీని కోసం ఆఫ్ఘనిస్తాన్‌ భూమిని ఉపయోగించడానికి మేము ఏ దేశాన్ని అనుమతించము” అని తేల్చి చెప్పారు. 

“ప్రస్తుతం, తాలిబాన్ నాయకత్వం ఆఫ్ఘనిస్తాన్ లోపల, వెలుపల ఆమోదం, గుర్తింపు పొందే విధంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం గురించి వివిధ జాతి సమూహాలు, రాజకీయ పార్టీలు, ఇస్లామిక్ ఎమిరేట్‌తో సంప్రదింపులు జరుపుతోంది,” అని స్టానెక్‌జాయ్ పేర్కొన్నాడు. కాగా,  ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ నియంత్రణను స్వాధీనం చేసుకున్న తరువాత, భారతదేశం తన పౌరుల తరలింపుపై దృష్టి సారించింది, కాబూల్‌లో జరుగుతున్న పరిణామాలను జాగ్రత్తగా పర్యవేక్షిస్తోంది.

“క్షేత్రస్థాయిలో పరిస్థితి అనిశ్చితంగా ఉంది. ప్రస్తుతం ప్రధాన విషయం ప్రజల భద్రత. ప్రస్తుతం, కాబూల్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఏ సంస్థ గురించి స్పష్టత లేదు” అని తాలిబాన్ పాలనను భారత్ గుర్తిస్తుందా అని అడిగినప్పుడు భారత్ విదేశాంగశాఖ  ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు.