ఆఫ్ఘన్ లో ముగిసిన అమెరికా బలగాల ఉపసంహరణ

ఆఫ్ఘ‌నిస్థాన్‌లో అమెరికా బ‌ల‌గాల ఉప‌సంహ‌ర‌ణ ముగిసింది. బ‌ల‌గాల ఉప‌సంహ‌ర‌ణ‌ను పెంట‌గాన్ ధ్రువీక‌రించింది. ఈ నెల 31వ తేదీలోగా బ‌ల‌గాల ఉప‌సంహ‌ర‌ణ పూర్త‌వుతుంద‌ని అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో అమెరికా సేన‌లు ఆఫ్ఘ‌నిస్థాన్ నుంచి వెళ్లిపోయాయి. 

ఆఫ్ఘ‌న్‌లో 20 ఏండ్ల పాటు అమెరికా సేన‌లు తాలిబ‌న్ల‌పై పోరాడాయి. తాలిబ‌న్లు కాబూల్‌ను ఆక్ర‌మించ‌డంతో అమెరికా సేన‌ల ఉప‌సంహ‌ర‌ణ ప్రారంభ‌మైంది. కాబూల్ నుంచి అర్ధ‌రాత్రి బ‌య‌ల్దేరిన అమెరికా చివ‌రి విమానంలో అమెరికా క‌మాండ‌ర్, రాయబారి ఉన్నారు.

 అమెరికా జనరల్‌ కెన్నెత్‌ మెకాంజీ వాషింగ్టన్‌ టైమ్‌తో మాట్లాడుతూ.. ‘‘అఫ్గనిస్తాన్‌ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ, అమెరికా పౌరుల తరలింపు ప్రక్రియ పూర్తైందని ప్రకటన చేస్తున్నా. సెప్టెంబరు 11, 2001 నుంచి దాదాపు 20 ఏళ్లుగా అఫ్గన్‌లో చేపట్టిన ఆపరేషన్‌ ముగిసింది’’ అని పేర్కొన్నారు.

అయితే, కాబూల్ నుంచి వెళ్లిపోవాల‌నుకునే వారికి విమానాశ్ర‌యం తెరిచే ఉంచాల‌ని బైడెన్ కోరారు. అమెరికా చివ‌రి విమానం వెళ్లిన త‌ర్వాత తాలిబ‌న్లు గాల్లోకి కాల్పులు జ‌రిపి సంబురాలు చేసుకున్నారు. దేశ చరిత్రలో ఇదొక కీలక మార్పు అంటూ సంతోషంలో మునిగిపోయారు.

ఈ సందర్భంగా తాలిబన్‌ అధికార ప్రతినిధి జుబీహుల్లా ముజాహిద్‌ మాట్లాడుతూ ఈరోజు తమకు సంపూర్ణ స్వాతంత్ర్యం సిద్ధించిందని పేర్కొన్నారు. స్వేచ్ఛ లభించిందని తెలిపారు. ఇక తాలిబన్‌ అధికారి అనాస్‌ హక్కాని  ‘‘చారిత్రాత్మక క్షణాలు. ఎంతో గర్వంగా ఉంది’’ అని హర్షం వ్యక్తం చేశారు.

ఈ నెల 15వ తేదీన కాబూల్‌ను తాలిబ‌న్లు ఆక్ర‌మించిన విష‌యం విదిత‌మే. కాగా, ఆఫ్ఘ‌నిస్థాన్ ఉగ్ర‌ముఠాల‌కు స్థావ‌రం కాకూడ‌ద‌ని ఐక్య రాజ్య స‌మితి తీర్మానం చేసింది. తాలిబ‌న్లు ఇత‌ర దేశాల‌పై దాడులు చేయ‌కూడదని తీర్మానించింది. తీర్మానం ఓటింగ్‌కు ర‌ష్యా, చైనా దూరంగా ఉన్నాయి.