నిజాం ఆస్తులను తిరిగి ప్రజలకే అప్పగిస్తాం 

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే నిజాం ఆస్తులు, భూములను స్వా ధీనం చేసుకొని, వాటిని తిరిగి ప్రజలకే అప్పగిస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ ప్రకటించారు.  ‘ప్రజా సంగ్రామ యాత్ర మూడోరోజైన సోమవారం సాయంత్రం ఆరెమైసమ్మ ఆలయం వద్ద నిర్వహించిన సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ  భాగ్యలక్ష్మీ అమ్మ వారి సాక్షిగా ఎంఐఎం అడ్డాను బద్దలు కొట్టిన సత్తా బీజేపీ కార్యకర్తలదే అని స్పష్టం చేశారు. 

పాతబస్తీనే కాదు.. వాళ్లు సవాల్‌ చేస్తే ఏ బస్తీకైనా వచ్చి కాషాయ జెండా ఎగరేస్తామని చెబుతూ టీఆర్‌ఎస్‌కు ఆ దమ్ము ఉందా? అని ప్రశ్నించారు. దేశద్రోహుల పార్టీ ఎంఐఎంతో కేసీఆర్‌ దోస్తీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్‌ పాతబస్తీకి రావాలంటే ఎంఐఎం పర్మిషన్‌ తీసుకోవాలిని ఎద్దేవా చేశారు.

రాబోయే ఎన్నికల తరువాత దేశద్రోహుల పార్టీని తరిమికొడతామని స్పష్టం చేశారు. `భాగ్యనగర్‌ అమ్మవారి పేరుతోనే భాగ్యనగర్‌ పేరొచ్చింది. గొల్ల కురుమల కొండ గొల్లకొండనే… అది గోల్కొండ కాదు. నిజాం స్థలాలు, ఆస్తులన్నీ కూడా మావే. హిందువుల స్థలాలను ఆక్రమించుకుని నిజాం ఆస్తులుగా చెప్పుకుంటున్నారు’అని సంజయ్ చెప్పుకొచ్చారు.

తెలంగాణ ఇచ్చిన వీరుడు సర్దార్‌ పటేల్‌ ముందు మోకరిల్లిన పార్టీ బీజేపీ అని, తెలంగాణ ప్రజల మానప్రాణాలను దోచుకుని హింసించిన నిజాం రాజు ముందు మోకరిల్లిన పార్టీ టీఆర్‌ఎస్‌దని సంజయ్‌ ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏనాడూ ఎంఐఎం సమర్థించలేదని గుర్తు చేశారు. తెలంగాణ తల్లి ఒక కుటుంబం చేతిలో బందీ అయ్యిందని, విముక్తి చేసేందుకు బీజేపీ పోరాడుతుందని చెప్పారు. 111 జీవో పరిధిలోనే కేసీఆర్‌కు, ఆయన కొడుకు, కూతురుకు సామ్రాజ్యాలున్నాయని ఆరోపించారు.

వేలాదిగా జనం నీరాజనం 

ప్రజా సంగ్రామ యాత్రకు 3వ రోజు సైతం వేలాదిగా జనం తరలివచ్చి నీరాజనం పట్టారు.  ప్రతిచోటా సంజయ్ పై పూల వర్షం కురిపించారు. కొందరు మహిళలు సంజయ్ నుదుటిన వీర తిలకం దిద్ది బీజేపీకి అండగా ఉంటూ ప్రభుత్వంపై పోరాడతామంటూ ప్రతినబూనారు. 

పాదయాత్రకు తరలివచ్చిన వారిలో అత్యధికులు సంజయ్ ను కలిసేందుకు, ఆయనతో కలిసి ఫొటోలు దిగేందుకు ఉత్సాహం చూపారు. ఒకవైపు వాతావరణం అనుకూలించకపోయినా, మరోవైపు కాలి బొటనవేలికి గాయమై ఇబ్బందులు పడుతున్నా సంజయ్  లెక్కచేయకుండా ప్రజలతో మమేకమై వారి సమస్యలు వినేందుకు అత్యంత ఆసక్తి చూపారు.

జనం బాధలు వింటూనే వారిని ఓదారుస్తూ అందరికీ అండగా ఉంటామని భరోసా ఇస్తూ ముందుకు కదిలారు. అదే సమయంలో సంజయ్ వెంట తామున్నామని, బీజేపీగా అండగా ఉంటామంటూ పెద్ద ఎత్తున పాదయాత్రకు తరలివచ్చిన జనం సంఘీభావం తెలుపుతుండటం గమనార్హం.

బాపుఘాట్ నుంచి ప్రారంభమైన పాదయాత్ర టిప్పుఖాన్ సర్కిల్ మీదుగా రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గంలోకి ప్రవేశించగానే వేలాదిమంది కార్యకర్తలు తరలివచ్చారు. పిల్లలు, పెద్దలు, మహిళలు, వ్రుద్దులనే తేడా లేకుండా పెద్ద ఎత్తున తరలివచ్చి బండి సంజయ్ పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. 

గీత కార్మికులుసహా దారి పొడవునా ఎదురైన ప్రజలందరినీ కలిసి వారికి అండగా ఉంటామని చెప్పారు. పెద్ద ఎత్తున మహిళలు బోనాలు, బతుకమ్మలు ఎత్తుకొని ఎదురేగుతూ సంజయ్ కు స్వాగతం పలికారు. బండ్ల గూడ చౌరస్తాలో ప్రవేశించగానే నాయకులు వినూత్నంగా నిలువెత్తు పూలదండలు తయారు చేయించి క్రేన్ తో నాయకుల మెడలకు అందేలా వేసి ఫోటోలు దిగారు.

ఎస్సి మోర్చాజాతీయ అధ్యక్షులు, మాజీ మంత్రి లాల్ సింగ్ ఆర్య ఆయనతో  పాదయాత్ర చేశారు. బిజెపి  శాసనసభాపక్షనేత రాజాసింగ్, శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్, పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ మనోహర్ రెడ్డి, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్ సహా పార్టీకి చెందిన రాష్ట్ర నాయకులు, వివిధ మోర్చాల నేతలు సంజయ్ తో కలిసి అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు కదిలారు.