సాంప్రదాయ భోజనంపై టిటిడి వెనుకడుగులో మర్మం! 

తిరుమల తిరుపతి దేవస్థానాలు (టిటిడి) ఎంతో ఆర్భాటంగా  ప్రచారం చేసుకుని ప్రయోగాత్మకంగా ప్రారంభించిన సంప్రదాయ భోజనం నాలుగు రోజులకే మూత పడటం పలు వర్గాలలో విస్మయం కలిగిస్తున్నది. టిటిడి అన్నం అమ్మడం ఏమిటి అంటూ సోషల్ మీడియాలో ఒక వైపు, మరోవంక హిందూ ధార్మిక సంస్థల నుండి వ్యతిరేకత రావడంతో నిలిపివేసిన్నట్లు చెబుతున్నా, ఇతర బలమైన కారణాలు ఉండిఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

గతంలో అనేక అంశాలపై మీడియాలో తీవ్రమైన విమర్శలు వచ్చినా పట్టించుకోని టిటిడి అంత అకస్మాతుగా వెనుకడుగు వేయడం వెనుక ఉన్న మర్మం ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తిరుమలలో భారీ వ్యాపారాలలో ఒకటైన హోటళ్ల మనుగడకు ప్రతిబంధకంగా మారుతుందని, వారు నుండి వచ్చిన వత్తిడుల కారణంగానే వెనుకడుగు వేసారా అనే సందేహాలు వెల్లడి అవుతున్నాయి. 

స్థానికంగా హోటళ్లు, ఇతరత్రా వ్యాపారాలు చేసుకునేవారికి బలమైన రాజాకీయ సంబంధాలు ఉండడం అందరికి తెలిసిందే.  ధర్మకర్తల మండలి లేని సమయంలో అధికారులు తీసుకున్న నిర్ణయం అని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి చెప్పి మరీ దీనిని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఆయన అంతకు ముందు పదవిలో ఉన్న సమయంలోనే ఈ ప్రతిపాదనకు శ్రీకారం చుట్టారని తెలుస్తున్నది.

గత మూడు నెలలుగా గోఆధారిత వ్యవసాయం ద్వారా పండించిన ఉత్పత్తులతో శ్రీవారికి నైవేద్యం పెడుతున్నారు. దీన్ని మరింత విస్తరించి భక్తులకు కూడా ఆరోగ్యకరమైన సంప్రదాయ ఆహారం అందించాలని టీటీడీ భావించింది. ప్రకృతి వ్యవసాయవేత్తలు చేసిన సూచనలతో  ఇందుకు శ్రీకారం చుట్టారు సేంద్రియ సేద్యంతో పండించిన బియ్యం, కూరగాయలు, పప్పుదినుసులను తిరుమలకు తీసుకు వచ్చారు.

ఈనెల 26వ తేదీ నుంచి తిరుమలలోని అన్న మయ్య భవనంలో ప్రయోగాత్మకంగా ‘సాంప్రదాయ భోజనం’ ఉచితంగా పెడుతున్నారు. సెప్టెంబరు 8వ తేదీ వరకు ఈ విధానాన్ని పరిశీలించి లోటుపాట్లను సరిచేసిన తర్వాత భక్తులకు పూర్తిస్థాయిలో అందజేయాలని నిర్ణయించారు.టీటీడీకి ఇది భారం కాకూడదనే ఉద్దేశ్యంతో  లాభాపేక్షలేకుండా కాస్ట్‌ టూ కాస్ట్‌ కింద భక్తులకు సంప్రదాయ భోజనం విక్రయిస్తామని టీటీడీ ఉన్నతాధికా రులు ప్రకటించారు.

ఈ కార్యక్రమంపై మీడియాలో కూడా మంచి ప్రాధాన్యం కూడా లభించింది. అయితే ఇంతలో ఏం జరిగిందో కానీ సోషల్‌ మీడియాలో విమర్శలు అనే కారణంతో ఈ ఆలోచనను విరమించుకుంటున్నట్టు సోమవారం ప్రకటించారు.  తిరుమలలో టీటీడీ భోజన విక్రయం మొదలు పెట్టడం అంటే ఒక హోటల్‌ నడపడం వంటిదే అని, ప్రస్తుతం ఉన్న హోటళ్లకు ఇది పెద్ద దెబ్బ అవుతుందనే ప్రచారం కూడా జరుగుతున్నది.

ఇదే సమయంలో అన్నప్రసాదాలను వ్యాపారకోణంలో చూసి విక్రయించడం సరైన నిర్ణయం కాదంటూ పలు హిందూ ధార్మిక సంస్థలు కూడా అభ్యంతరం తెలిపినట్లు చెబుతున్నారు. దీంతో ప్రభుత్వం కూడా ఇరకాటంలో పడినట్లయింది. భవిష్యత్తులో ఇది మరింత వివాదాస్పదం అయ్యే ప్రమాదం ఉందనే ఉద్దేశంతోనే విరమించుకున్నారని చెబుతున్నారు.

కేవలం సోషల్ మీడియా విమర్శల కారణంగానే ఈ ప్రయత్నం విరమించుకొన్నారనుకొంటె కనీస ధరను వసూలు చేయకుండా  ద్వారా కాక ఉచితంగా భక్తులకు అందించే ప్రయత్నం చేసి ఉండేవారని వాదనలు వినిపిస్తున్నాయి. టీటీడీకి దాతల కొదవేమీ లేదని, ఈ పథకాన్ని వివరిస్తే భారీగా విరాళాలు సమకూర్చుకోవడం పెద్ద కష్టమేమీ కాదని చెబుతున్నారు.