తాలిబన్ల చేతికి కీలక జాబితా అందించిన అమెరికా

అఫ్గానిస్థాన్‌ వ్యవహారంలో అమెరికా తీసుకుంటున్న నిర్ణయాలు బెడిసి కొడుతున్నాయి. అక్కడి నుంచి తమ దళాలను హడావుడిగా ఉపసంహరించుకోవడం మొదలు, కాబుల్‌ విమానాశ్రయం నుంచి ప్రజలను సురక్షితంగా తరలించడం వరకు ఎన్నో విషయాల్లో అగ్రరాజ్యం విమర్శలు ఎదుర్కోక తప్పలేదు. 
 
ఈ క్రమంలోనే అమెరికా భారీ తప్పదం చేసిందంటూ మీడియాలో తీవ్ర ఆందోళన కలిగించే కథనం సంచలనం సృష్టిస్తోంది. తాలిబన్లు అఫ్గాన్‌ను ఆక్రమించిన క్రమంలో తమ పౌరులు, మిత్రదేశాల వారు, ఇన్నాళ్లూ తమకు సహకరించిన అఫ్గాన్ల పేర్లతో అమెరికా ప్రత్యేకంగా ఓ జాబితాను రూపొందించింది.
 
 ఆగస్టు 31లోగా తమ బలగాలను ఉపసంహరించుకోవాలి కాబట్టి  వీరందర్నీ కాబుల్‌ నుంచి సురక్షితంగా తరలించేందుకు తాలిబన్లు సహాయపడతారని భావించింది. అమెరికా అధికారులు స్వయంగా వచ్చి, తాలిబన్ల చేతుల్లో ఈ జాబితాను పెట్టారు! ఈ జాబితాను  తాలిబన్లకు అందిస్తే, ప్రజల తరలింపు ప్రక్రియ త్వరగా పూర్తవుతుందని అగ్రరాజ్యం భావించింది. 
 
కానీ ఇక్కడే కథ అడ్డం తిరిగింది. ‘మేకవన్నె పులి’ చందంగా తాలిబన్లు పైకి తాము మారామని, అందర్నీ క్షమిస్తున్నామని చెబుతున్నా  ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేపట్టి, గతంలో నాటో దళాలకు సహాయపడిన వారిని పట్టుకుంటున్న సంగతిని అమెరికా అధికారులు విస్మరించారు! ఇప్పుడు ఈ జాబితాను తాలిబన్లు ‘కిల్‌ లిస్ట్‌’గా పరిగణించే ప్రమాదముందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
 
శుక్రవారం ఈ జాబితా విషయమై అధ్యక్షుడు బైడెన్‌ను విలేకరులు ప్రశ్నించారు. అయితే, దీన్ని ఆయన ఖండించలేదు. ఈ విషయమై తనకు ఎలాంటి సమాచారం లేదని, అప్పుడప్పుడు తాలిబన్లకు జాబితాలు ఇస్తుంటామని వ్యాఖ్యానించారు. అమెరికా ప్రభుత్వ తీరుపై ఆ దేశ చట్టసభ్యులు, సైనికాధికారులు తీవ్రంగా మండిపడుతున్నారు.
 
జాబితాలో పేర్లున్న అఫ్గాన్ల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మాత్రం తమ చర్యలను సమర్థించుకుంటున్నారు. పౌరులకు ప్రమాదం తలపెట్టకూడదన్న ఉద్దేశంతోనే ఇలా చేశామంటున్నారు.
 
183కు చేరిన మృతుల సంఖ్య
 
ఇలా ఉండగా,  గురువారం సాయంత్రం కాబూల్ విమానాశ్ర‌యం వ‌ద్ద ఐసిస్-కే ఉగ్ర‌వాద సంస్థ వ‌రుస ఆత్మాహుతి దాడుల‌కు పాల్ప‌డిన విష‌యం తెలిసిందే. దీంతో 183 మంది మ‌ర‌ణించారు. ఇందులో 13 మంది అమెరికా ర‌క్ష‌ణ సిబ్బంది ఉండ‌గా, 170 మంది ఆఫ్ఘ‌న్ పౌరులు ఉన్నారు. మ‌రో 200 మంది గాయ‌ప‌డ్డారు.
ఈ నేప‌థ్యంలో దాడికి పాల్ప‌డిన‌వారు త‌గిన మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌ద‌ని అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ హెచ్చ‌రించారు. వారిపై ప్ర‌తీకారం తీర్చుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు. ఐసిస్ నాయ‌కుల‌ను అంత‌మొందించాల‌ని సైన్యాన్ని ఆదేశించారు.
దీంతో అమెరికా సైన్యం ప్ర‌తీకార దాడులు ప్రారంభించింది. కాబూల్‌లోని విమానాశ్ర‌యం వ‌ద్ద ఆత్మాహుతి దాడికి పాల్ప‌డిన ఐసిస్ శిభిరాలే ల‌క్ష్యంగా అమెరికా ద‌ళాలు డ్రోన్‌ల‌తో విరుచుకుప‌డ్డాయి. ఆఫ్ఘ‌నిస్థాన్‌లోని నంగ‌హార్ ప్రావిన్స్‌లోని ఇస్లామిక్ స్టేట్ స్థావ‌రాల‌పై దాడి చేశామ‌ని సెంట్ర‌ల్ క‌మాండ్ కెప్టెన్ బిల్ అర్బ‌న్ తెలిపారు. తాము అనుకున్న లక్ష్యాన్ని అంతం చేసినట్లు చెప్పారు. 
 
ఈ ఘటనలో పౌరులెవరికీ హాని జరగలేదని పేర్కొన్నారు. ఆఫ్ఘన్ వెలుప‌ల నుంచి ఈ దాడి జ‌రిపిన‌ట్లు చెప్పారు. కాగా, కాబూల్ విమానాశ్ర‌యం వ‌ద్ద మ‌రిన్ని దాడులు జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని, అందువ‌ల్ల పౌరులు ఎయిర్‌పోర్టును ఖాళీ చేయాల‌ని అమెరికా హెచ్చ‌రించింది.