కాబుల్ ఆత్మాహుతి దాడుల వెనుక పాకిస్తానీ హస్తం!

ఆఫ్ఘ‌నిస్థాన్ రాజ‌ధాని కాబూల్ ఎయిర్‌పోర్ట్ ద‌గ్గ‌ర గురువారం రెండు ఆత్మాహుతి దాడులు జ‌రిగిన విష‌యం తెలుసు క‌దా. అయితే ఈ దాడుల వెనుక ఓ పాకిస్థానీ హ‌స్తం ఉన్న‌ట్లు అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ పేలుళ్ల‌కు తామే బాధ్యుల‌మ‌ని ఇప్ప‌టికే ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర‌వాద సంస్థ ప్ర‌క‌టించుకుంది. ఈ ఐఎస్ఐఎస్ పాకిస్థాన్ అధినేత అయిన ఎమిర్ మ‌వాల‌వీ అబ్దుల్లా ఫ‌రూఖీయే ఈ దాడుల్లో కీల‌క‌పాత్ర పోషించిన‌ట్లు ఆఫ్ఘ‌న్ వ‌ర్గాలు వెల్ల‌డించాయి.
 
ఫ‌రూఖీకి గ‌తంలో ల‌ష్క‌రే తోయిబా, తెహ్రీకే తాలిబ‌న్‌ల‌తో సంబంధాలు ఉన్నాయి. 2019, ఏప్రిల్‌లో ఇస్లామిక్ స్టేట్ పాకిస్థాన్ హెడ్‌గా మ‌వాల‌వి జియావుల్ హ‌క్ అలియాస్ అబు ఫ‌రూఖీ ఖోర్సానీ స్థానంలో ఫ‌రూఖీ నియ‌మితుడ‌య్యాడు.  2020లో కాబూల్ గురుద్వారాలో జ‌రిగిన పేలుడులో ఇత‌డే ప్ర‌ధాన సూత్ర‌ధారి. ఈ విష‌యాన్ని అత‌డు కూడా అంగీక‌రించాడు. పాకిస్థానే ఈ పేలుళ్ల‌కు కార‌ణ‌మ‌నీ ఫ‌రూఖీ చెప్పాడు. 
 
కాబూల్ జైల్లో ఉన్న ఇత‌న్ని తాలిబ‌న్లు మ‌ళ్లీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఇత‌ర ఉగ్ర‌వాదుల‌తో క‌లిపి విడిచిపెట్టారు. ఇప్పుడిత‌డే ఈ కాబూల్ ఎయిర్‌పోర్ట్ ద‌గ్గ‌ర ఆత్మాహుతి దాడుల‌కు ప్లాన్ చేసిన‌ట్లు ఆఫ్ఘ‌న్ వ‌ర్గాలు చెబుతున్నాయి.
 
103కు పెరిగిన మృతుల సంఖ్య
 
కాబుల్  జంట పేలుళ్ల ఘటనలో ఇప్పటి వరకు 103 మంది మృతిచెందారు. మరో 200 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో అమెరికాకు చెందిన 13 మంది సైనికులు కూడా ఉన్నారు. దీనికి తామే బాధ్యత వహిస్తున్నట్లు ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐఎస్‌ఐఎస్‌) ప్రకటించింది. 
 
ఈ దాడిని ప్రపంచ దేశాలతో పాటు తాలిబన్లు కూడా ఖండించారు. ఈ పేలుళ్లల్లో 28 మంది తమ సభ్యులు చనిపోయారని తాలిబన్లు ప్రకటించారు. ఇదిలా ఉండగా.. కాబూల్‌ ఎయిర్‌పోర్ట్‌ వద్ద మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందని అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ జనరల్‌ ఫ్రాంక్‌ మెకంన్జీవెల్లడించారు. 
 
ఈసారి ఉగ్రవాదులు రాకెట్లు, మానవబాంబులతో ఎయిర్‌పోర్ట్‌ లక్ష్యంగా దాడులు చేయవచ్చని హెచ్చరించారు. ఎయిర్‌పోర్ట్‌ బయట ఉన్న వ్యక్తులతో పాటుగా ఎయిర్‌పోర్ట్‌ లోపల ఉన్నవారు కూడా జాగ్రత్తగా ఉండాలని హితవు చెప్పారు. 
 
తాలిబన్ల ఆక్రమణ తరువాత ఆ దేశం వారి చేతుల్లోకి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. అమెరికా తన సైన్యాన్ని ఉపసంహరించుకోవడంతో.. ప్రస్తుతం తాలిబన్ల ఫైటర్లు మాత్రమే అక్కడ భద్రతా సంబంధమైన విధులు నిర్వహిస్తున్నారు. పోలీసు, సైనికులు ఇంకా విధుల్లోకి రాలేదు. దీంతో భద్రతా పరమైన లోపాలు అక్కడ ఉత్పన్నమయ్యాయి. అగ్రదేశాల నిఘా సమాచారాన్ని తాలిబన్లు పట్టించుకోకపోయి ఉండటం వల్లే ఇలా జరిగిందని భావిస్తున్నారు.