ప్రముఖ జర్నలిస్ట్ సదాశివ శర్మ మృతి

సీనియర్ జర్నలిస్ట్ ముళ్ళపూడి సదాశివ శర్మ (62) శుక్రవారం ఉదయం హైదరాబాద్ లోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అకాల మరణానికి గురయ్యారు. ఆయనకు భార్య, ఒక కుమార్తె గలరు. గత వారం రోజులు గా జ్వరం తో బాధపడుతున్న ఆయనను గత రాత్రి ఆస్పత్రిలో చేర్చారు. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు జర్నలిజం వృత్తి లోనే కొనసాగారు.  
 
హిందూస్థాన్ సమాచార్,ఎన్ ఎస్ ఎస్ వార్తా సంస్థ ల్లో కొంతకాలం విలేఖరి గా, ఆ తర్వాత ఈనాడులో చాలాకాలం ఉప సంపాదకుని గా, పిదప ఆంధ్ర భూమి లో ఉప సంపాదకునిగా, ఎక్స్ ప్రెస్ గ్రూప్ ఆంధ్రప్రభ సండే డెస్క్లోలో పని చేశారు. కొద్దికాలం కృష్ణాపత్రికలో పని చేసిన తర్వాత హిందీ మిలాప్ లో న్యూస్ ఎడిటర్ గా పనిచేశారు. 
 
కొత్త యాజమాన్యం వచ్చాక ఆంధ్రప్రభ సంపాదకునిగా పనిచేశారు. చివరిగా ఆంధ్ర భూమిలో  ఎం.వి.ఆర్.శాస్త్రి తర్వాత ఏడాది పాటు సంపాదక భాద్యతలు కూడా నిర్వహించారు. లాక్ డౌన్ పేరుతో ఆంధ్రభూమిని మూసివేయడంతో ఖాళీగానే ఉంటున్నారు. సాక్షి జర్నలిజం స్కూల్ లో జర్నలిజంపై పాఠాలు కూడా చెప్పేవారు. నరేంద్ర మోదీ ‘మన్‌కీ బాత్’ కార్యక్రమాన్ని దూరదర్శన్ కోసం సదాశివశర్మ చాలాకాలం పాటు తెలుగులో అనువదించేవారు.
ఆరోగ్య  సమస్యలు  ఎదురైనా, ఉద్యోగ సంబంధ సంక్షోభాలు ఎదురైనా ఎల్లప్పుడూ చిరునవ్వుతో పలకరిస్తుండేవారు. యువ పాత్రికేయులను ప్రోత్సహిస్తుండేవారు. టిడిపి అధినేత చంద్రబాబునాయుడుకు హిందీ ప్రసంగాలు తయారు చేసి, వాటిని  ప్రసంగించే విషయంలో సహకారం అందించారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేసిన సమయంలో ఆయనకు కూడా హిందీ భాష విషయంలో సహకారం అందించారు. 
సదాశివ శర్మ మరణం పట్ల ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు విచారం వ్యక్తం చేశారు. పాత్రికేయ జీవితంలో విలువలకు కట్టుబడి తన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వహించారని కొనియాడారు. ఆయన కుటుంభం సభ్యులకు సానుభూతి తెలిపారు.సదాశివ శర్మ మరణం పట్ల బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, ఎంపి బండి సంజయ్ కుమార్ సంతాపం తెలిపారు.
 
సీనియర్ పత్రికా సంపాదకులు, బహుభాషా  కోవిదుడు, హిందీ, తెలుగు భాషలో  నిష్ణాతుడు  సదాశివ శర్మ మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ప్రగాఢ సంతాపం ప్రకటించారు. సదాశివ శర్మ ఉత్తమ జర్నలిస్టుగా పేరొందారని నివాళులు అర్పించారు.
 
సదాశివ శర్మ తండ్రి ముళ్ళపూడి సూర్యనారాయణ మూర్తి ప్రముఖ సాహితీవేత్త. వికారాబాద్ లో అధ్యాపకునిగా పనిచేస్తూ జాతీయ సాహిత్య పరిషత్ ఏర్పాటులో, విస్తరణలో కీలక భూమిక వహించారు. ఆయన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పశ్చిమ ఆంధ్ర ప్రదేశ్ (ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం) బౌద్ధిక ప్రముఖ్ గా పనిచేశారు.