టాలీవుడ్ డ్రగ్స్ కేసులో `బిట్ కాయిన్’ లావాదేవీలు?

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియా నగదు లావాదేవీలు బిట్ కాయిన్ రూపంలో జరిగాయన్న కోణంలో ఇడి దర్యాప్తు వేగవంతం చేస్తోంది. డ్రగ్స్ కొనుగోలు ద్వారా విదేశాలకు ఎంత డబ్బు మళ్లించారు? డబ్బంతా ఎక్కడిది? వంటి అంశాలపై ఇడి విచారణ జరుపుతోంది.

ఈ బిట్ కాయిన్ల రూపంలోనే డ్రగ్స్ పెడ్లర్లు పెద్ద మొత్తంలో ఆర్థిక లావాదేవీలు జరిపారని ఇడి అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ డ్రగ్స్ కేసులో పెద్ద ఎత్తున మనీలాండరింగ్ జరిగిందని భావిస్తున్న ఇడి ఈ వ్యవహారాన్ని నిగ్గు తేల్చే దిశగా దర్యాప్తు సాగిస్తోంది. 

ఇదిలావుండగా డ్రగ్ పెడ్లర్లంతా విదేశీయులేనని, గోవా, హైదరాబాద్ కేంద్రంగా వాళ్లు డ్రగ్స్ దందా చేసినట్లు ఇడి గుర్తించింది. ఇప్పటి వరకు ఇడి జరిపిన విచారణలో హవాలా లాంటి ఆర్థిక నేరాలు బయటపడినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన కెల్విన్‌కు అమెరికాలోని అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియాతో సంబంధాలున్నాయని తేలింది.

అమెరికా నుంచి డ్రగ్స్ దిగుమతి చేసుకున్న కెల్విన్ ఆన్‌లైన్, డార్క్ వెబ్‌సైట్ లో డ్రగ్స్ సరఫరా చేసినట్లు విచారణలో తేలింది. అదేవిధంగా డ్రగ్స్ సరఫరాకు ఈ కేసులోని కీలక నిందితుడు కెల్విన్ కొరియర్ సర్వీస్(పోస్టల్ డిపార్ట్‌మెంట్) ద్వారా ఇంపోర్ట్స్ జరిగినట్లు ఇడి అనుమానిస్తోంది.

డ్రగ్స్ సరఫరా నేపథ్యంలో ఆర్థిక లావాదేవీలు ప్రధానంగా బిట్‌కాయిన్ రూపంలో జరిగినట్లు తేలడంతో ఇడి ఆ దిశగా దర్యాప్తు ప్రారంభించింది. ఇటీవలి కాలంలో మాఫియా ఈ డిజిటల్ కరెన్సీల ద్వారా వ్యాపారాలు కొనసాగిస్తున్నారని, అలాగే డ్రగ్స్ మాఫియాకు చెల్లింపులు సైతం బిట్‌కాయిన్ రూపంలో చేసినట్టు ఇడి అధికారుల దృష్టికి వచ్చింది.