తాలిబన్లను సవాల్ చేస్తున్న పంజ్‌షేర్‌ దళాలు

రెబల్స్ చేతుల్లోకి వెడుతున్న ప్రాంతాలను తిరిగి వరుసగా స్వాధీనం చేసుకొంటున్న తాలిబాన్లకు పంజ్‌షేర్‌ లోయను హస్తగతం చేసుకోవడం మాత్రం సాధ్యం కావడం లేదు. వందలాదిమంది పోరాట యోధులను పంపి, ఆ లోయను అష్టదిగ్బంధనం చేస్తున్నా వారు మాత్రం లొంగడం లేదు. ఈ ప్రాంతం కాబూల్‌కు ఉత్తరాన 80 కిలోమీటర్ల దూరంలో ప్రారంభమవుతుంది.

తాలిబన్లతో యుద్ధానికి తాము సిద్ధంగా ఉన్నామని  పంజ్‌షీర్‌ ప్రతిఘటన దళ (ఎన్ఆర్ఎఫ్)  కమాండర్ అమీర్ అక్మల్  స్పష్టం చేశారు. ఒక వంక శాంతియుతంగా వారితో అవగాహనకు ప్రయత్నం చేస్తున్నామని చెబుతున్న తాలిబన్లు వందలాదిమంది సాయుధులను పంపడం ద్వారా తన కపట పన్నాగాన్ని వెల్లడి చేస్తున్నారు. 

పంజ్‌షీర్ మూడు వైపుల నుండి చుట్టుముట్టబడినట్లు తాలిబాన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ సోమవారం చెప్పారు. పంజ్‌షేర్‌ దళాలతో 40 మంది తాలిబాన్‌ ప్రతినిధుల బృందం చర్చలు సాగించినా పఃలించినట్లు లేదు. 

దీనిపై తాలిబన్‌ వ్యతిరేక దళాలు ఓ ట్వీట్‌ చేస్తూ  ‘ఖోర్సాసన్‌ ప్రజల విలువను అంగీకరించడమా లేదా ప్రతిఘటించడమా..ఈ రెండే మార్గాలున్నాయి’ అని స్పష్టం చేశాయి. గతంలో రష్యా సేనలను, తాలిబన్లను వీరోచితంగా పోరాడి ప్రతిఘటించిన ఇక్కడి పోరాట యోధులు వంద  ఏళ్లకు పైగా ఆక్రమణల నుండి తమ లోయను కాపాడుకొంటూ వస్తున్నారు.

శాంతికి లేదా యుద్దానికి సిద్ధం 

తనను తాత్కాలిక అధ్యక్షునిగా ప్రకటించుకున్న ఆఫ్ఘాన్‌ మాజీ ఉపాధ్యక్షుడు అబ్దుల్లా నలేహ్ మాట్లాడుతూ తాలిబన్లు భద్రతా బలగాలతో చేతులు కలిపి అర్థవంతమైన చర్చలు జరపాలని సూచించారు. చర్చలకు సిద్ధమౌతుందా, ప్రతిఘటన దళాలు ఎలాంటి పరిస్థితులకైనా సిద్ధంగా ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.

అయితే పంజ్‌షేర్‌ దళాలధినేత అహ్మద్‌ మజూద్‌ తాలిబన్లతో శాంతియుతంగా చర్చలు జరపాలని పేర్కొన్నారు. కానీ దళాలు పోరాడేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలుస్తోంది. చర్చల ద్వారానే తాలిబన్లను అడ్డుకోగలమని అహ్మద్‌ పేర్కొన్నారు. యుద్ధం జరగడం తమకు ఇష్టం లేదని చెప్పారు. అయితే చర్చలు అస్పష్టమైన నేపథ్యంలో గౌరవ మర్యాదలకు ఎటువంటి భంగం కలగకుండా లంగిపోయి, తాలిబన్లతో ఒప్పందం కుదుర్చుకునే దిశగా మసూద్‌ యోచిస్తున్నారని వారి ప్రతినిధి ఒకరు తెలిపారు.

కాగా, ’’మా పాపులర్ రెసిస్టెన్స్ ఫ్రంట్‌లో చేరిన వారిలో ఎక్కువ మంది యువకులు, సైనికులు,మాజీ జిహాదీ కమాండర్లు ఉన్నారు, వారు నిర్బంధాన్ని అంగీకరించరు… అందరికీ సమగ్రమైన ఆమోదయోగ్యమైన వ్యవస్థను కోరుకుంటున్నారు” అని వారి కమాండర్ అమీర్ అక్మల్ చెప్పారు.

“యుద్ధం చేయడానికి మాకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి, మేము తాలిబన్‌లకు వ్యతిరేకంగా శాంతి చర్చలకు లేదా యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం’’ అని పేర్కొన్నారు.  హిందూకుష్ పర్వతాల్లోని పంజ్ షీర్ లోయ అజేయమైన కోటగా మారుతోంది. ఎత్తైన పర్వతాలు, ఇరుకైన లోయ, పంజ్‌షీర్ నది అందించిన రక్షణ, పంజ్‌షీర్ లోయకు వెళ్లే అన్ని రహదారుల్లో తాజిక్ యోధుల ఆధిపత్యం కొనసాగుతోంది.

రెసిస్టెన్స్ ఫ్రంట్ లో చేరడానికి అనేక మంది ఆఫ్ఘన్ నేషనల్ ఆర్మీ సైనికులు పంజ్‌షీర్ చేరుకున్నారు.‘‘మేం పాపులర్ రెసిస్టెన్స్ ఫ్రంట్‌లో చేరడం ద్వారా మా మాతృభూమిని, స్వేచ్ఛను కాపాడుకోవాలనుకుంటున్నాం’’ అని ఆ దళంలోని మరో పోరాట యోధుడు హమీద్ తెలిపారు. “తాలిబాన్ యుద్దవీరులు దాడి చేస్తే, వారు మా నుండి తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొంటారు” అని  ఎన్ఆర్ఎఫ్ నాయకులలో ఒకరైన అహ్మద్ మసౌద్ గత వారం వాషింగ్టన్ పోస్ట్‌లో పేర్కొన్నారు. అతను దివంగత గెరిల్లా కమాండర్ అహ్మద్ షా మసౌద్ కుమారుడు. 

షా మాసౌద్ పంజ్‌షీర్ లోయను సోవియట్ వ్యతిరేక, తాలిబాన్ వ్యతిరేక కోటగా మార్చి ఇక్కడి ప్రజల ఆరాధనకు పాత్రుడు అవుతున్నాడు. 1980 లలో మసౌద్ పలు సోవియట్ దాడులను, 1990 ల చివరలో తాలిబాన్లు ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించడాన్ని చూసిన పంజ్‌షీర్ నివాసితులు రక్షణాత్మక సన్నాహాలలో సిద్దహస్తులయ్యారు. 

పటిష్టమైన పద్మవ్యూహం

హిందూఖుష్‌ పర్వత శ్రేణుల్లో పంజ్‌షిర్‌ లోయ ఉంది. పంజ్‌షిర్‌ (పంజ్‌షేర్‌) అంటే ఐదు సింహాలు అని అర్థం. ఇక్కడి జనాభా లక్షకు పైనే. చుట్టూ కొండలు, ఇరుకైన పర్వత శ్రేణులు, పంజ్‌షిర్‌ నదీ ప్రవహిస్తుంటాయి. ఈ లోయలోనే తజిక్‌ యుద్ధవీరులు ఉంటారు. చొరుబాటుదారుల్ని చంపి పాతరేస్తారు ఇక్కడ.  అహ్మద్‌ షా మసూద్‌ లాంటి తజిక్‌ పోరాటయోధుల ఆధ్వర్యంలో సోవియట్‌ సైన్యాన్ని, తాలిబన్లను సైతం నిలవరించగలిగింది ఈ దళం. భీకర యోధులుగా వీళ్లకు పేరుంది. అయితే పాక్‌ వెన్నుదన్నులతో నడిచే తాలిబన్లను వీళ్లు ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించరు. 

అందుకే ఇప్పుడు అఫ్గన్‌ సైన్యం నుంచి భారీగా ఈ దళంలోకి చేరికలు వస్తున్నాయి. సుమారు తొమ్మిదివేల మంది ప్రస్తుతం ఈ దళంలో ఉన్నట్లు తెలుస్తోంది. వీళ్లలో స్థానిక మిలిటెంట్లు, స్టాఫ్‌ ఉన్నారు. ‘‘ఆర్మీతో మేం సాధించింది ఏం లేదు. ఇప్పుడు మా మాతృభూమిని  తాలిబన్ల చెర నుంచి విడిపించుకోవాలనుకుంటున్నాం’ అని తజిక్‌  ప్రకటించింది.

మిలీషియా ఫైటర్లు, మాజీ ప్రభుత్వ సైనికులు పంజ్‌షీర్ లోయపై తాలిబాన్ల దాడి జరుగుతుందనే అంచనాతో ముందుగానే ఇసుక బస్తాలతో మెషిన్ గన్ గూళ్లు, మోర్టార్లు, నిఘా పోస్ట్‌లను ఏర్పాటు చేసుకున్నారు. అమెరికా తయారు చేసిన హమ్‌వీస్, టెక్నికల్‌ మెషిన్ గన్ లను ట్రక్ లలో అమర్చుకొని ఈ ప్రాంతంలో పెట్రోలింగ్  చేస్తున్నారు. 

చాలామంది వద్ద రైఫిల్స్, రాకెట్-ప్రొపెల్డ్ గ్రెనేడ్లు, వాకీ-టాకీలు ఉన్నాయి. వ్యూహాత్మకంగా బలమైన కొత్తగా ఉండే ఈ లోయలో ప్రధానంగా  తాజిక్‌ల జనాభా నివాసం ఉంటుంది. వారికి ఎత్తైన పర్వతాల నీడలో, ఇరుకైన ప్రవేశాలతో సహజ రక్షణ పాయింట్లను అందిస్తుంది. అయితే అంతర్జాతీయ సహాయం లేకుండా, అష్టదిగ్బంధనంలో ఎన్ని రోజులు పోరాటం చేస్తుండగాలరన్నది ప్రశ్నార్ధకరమే.