ఆదిత్యనాథ్‌ను చెప్పుతో కొట్టాలన్నఉద్ధవ్ థాకరే!

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేను చెప్పుతో కొడతానని అన్నందుకు కేంద్ర మంత్రి నారాయణ రాణె తన ప్రభుత్వం అరెస్ట్ చేయడంతో థాకరే ఇప్పుడు  ఇరకాట పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. మూడేళ్ళ క్రితం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను చెప్పుతో కొట్టాలని అన్న ఉద్ధవ్ థాకరేను కూడా అరెస్ట్ చేయాలంటూ భారతీయ జనతా పార్టీ నేతలు, కార్యకర్తలు డిమాండ్ చేయడంతో మహారాష్ట్రలో అధికార కూటమి ఆత్మరక్షణలో పడింది.

ఇంకా ముఖ్యమంత్రి పదవి చేపట్టక ముందు, యోగిపై ఉద్ధవ్ చేసిన ఈ వ్యాఖ్యలు కేంద్రమంత్రి రాణె అరెస్ట్‌తో చర్చల్లోకి వచ్చాయి. 2018లో జరిగిన ఓ కార్యక్రమంలో ఛత్రపతి శివాజీ మహరాజ్‌ విగ్రహానికి యోగి ఆదిత్యనాథ్, చెప్పులు వేసుకొని పూలదండ వేయడంపై ఉద్ధవ్ థాకరే తీవ్ర స్థాయిలో స్పందించారు. ‘‘అతడు ముఖ్యమంత్రిగా ఎలా ఉంటాడు? అతడు యోగి కదా.. అన్ని పరిత్యజించి ఇల్లు వదిలి పెట్టి వెళ్లి గుహలో కూర్చొని ధ్యానం చేసుకోవాలి. కానీ అతడు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నారు. పైగా తనను తాను యోగినని చెప్పుకుంటున్నారు. ఈ యోగి గాలి బుడగలాంటి వారు” అంటూ ఎద్దేవా చేశారు.

“ఎందుకంటే యోగికి ఉండే లక్షణాలు ఆయనకు లేవు. చెప్పులు వేసుకుని శివాజీకి మాల వేశారు. నాకైతే అదే చెప్పులతో ఆయనను కొట్టాలని అనిపించింది. మహరాజ్ ముందు ఎవరు ఇలా నిల్చున్నా నాకు ఇలాగే అనిపిస్తుంది’’ అని ఉద్ధవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, దీనికి సంబంధించిన వీడియోను కొంత మంది నెటిజెన్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ‘శివసేన హిపోక్రసీ’ అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. ఉద్ధవ్ థాకరేపై కేసు ఫైల్ చేసి ఆయనను అరెస్ట్ చేయాలని యోగిని డిమాండ్ చేస్తున్నారు.

ఉద్ధవ్ థాకరేపై కేసు నమోదు చేయాలని యవత్‌మల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు నితిన్ భుటడ డిమాండ్ చేశారు. నితిన్ ఈ మేరకు ఉమెర్‌ఖేద్ పోలీస్ స్టేషన్‌లో  చేసిన ఫిర్యాదులోని వివరాల ప్రకారం, 2020 అక్టోబరు 25న దసరా సందర్భంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు.

 ఉద్ధవ్ వ్యాఖ్యలు సమాజంలో అశాంతిని, అల్లర్లను ప్రేరేపించే అవకాశం ఉందన్నారు. ఉద్ధవ్‌పై మహారాష్ట్రలోని అనేక పోలీస్ స్టేషన్లలో బీజేపీ నేతలు ఫిర్యాదులు చేస్తారని నితిన్ చెప్పారు. 

బీభత్సం సృష్టిస్తున్న శివసైనికులు  

కాగా, వీధి పోరాటాలకు పేరొందిన శివసేన కార్యకర్తలు రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఏర్పడడంతో సంవత్సరంకు పైగా మౌనంగా ఉంటూ వస్తున్నారు. అయితే  కేంద్రమంత్రి నారాయణ్ రాణే ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై వ్యాఖ్యలను ఆసరాగా చేసుకొని శివసేన కార్యకర్తలు  బీభత్సం సృష్టించారు.  

కేంద్ర మంత్రికి సంబంధించిన ఆస్తులపై దాడిచేశారు. అలాగే నాసిక్‌లోని బీజేపీ కార్యాలయంపై కూడా రాళ్లు రువ్వారు. ఘర్షణకు దారి తీసింది. దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ముంబైతోపాటు  రాష్ట్రంలో పలుచోట్ల ఆందోళనలు , ప్రదర్శనలు  చేపట్టారు.  అనంతరం  పూణేలోని ఆర్ డెక్కన్ మాల్‌పై రాళ్లు రువ్వారు. దీంతో తీవ్ర నష్టం సంభవించినట్టు తెలుస్తోంది.

యువ నేత వరుణ్ దేశాయ్ నాయకత్వంలో, కొంతమంది శివసేన కార్యకర్తలు నినాదాలు చేస్తూ ముంబైలోని జుహులోని రాణే బంగ్లాలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో, రాణే మద్దతుదారులు ప్రతిఘటించడంతో జుహు ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ముఖ్యంగా ముంబై, నాసిక్, చిప్లూన్, సాంగ్లీ, ఔరంగాబాద్ లలో శివ సైనికులు రెచ్చిపోయారు. వీరి ఆందోళనలు, ఘర్షణలు తీవ్ర ఉద్రిక్తత రాజేశాయి. దీంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.