సుప్రీం కోర్ట్ కు ముగ్గురు మహిళలతో సహా 9 మంది జడ్జీలు

భారత సుప్రీం కోర్ట్ చరిత్రలో మొదటిసారిగా ముగ్గురు మహిళలతో సహా మొత్తం తొమ్మిది మంది న్యాయమూర్తులుగా నియమితులయ్యారు. వీరిని నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ 9 మంది కొత్త న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదం తెలిపారు.

సుప్రీంకోర్టుకు కొత్తగా నియమితులవుతున్న న్యాయమూర్తుల్లో .. సీనియర్‌ న్యాయమూర్తి బీవీ నాగరత్న 2027 సెప్టెంబర్‌ నెలలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఈ పదవిలో నియమితులైన తొలి మహిళగా న్యాయమూర్తిగా బీవీ నాగరత్న చరిత్రలో నిలిచిపోనున్నారు. సుప్రీంకోర్టుకు కొత్తగా 9 మంది న్యాయమూర్తులను నియమించాలని సుప్రీంకోర్టు కొలిజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. వీరికి ముగ్గురు మహిళా న్యాయమూర్తులు ఉన్నారు.

సుప్రీం కోర్ట్ చరిత్రలో ఒకేసారి అంతమంది మహిళా న్యాయమూర్తులను నియమించడం కూడా ఇదే మొదటిసారి. సుప్రీంకోర్టు కొత్త జడ్జిలుగా జస్టిస్‌ హిమ కోహ్లి, బీవీ నాగరత్న, జస్టిస్‌ బేల త్రివేది, జస్టిస్‌ జెకె. మహేశ్వరి, జస్టిస్‌ సి.టి. రవికుమార్‌, జస్టిస్‌ పీఎస్‌ నరసింహ, జస్టిస్‌ సుందరేష్‌, జస్టిస్‌ నాగార్జున ఉన్నారు. సుప్రీంకోర్టులో హిమా కోహ్లి బాధ్యతలు స్వీకరిస్తే తెలంగాణ సీజేగా మరొకరు రానున్నారు.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని న్యాయమూర్తులు యూయూ లలిత్‌, ఏఎం ఖన్‌విల్కర్‌, డీవై చంద్రచూడ్‌, ఎల్‌ నాగేశ్వర్‌రావులతో కూడిన సుప్రీంకోర్టు కొలీజియం 9 మంది పేర్లను కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఒకేసారి  9 మంది న్యాయమూర్తులను కొలీజియం సిఫారసు చేయడం, వారిని కేంద్రం ఆమోదించడం ఇదే మొదటిసారి అని తెలుస్తున్నది. పైగా, కొలీజియం నుండి  సిఫార్సు రాగానే పది రోజుల లోపుగానే  కేంద్రం ఆమోదం తెలపడం కూడా ఒక రికార్డు గా భావిస్తున్నారు.

సుదీర్ఘ విరామం తర్వాత సీజేఐ జస్టిస్‌ రమణ చొరవతో ఈ నెల 17న కొలీజియం సమావేశమై అప్పటికి ఉన్న 9 ఖాళీల భర్తీకి పేర్లను ఏకగ్రీవంగా సిఫారసు చేసింది. ఆ జాబితాలో నలుగురు హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు. మరో నలుగురు న్యాయమూర్తులు, మరొకరు సీనియర్‌ న్యాయవాది పీఎస్‌ నరసింహ. సాధారణంగా ఇలాంటి సిఫారసులపై ప్రభుత్వం ప్రశ్నలు వేయడం, వివరణలు కోరడం పరిపాటి. కానీ, ఈ దఫా ఎలాంటి అభ్యంతరాలు లేవనెత్తకుండా ఆమోదించడం విశేషం.

ప్రస్తుతం సుప్రీంకోర్టులో చీఫ్‌ జస్టిస్‌తో కలిపి 24 మంది జడ్జిలు ఉన్నారు. కొత్తగా 9 మంది నియామకం జరిగితే ఆ సంఖ్య 33కు పెరుగుతుంది. మొత్తం 34 న్యాయమూర్తుల పదవుల్లో ఒకటి మినహా అన్నీ భర్తీ అవుతాయి. ఆ ఒక్క ఖాళీ కూడా కొలీజియం సమావేశం ముగిసిన తర్వాత జస్టిస్‌ నవీన్‌ సిన్హా పదవీ విరమణతో ఏర్పడినదే.