దోహా ఒప్పందాలకు తాలిబన్లు బేఖాతరు

ఖ‌తార్ రాజ‌ధాని దోహాలో జ‌రిగిన దోహా ఒప్పందాలకు తాలిబన్లు బేఖాతరు చేసినట్టు విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు. అప్ఘన్ సమాజంలో అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం వహించే ప్రభుత్వం.. మతపరమైన స్వేచ్ఛ, ప్రజాస్వామ్యానికి కట్టుబడాలని దోహా ఒప్పందం చెబుతోంది. 
 
తాలిబన్ నేతలు, అమెరికా మధ్య 2020 ఫిబ్రవరిలో ఈ ఒప్పందం జరిగింది.ఆఫ్ఘ‌నిస్థాన్‌లో ప్ర‌స్తుతం నెల‌కొన్న ప‌రిస్థితులు, భార‌త ప్ర‌భుత్వం చేప‌డుతున్న త‌ర‌లింపు చ‌ర్య‌ల‌పై కేంద్రం జరిపిన అఖిల పక్ష సమావేశంపై అధ్యక్షత వహిస్తూ అక్క‌డి ప‌రిస్థితిపై వివిధ పార్టీల నేత‌ల‌కు ఆయ‌న వివ‌రించారు. ఆఫ్ఘ‌న్‌లో ప్ర‌స్తుతం సంక్షోభం చాలా తీవ్రంగా ఉన్న‌ద‌ని, సాధ్య‌మైనంత ఎక్కువ మందిని అక్క‌డి నుంచి త‌ర‌లించ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని జైశంక‌ర్ చెప్పారు.
 
సంక్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో అక్కడ ఉంటున్న భారతీయులను వెనక్కి తీసుకురావడానికి కేంద్రం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని ఆయన తెలిపారు.  ఆప్ఘ‌నిస్తాన్‌లో ఉన్న వారిని త‌ర‌లించ‌డ‌మే త‌క్ష‌ణ క‌ర్త‌వ్య‌మ‌ని అఖిల ప‌క్ష నేత‌ల‌తో ప్ర‌భుత్వం పేర్కొన్న‌ది. దీర్ఘ‌కాలికంగా ఆఫ్ఘ‌నిస్తానీల‌తో స్నేహ సంబంధాల‌ను ఆశిస్తున్న‌ట్లు మంత్రి జైశంక‌ర్ తెలిపారు.
ఆఫ్ఘానిస్తాన్ లోని భారతీయులను తీసుకు రావడానికి `దేవి శక్తి’ ఆపరేషన్ చేపట్టామని చెబుతూ,  ఇప్పటికే ఆరు విమానాలలో తీసుకు వచ్చామని జైశంకర్ తెలిపారు. అయితే కొందరు సమయానికి చేరుకోలేక పోవడంతో వారిని తీసుకు రాలేకపోయామని చెప్పారు. జైశంకర్‌తో పాటు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఈ సమావేశంలో పాల్గొన్నారు.
 
అప్ఘన్ పరిస్థితి, కేంద్రం తీసుకుంటున్న చర్యలపై ఏర్పాటు చేసిన ఈ అఖిలపక్ష సమావేశంలో ఎన్‌సీపీ నేత శరద్ పవార్, రాజ్యసభలో కాంగ్రెస్ నేత మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభలో కాంగ్రెస్ నేత అధీకర్ రంజన్ చౌదరి, డీఎంకే ఎంపీ టీఆర్ బాలు, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ, అప్నాదళ్ ఎంపీ అనుప్రియ పటేల్ తదితరులు పాల్గొన్నారు. 
 
ఆప్ఘనిస్థాన్‌లో భారత రాయబారి రుద్రేంద్ర టాండన్, విదేశాంగ కార్యదర్శి హర్ష ష్రింగ్లే కూడా హాజరయ్యారు. అప్ఘన్‌లో నెలకొన్న పరిస్థితిని అన్ని రాజకీయ పార్టీలకు వివరించాల్సిందిగా కేంద్ర విదేశాంగ శాఖను ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ఆదేశించారు.
 కల్లోలిత ఆఫ్గాన్‌ నుండి తమను తరలించాలంటూ సుమారు 15 వేల మంది ప్రభుత్వాన్ని సంప్రదించారని చెబుతూ అమెరికా, రష్యా, చైనా వంటి ఇతర దేశాలు తీసుకుంటున్న చర్యల గురించి విదేశాంగ కార్యదర్శి విపక్షాలకు వివరించారని పేర్కొన్నాయి. 
 
కాబూల్‌ నుండి రోజుకూ రెండు విమానాల్లో స్వదేశీయులను భారత్‌ తరలిస్తోంది. ఇప్పటి వరకు 220 మందికి పైగా భారతీయులను, 600 మందికి పైగా ఇతర దేశాల వారిని తరలించింది. కాబూల్‌ విమానాశ్రయంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా తరలింపు కూడా ఆలస్యంగా జరుగుతోంది.