కేరళలో కరోనా పరిస్థితులపై కేంద్ర మంత్రి ఆందోళన

కేరళలో కరోనా పరిస్థితులపై కేంద్ర మంత్రి మురళీధరన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. సీఎం పినరయి విజయన్‌ నేతృత్వంలోని ప్రభుత్వం మహమ్మారిని ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
‘కేరళలో పరిస్థితి విషమంగా ఉంది. వైరస్‌ వ్యాప్తిని అడ్డుకట్టడానికి శాస్త్రీయ పద్ధతులను ఉపయోగించే బదులు.. రాజకీయ లబ్ధికి కోసం మహమ్మారిని ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తోంది. భారత వైద్య పరిశోధన మండలి మార్గదర్శకాలు అనుసరించాలి. కేరళ హోమ్ క్వారంటైన్ (ప్లాన్) ఘోరంగా విఫలమైంది’ అని విమర్శించారు.
కరోనా నియంత్రణపై రాష్ట్రం మరింత శ్రద్ధ వహించాలని రాష్ట్ర ప్రభుత్వంకు సూచించారు. భవిష్యత్‌లో మహారాష్ట్ర, ఢిల్లీ వంటి రాష్ట్రాలు కేరళ అధిక కేసుల భారాన్ని ఎదుర్కొంటాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆరోగ్య సంక్షోభాన్ని తగ్గించడానికి రాష్ట్రంలో వామపక్ష ప్రభుత్వం ఏమీ చేయలేదని, దాన్ని కప్పిపుచ్చుకోవడంలో బిజీగా ఉందని బీజేపీ ఆరోపించింది.
కాగా, దేశ‌వ్యాప్తంగా గ‌డిచిన 24 గంట‌ల్లో 46 వేల కొత్త క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయ‌ని, దాంట్లో 58 శాతం కేసులు కేర‌ళ రాష్ట్రంలోనే ఉన్న‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ కార్య‌ద‌ర్శి రాజేశ్ భూష‌ణ్ తెలిపారు. మిగితా అన్ని రాష్ట్రాల్లో కేసుల సంఖ్య త‌గ్గుతున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. 
 
కేర‌ళ‌లో యాక్టివ్ కేసుల సంఖ్య ల‌క్ష దాటింద‌ని, ఇక మ‌హారాష్ట్ర‌, క‌ర్నాట‌క‌, త‌మిళ‌నాడు, ఏపీల్లో ల‌క్ష లోపే కేసులు ఉన్నాయ‌న్నారు. అయితే దేశ‌వ్యాప్తంగా ఉన్న కేసుల్లో 51 శాతం కేసులు కేర‌ళ‌, మ‌హారాష్ట్ర‌లో 16 శాతం కేసులు ఉన్న‌ట్లు తెలిపారు. మిగితా రాష్ట్రాల‌న్నీ కేవ‌లం 5 శాతం లోపే ఉన్న‌ట్లు చెప్పారు.