ఉత్కంఠ రేపుతున్న జగన్ బెయిల్ రద్దు కేసు

అక్రమాస్తుల కేసులో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిలకు ఇచ్చిన బెయిల్‌ను రద్దుచేయాలని వైసీపీ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్లపై సిబిఐ ప్రత్యేక కోర్ట్ బుధవారం తీర్పు ఇస్తున్నట్లు ప్రకటించగానే తీవ్ర ఉత్కంఠత ఏర్పడింది. అయితే తీర్పును సెప్టెంబర్ 15కు వాయిదా వేశారు. 

ఈ సందర్భంగా మూడు గంటలపాటు కోర్టులో వాదోపవాదాలు జరిగాయి.  సెప్టెంబరు 15న తీర్పు వెలువరిస్తామని బుధవారం ప్రకటించింది. జగన్‌, విజయసాయిరెడ్డి బెయిల్‌ షరతులను పూర్తిగా ఉల్లంఘించారని, అందుచేత వారి బెయిల్‌ రద్దుచేయాలంటూ రఘురామరాజు పిటిషన్లు దాఖలు చేశారు. 

ఆయన తరఫు న్యాయవాది ఎస్‌ వెంకటేశ్‌ వాదనలు వినిపిస్తూ.. వైసీపీ ఎంపీగా విజయసాయిరెడ్డి కేంద్ర హోం, ఆర్థికశాఖ కార్యాలయాల్లో అధికారులను తరచూ కలుస్తున్నారని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. ఈ భేటీల ద్వారా తనకు కేంద్రమంత్రులు, కేంద్రంలోని కీలకమైన ఉన్నతాధికారులతో సన్నిహిత సంబంధాలున్నాయనే సందేశాన్ని ఇస్తూ, విచారణను ప్రభావితం చేసుందుకు ప్రయత్నిస్తున్నారని నివేదించారు.

సాక్షులను ప్రత్యక్షంగా, పరోక్షంగా భయంపెట్టే ప్రయత్నం చేస్తూ.. పదే పదే బెయిల్‌ షరతులను ఉల్లంఘిస్తున్నారని తెలిపారు. జగన్‌ బెయిల్‌ రద్దు పిటిషన్‌పై ఇప్పటికే వాదనలు పూర్తికాగా, విజయసాయి కేసులో కూడా వాదనలు ముగిశాయని న్యాయస్థానం పేర్కొంది. 

జగన్‌ కేసులో తీర్పు రిజర్వు చేసినప్పటికీ, ఉత్తరువులు సిద్ధంగా లేకపోవడంతో రెంటింటిపైనా ఒకేరోజు తీర్పు వెల్లడిస్తామని తెలిపింది. ఉభయపక్షాల న్యాయవాదులూ అభ్యంతరం చెప్పకపోవడంతో రెండు పిటిషన్లపై వచ్చేనెల 15న తీర్పు వెలువరిస్తామని సీబీఐ కోర్టు తెలిపింది. అక్రమాస్తుల కేసుల్లో తాము బెదిరించినట్టు సాక్షులెవరూ అఫిడవిట్‌ వేయలేదని విజయసాయిరెడ్డి తరఫు న్యాయవాదులు అంతకుముందు తెలిపారు. ఈ పిటిషన్‌ చెల్లదని ప్రకటించాలని కోర్టును అభ్యర్థించారు. 

సీఎం జగన్‌, విజయసాయిరెడ్డి తమకున్న అధికారంతో ఏపీలో భయానక పరిస్థితులను సృష్టిస్తున్నారని రఘురామరాజు తరఫు న్యాయవాది వెంకటేశ్‌ తెలిపారు. దీంతో సాక్షులెవరూ సాక్ష్యం చెప్పేందుకు సాహించరని,ఈ నేపథ్యంలో బెయిల్‌ రద్దు చేయాలని కోరారు.  అప్పుడు సాక్షులు నిర్భయంగా సాక్ష్యం చెబుతారని కోర్టుకు నివేదించారు. 

కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి సీఎం అయిన నేపథ్యంలో ఆయన ప్రవర్తన, స్వభావం అరాచకంగా ఉన్నాయంటూ బెయిల్‌ రద్దు ఆవశ్యకతను వివరించారు. న్యాయస్థానమంటే రఘురామకు లెక్కలేదని విజయసాయిరెడ్డి తరఫు లాయర్లు వాదించగా.. ఈ కేసు విచారణ జరుగుతుండగానే జగన్‌ సొంత మీడియాలో.. బెయిల్‌ రద్దు పిటిషన్‌ కొట్టివేత అంటూ వచ్చిన వార్తను వెంకటేశ్‌ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.