మహిళా మోర్చా మహిళలపై పోలీసుల దాడి

గుంటూరులో రమ్య హత్యకేసులో నిజానిజాలు తేల్చాలని, రమ్య కుటుంబానికి తగిన న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ బీజేపీ మహిళా మోర్చా తరపున రాష్ట్ర అధ్యక్షురాలు నిర్మలా కిషోర్  వారం క్రిందట  ఢిల్లీలోని జాతీయ మహిళా కమిషన్, ఎస్సి కమిషన్ లకు వినతి పత్రాలు అందజేయయడంతో  జాతీయ ఎస్సి కమిషన్ గుంటూరులో రమ్య కుటుంబ సభ్యులను కలవడానికి వచ్చింది. 

అయితే  వారిని కలవడానికి వెళ్లిన తమ నాయకురాళ్ళపై పోలీసులు దాడి చేయడాన్ని బిజెపి మహిళా మోర్చా తీవ్రంగా ఖండించింది.
ముఖ్యమంత్రి ఇంటికి కూతవేటు దూరంలో సీతానగరంలో అత్యాచారం ఘటన మరవకముందే, రాష్ట్ర హోంమంత్రి ఇంటి దగ్గరలో నడి రోడ్డుపై ఈ హత్య జరిగిందని విచారం వ్యక్తం చేసింది. 

మహిళలకు రక్షణ కల్పించడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఇప్పటికే ఉన్న నిర్భయ చట్టాన్ని సరిగ్గా అమలు పరచకుండా, అనుమతి లేని దిశ చట్టం పేరిట 21 రోజుల్లో ఉరి తీస్తాం అని మోసపూరితమైన మాటలతో రాష్ట్ర ప్రజలను ముఖ్యమంత్రి  మభ్యపెడుతున్నారని ధ్వజమెత్తింది. 

ఎస్సి కమీషన్ ని కలిసి, రాష్ట్రంలో మహిళలకు ముఖ్యంగా దళిత మహిళలపై జరుగుతున్న దాడులను వివరించడానికి,  రమ్య కుటుంబానికి మరింత న్యాయం జరిగేలా కోరడానికి వచ్చిన బీజేపీ మహిళలను నడి రోడ్డుపై ఎర్రటి ఎండలో పోలీసులు అడ్డుకుని, నెట్టివేశారు.

పోలీసులకు, బీజేపీ మహిళా నాయకురాళ్లకు మధ్య జరిగిన తోపులాటలో రాష్ట్ర కార్యదర్శి సాదినేని యామిని శర్మ, నెల్లూరు జోనల్ ఇంచార్జి శ్రీమతి నళిని స్పృహ తప్పి పడిపోయారు. రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు నిర్మలా కిషోర్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాలతి రాణి తదితరులు గాయాలకు గురయ్యారు.