చెస్ ఆడవద్దు, మహిళలు  గడప దాటవద్దు… తాలిబన్ల ఫత్వాలు!

ఆప్ఘనిస్తాన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్న తర్వాత ముందే ఊహించినట్టుగానే మహిళలపై కఠిన ఆంక్షలు అమలవుతున్నాయి. ఒక్క మహిళలే కాదండోయ్ .. 20 ఏళ్లకు ముందు వారు వేటిపైన ఆంక్షలు పెట్టారో, మరలా రెండు దశాబ్దాల తర్వాత కూడా వాటిపైనే ఆంక్షలు పెడుతున్నారు. మహిళలను గడపదాటి బైటకు రావద్దని స్పష్టం చేస్తున్నారు.  

గతంలో వారి ఆధీనంలో ఉన్నప్పుడు చెస్‌ను బ్యాన్‌ చేశారు. ఇప్పుడు మళ్లీ చెస్‌ను బ్యాన్‌ చేయాలని చూస్తున్నారని వార్తలొస్తున్నాయి. తాలిబన్లు చెస్‌ను ఎందుకు బ్యాన్‌ చేయాలనుకుంటున్నారు? దానివెనుకున్న కారణమేంటి అనుకుంటున్నారా ? తాలిబన్లకు చెస్‌ ఆట అంటే ఇష్టముండదట. చెస్‌ ఒక గ్యాబ్లింగ్‌ లాంటిదని, అది ప్రజల మనస్సును చెడగొడుతుందని వారు బలంగా నమ్ముతారు.

చెస్‌ ఆడితే ప్రజలు సాతాను బిడ్డలుగా మారిపోతారని, వాళ్లు దేవుడి నుంచి దూరమైపోతారని తాలిబన్లు విశ్వసిస్తారు. అందుకే తాలిబన్లు చెస్‌పై ఉక్కుపాదం మోపారు. ఇక చెస్‌ ప్లేయర్లను కూడా వారు కఠినంగా శిక్షిస్తారు. 

గతంలో కాబూల్‌లో హాజీ షిరుల్లా అనే పారిశ్రామికవేత్త ఇంట్లో తన సోదరునితో కలిసి చెస్‌ ఆడుతుండగా  తాలిబన్లు అక్కడికి చేరుకుని చెస్‌బోర్డును ముక్కలు ముక్కలు చేసి, వారిద్దరినీ రెండు రోజుల పాటు జైల్లో ఉంచారని ఒక నివేదికలో పేర్కొన్నారు. చెస్‌పై తాలిబన్లు ఎంత కఠినంగా ఉంటారని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. 

ఇక ఇప్పుడు పూర్తిస్థాయి అధికారం రావడంతో చెస్‌ను బ్యాన్‌ చేయడానికి తాలిబన్లు సిద్ధపడుతున్నారు. ప్రస్తుతం ఆప్ఘనిస్తాన్‌లో వరల్డ్‌ చెప్‌ ఫెడరేషన్‌ గుర్తించిన 64 మంది ప్లేయర్లు ఉన్నారు. మరి చెస్‌ను బ్యాన్‌ చేస్తే వారి పరిస్థితి ఏంటనేది ప్రశ్నగా మారింది.

కాగా, చెస్‌ను గ్యాబ్లింగ్‌ అని తాలిబన్లు అనడంపై వరల్డ్‌ చెస్‌ ఫెడరేషన్‌ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. చెస్‌ మనిషి తెలివితేటలను వెలికితీసే మంచి గేమ్‌గానే చూడాలి కానీ.. గ్యాంబ్లింగ్‌ అని అనవద్దని అభ్యర్థిస్తున్నది. మరి తాలిబన్లు చెస్‌పై తమ నిర్ణయాన్ని మార్చుకుంటారో లేదో చూడాల్సిందే.

మహిళలపై ఆంక్షల కొరడా 

ప్రభుత్వంలో మహిళలు భాగం కావొచ్చని ఇటీవల ప్రకటించిన తాలిబన్లు.. అంతలోనే మాటమార్చారు. మహిళలపై ఆంక్షల కొరడా ఝుళిపిస్తున్నారు. ప్రభుత్వ మహిళా ఉద్యోగులు ఇండ్ల నుంచి ఎట్టిపరిస్థితుల్లో బయటకు రావొద్దని ఆదేశించారు. భద్రతా సిబ్బంది అనుమతిస్తేనే వీధుల్లోకి రావాలని, భద్రతా చర్యలు మెరుగయ్యేంతవరకూ ఈ ఆదేశాలను పాటించాలని తాలిబన్‌ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్‌ ప్రకటించారు.

పౌరులు, ఉద్యోగుల ఇండ్లల్లోకి చొరబడి సోదాలు చేస్తూ తాలిబన్లు మానవహక్కులను కాలరాస్తున్నారని అఫ్గాన్‌ మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సాలేహ్‌ ఆరోపించారు. తాలిబన్ల అకృత్యాలను ఎవరైనా ప్రతిఘటిస్తే, మహిళలు, పిల్లలను రక్షణ కవచంగా వాడుతున్నట్టు తెలిపారు. 

దీని కోసం ఇప్పటికే వందలాది మంది మహిళలు, పిల్లలను వాళ్లు అపహరించినట్టు చెప్పారు. తమను తాలిబన్లు కిడ్నాప్‌ చేస్తారేమోనన్న భయంతో వేలాది మంది మహిళలు, చిన్నారులు కొండలు, అడవుల్లోకి పారిపోయి తలదాచుకుంటున్నట్టు వెల్లడించారు.