వ్యవసాయ చట్టాలపై కిసాన్ సంఘ్ 8 నుంచి నిరసన

కేంద్ర వ్యవసాయ చట్టాలపై ఆరెస్సెస్‌ పరివార్ కు చెందిన భారతీయ కిసాన్‌ సంఘ్‌ (బీకేఎస్‌) కూడా స్వరం పెంచింది. పంట వ్యయాన్ని దృష్టిలో ఉంచుకుని కనీస మద్దతు ధరను ప్రకటించాలని, రైతులు లేవనెత్తుతున్న అంశాలను పరిగణనలోకి తీసుకుని నూతన చట్టాన్ని తీసుకురావాలని మోదీ సర్కారును డిమాండ్‌ చేసింది. 

కేంద్రానికి ఈ నెల 31 వరకు సమయమిస్తున్నామని, అప్పటికీ డిమాండ్లు పరిష్కరించకపోతే వచ్చే నెల 8 నుంచి దేశవ్యాప్తంగా నిరసన చేపడుతామని హెచ్చరించింది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని ఆరెస్సెస్‌ నడపడం లేదని బీకేఎస్‌ కోశాధికారి యుగల్‌ కిషోర్‌ మిశ్రా యుగల్‌ కిషోర్‌ మిశ్రా స్పష్టం చేశారు. 

రైతులు తమ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు పొందలేక పోతున్నారని చెబుతూ కనీస మద్దతు ధర గిట్టుబాటు ధర కాదని తేల్చి చెప్పారు. ఏ ప్రభుత్వం కూడా రైతుల ప్రయోజనాలను పట్టించుకోవడం  లేదని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీని ప్రస్తావించగా, ఇప్పటి వరకు  వ్యవసాయం  కోసం ఎంత ఖర్చు పెట్టారో చెప్పమనండి అంటూ ఎద్దేవా చేశారు. 

రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా కేంద్రమే కాదు కొన్ని రాష్ట్రాలు కూడా పనిచేయడం లేదని ఆయన విమర్శించారు. నాడు వాజపేయి ప్రభుత్వంలో, నేడు మోదీ పాలనలో రైతులు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యారని తెలిపారు. పంట ఉత్పత్తికి అయ్యే ఖర్చును పరిగణనలోకి తీసుకొని లాభదాయకమైన ధరను నిర్ణయించడంలో ఇప్పుడు ఉన్న మోదీ సర్కార్‌, అప్పటి వాజపేయి సర్కార్‌ విఫలమైందని విచారం వ్యక్తం చేశారు. 

నాలుగు సవరణలు సూచించిన బికెఎస్ 

భారతీయ కిసాన్ సంఘ్ మూడు వివాదాస్పద కేంద్ర వ్యవసాయ చట్టాలను “రైతు-స్నేహపూర్వకంగా” మార్చడానికి, నిరసనలకు దారితీసిన ఆందోళనలను పరిష్కరించడానికి గత డిసెంబర్ లో  నాలుగు సవరణలను ప్రతిపాదించింది. బికెఎస్ ప్రధాన కార్యదర్శి బద్రి నారాయణ్ చౌదరి ఈ సవరణల ద్వారా రైతుల  ఆందోళనలను పరిష్కరించవచ్చని విశ్వాసం వ్యక్తం చేశారు. 

సవరణల ప్రకారం హోల్‌సేల్ మార్కెట్లలో లేదా బయట ఎంఎస్పి కంటే తక్కువ కొనుగోలు చేయరాదు. అన్నింటినీ యాక్సెస్ చేయగల ప్రభుత్వ పోర్టల్‌లో వ్యాపారులందరూ నమోదు చేసుకోవాలి.  బ్యాంకు గ్యారెంటీ ద్వారా రైతులకు నిర్ణీత సమయంలో చెల్లింపు ఏర్పాటు జరగాలి. వారి సొంత ఊరిలోనే రైతుల వివాదాల పరిష్కారం కోసం వ్యవసాయ ట్రిబ్యునల్స్ పని చేయాలి.

“ఒకే దేశం-ఒకే మార్కెట్” కోసం చాలా కాలంగా తాము ప్రయత్నిస్తున్నాయని చౌదరి చెప్పారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని హోల్‌సేల్ మార్కెట్లను ప్రవేశపెట్టారని, అది వారికి చాలా సహాయపడిందని చెప్పారు. “కానీ క్రమంగా, ఇది రైతులను దోపిడీ చేసే సాధనంగా మారింది,” అని ఆయన స్పష్టం చేశారు. 

ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధరలు కేవలం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేసే వ్యవసాయ ఉత్పత్తులకు లభిస్తాయని, మొత్తం ఉత్పత్తులలో ఇవి కేవలం 9 శాతమే అని కిసాన్ సంఘ్ నేత దినేష్ కులకర్ణి తెలిపారు. దాని వల్లన సన్నకారు రైతులు ప్రయోజనం పొందలేక పోతున్నారని చెబుతూ, అత్యధిక రైతులకు ప్రయోజనం చేకూర్చలేని ప్రభుత్వ విధానాల వల్లన ప్రయోజనం ఏమీ ఉండబోదని స్పష్టం చేశారు. 

రైతులకు కనీస మద్దతు ధరకు హామీ ఇచ్చే విధంగా కేంద్రం కొత్త చట్టం తీసుకు రావడమో, ప్రస్తుత వ్యవసాయ చట్టాలకు సవరణ చేయడమో చేయాలని కిసాన్ సంఘ్ డిమాండ్ చేస్తున్నది.