కేంద్ర మంత్రి రాణాకు బాసటగా బిజెపి

ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేను చెప్పుతో కొట్టేవాడిని అంటూ అనుచితంగా మాట్లాడారని మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్  చేసిన నారాయణ రాణేకు బిజెపి నాయకత్వం బాసటగా నిలిచింది. ఈ విధంగా అరెస్ట్ చేయడం రాజ్యాంగ విలువలను ఉల్లంఘించడమే అని బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా ధ్వజమెత్తారు.

అలాంటి చర్యల వల్ల తాము భయపడబోమని లేదా తమను అణచివేయలేరని నడ్డా ట్విట్టర్ లో స్పష్టం చేశారు. “జన్ ఆశీర్వాద్ యాత్రలో బిజెపికి లభిస్తున్న అపారమైన మద్దతు” రాజకీయ ప్రత్యర్థులను చిత్తు చేసిందని పేర్కొంటూ ఇటువంటి సంఘటనలను తమ పార్టీ “ప్రజాస్వామ్యయుతంగా పోరాడుతూనే ఉంటుంది” అని ఆయన పేర్కొన్నారు.
కేంద్ర మంత్రి మహేంద్ర నాథ్ పాండే రాణే అరెస్టును “ఖండించదగినది” అని పేర్కొన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి బిజెపిపై పగ పెంచుకున్నారని, అదే అరెస్టు వెనుక కారణమని ఆరోపించారు. “ఇది తీవ్రమైన విషయం,” అని ఆయన స్పష్టం చేశారు.  

కాగా,  ఉద్ధవ్ థాకరేను కొడతానని తాను చెప్పలేదని నారాయణ్ రాణే స్పష్టం చేశారు. భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఎన్నేళ్ళయిందో థాకరేకు తెలియకపోవడంపై వ్యాఖ్యలు చేశానని చెప్పారు. తాను అక్కడ ఉండి ఉంటే, ఆయనను చెంప దెబ్బ కొట్టి ఉండేవాడినని అన్నానని తెలిపారు. 

అరెస్టుకు సంబంధించిన ఆదేశాలేవీ తనకు ఇవ్వకుండానే తనను అరెస్టు చేశారని చెప్పారు. తాను గోల్వాల్కర్ గురూజీ ఆశ్రమంలో మధ్యాహ్న భోజనం చేస్తుండగా పోలీసులు వచ్చారని, మంగళవారం మధ్యాహ్నం దాదాపు 3 గంటల ప్రాంతంలో డీసీపీ వచ్చి తనను అరెస్టు చేస్తున్నట్లు చెప్పారని పేర్కొన్నారు. 
 
నోటీసు ఉందా? అని తాను ప్రశ్నించానని, తన వద్ద అటువంటిదేమీ లేదని డీసీపీ చెప్పారని తెలిపారు. తనను సంగమేశ్వర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్ళారని చెప్పారు. డీసీపీ గదిలోకి వెళ్ళి, దాదాపు రెండు గంటలపాటు బయటికి రాలేదని అంటూ  తనకు ప్రాణ భయం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. 
అర్థరాత్రి దాటాక కోర్టు నుంచి బెయిల్ 

 కాగా, నారాయ ణ్ రాణెకు గత అర్థరాత్రి దాటాక కోర్టు నుంచి బెయిల్ మంజూరయ్యింది. రాణేకు రాయగఢ్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అనంతరం ముంబై చేరుకున్న రాణాకు ఆయన మద్దతుదారులు ఘన స్వాగతం పలికారు.  

కేంద్రమంత్రి రాణేకు బెయిలు మంజూరు చేస్తూ కోర్టు కొన్ని షరతులు పెట్టిందని, ఆగస్టు 31, సెప్టెంబర్ 13 తేదీల్లో రత్నగిరి పోలీస్‌స్టేషన్ ముందు హాజరు కావాలని, ఇలాంటి నేరం భవిష్యత్ లో చేయరాదని సూచించిందని రాణే న్యాయవాది సంగ్రామ్ దేశాయ్ చెప్పారు.మరోవైపు, బీజేపీ నాయకుడు ప్రవీణ్ దారేకర్ గురువారం మహారాష్ట్రలో జన్ ఆశీర్వాద్ యాత్రను తిరిగి ప్రారంభిస్తామని ప్రకటించారు. 15వేల రూపాయల వ్యక్తిగత బాండ్ పై మంత్రి రాణేకు కోర్టు బెయిలు మంజూరు చేసింది. 

ఇలా ఉండగా, మహారాష్ట్రలోని ఒక బిజెపి శాసనసభ్యుడు పోలీసు కస్టడీలో నారాయణ్ రాణే ప్రాణానికి ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ ఎమ్మెల్సీ ప్రసాద్ లాడ్ రాణేపై పోలీసులు కఠినంగా వ్యవహరించారని పేర్కొన్నారు.  “రాణే భోజనం చేస్తున్నప్పుడు పోలీసులు ఆయనను నెట్టారు. ఆయనకు దాదాపు 70 సంవత్సరాలు. అలాంటి వయస్సు గల వ్యక్తికి ఇలా వ్యవహరించాలా? ఆయన ప్రాణానికి ముప్పు ఉందని మేము భావిస్తున్నాము” అని లాడ్ తెలిపారు.

ఆయనను చెకప్ చేసిన ఒక వైద్యుడు రాణే మధుమేహ వ్యాధిగ్రస్తుడని చెప్పాడు.  కానీ ఆయన చక్కెర స్థాయిని తనిఖీ చేయలేకపోయాడు. ఆయన రక్తపోటు పెరిగిందని చెప్పాడు. మహారాష్ట్రలో శివసేన ప్రభుత్వం రాణేను అరెస్ట్ చేయడంను ఒక చక్రవర్తి అధికార మదంతో ఏచట్టాన్ని పట్టించుకోని రీతిలో ఉన్నదని మండిపడుతూ తమిళనాడు బిజెపి అధ్యక్షుడు కె అన్నామలై ట్వీట్ చేశారు. 

రానా  ప్రకటనలు నాన్-కాగ్నిజబుల్ ఛార్జీలను ఆకర్షించవచ్చని, కానీ వాటిని చట్టవిరుద్ధంగా ‘కాగ్నిజబుల్’ చేయడానికి ప్రయత్నిస్తున్నారని, ఇది కోర్ట్ లో నిలబడదని ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ స్పష్టం చేశారు. రాణాను అరెస్ట్ చేయడం ద్వారా బిజెపి చేపట్టిన ‘జన్ ఆశీర్వాద్ యాత్ర’ నిలిపివేయలేరని కూడా చెప్పారు. దీనిని ప్రతిపక్ష నాయకుడు (కౌన్సిల్) ప్రవిన్ దారేకర్, ఆశిష్ శెలార్ మొదలైన వారు కొనసాగిస్తారని ప్రకటించారు. 

రాణే శివసేన నుండి వచ్చినవారే అని, అందుకని వారికి అర్ధమయ్యే భాషలో మాట్లాడారని కేంద్ర సహాయ మంత్రి రామదాస్ అథవాలే ఎద్దేవా చేశారు.