బారా షాహిద్ దర్గా.. రొట్టెల పండుగ

బారా షాహిద్ దర్గా.. ఆంధ్రప్రదేశ్ నెల్లూరులోని ఓ చెరువుగట్టున ఉన్న ఈ దర్గా ప్రతిఏడాది జరిగే రొట్టెల పండుగ కారణంగా ఈ బారా షాహిద్ దర్గా ప్రసిద్ధిగాంచింది. ఈ దర్గాలో జరిపే రొట్టెల పండుగ వెనుక అనేక కథలు, కధనాలు ప్రచారంలో ఉన్నాయి. వాటిలో ప్రాచుర్యం పొందిన కథ ఏమిటంటే.. టర్కీ దేశం నుండి 12 మంది ఇస్లామిక్ మతప్రచారకులు భారత్ వచ్చి, ఇస్లాంను ప్రచారం చేస్తూ అనేక మందిని మతం మారుస్తూ గంధవరం ప్రాంతం చేరుకోగా, వారి దైవకార్యాన్ని వ్యతిరేకిస్తూ స్థానికులు వారిని అడ్డగించడంతో యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో ఈ పన్నెండు (12) మంది ఇస్లామిక్ ప్రచారకులూ ప్రాణం వదిలారు. వీరి పేరిట ఇక్కడ దర్గా ఏర్పడి అది బారా షాహిద్ దర్గాగా పేరుగాంచింది అనేది ప్రధాన కథ. బారా అంటే పన్నెండు, షాహిద్ అంటే పవిత్ర కార్యం కోసం ప్రాణాలు విడిచినవాడు అని అర్ధం.
ఇదిలా ఉండగా ఇదే దర్గాకు మరొక కథ ప్రచారంలో ఉంది. మత సామరస్యం, శాంతి కోసం తమ ప్రాణాలు త్యాగం చేసిన కర్ణాటక రాష్ట్రానికి చెందిన 12 మంది నవాబుల స్మృతి చిహ్నంగా ఈ దర్గాను నిర్మించారు అని మరికొందరు చెప్తుంటారు.

మరొక కథనం ఏమిటంటే.. తమిళనాడు రాష్ట్రంలోని అర్కోట్ రాజ్యాన్ని పాలించిన నవాబు 1751లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడాల్సిందిగా టర్కీ సైన్యానికి ఆదేశాలు జారీ చేస్తాడు. వారి సైన్యంలో ఇస్లాం పద్దతులను తుచ తప్పకుండా పాటిస్తూ రోజుకు 5 సార్లు నమాజు చేసే ఓ 12 మంది సైనికులు ఉంటారు. టర్కీ సైన్యం బ్రిటిష్ వారితో పోరాడి గెలిచినప్పటికీ ఈ పన్నెండు మంది మాత్రం శత్రువుల చేతిలో శిరచ్చేదానికి గురవుతారు. ఈ ఘటన నెల్లూరుకు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న గంధవరం ప్రాంతంలో చోటుచేసుకున్నట్టు ప్రచారం. శిరసు లేకుండా మొండెం మాత్రమే ఉన్న వీరి శరీరాలను వారి గుఱ్ఱాలు నెల్లూరులో ఇప్పుడు దర్గా ఉన్న ప్రాంతానికి తీసుకువచ్చాయి. దీంతో అక్కడ వారి కోసం దర్గా నిర్మితం కాగా, దానికి బారా షాహిద్ దర్గాగా పేరు వచ్చింది.

అనంతరం అర్కోట్ నవాబు జబ్బున పడగా అతడి భార్య వచ్చి ఈ దర్గా దగ్గర ప్రార్ధన చేసిందని, ఇక్కడ సమాధి అయిన ఆ పన్నెండు మంది కృపా కటాక్షాల కారణంగా నవాబుగారి జబ్బు నయమైనట్టు మరో కథ. ఇది ఆనోటా ఈనోటా నాని, ఈ దర్గాలో సమాధి గావించబడిన ఈ పన్నెండు మంది సైనికులకు అతీత శక్తులు ఉన్నాయని, వారంతా కోరిన కోర్కెలు తీరుస్తుంటారని తీవ్రమైన ప్రచారం మొదలైంది.

మరి ఈ రొట్టెల పండుగ ఎలా వచ్చింది?:

దర్గాలో సమాధి అయిన 12 మంది సైనికుల గౌరవార్ధం నవాబు భార్య ముహర్రం తరువాతి 12వ రోజున అక్కడికి చేరిన సైనికులు, ప్రజలకు రొట్టెలు పంచిపెట్టింది. అప్పటి నుండి మొహర్రం నెలలో రొట్టెలు పంచడం అనేది ఒక ఆచారంగా మారింది.

అలా వివిధ కారణాలతో అక్కడికి వచ్చేవారి కోరికలకు అనుగుణంగా ‘సౌభాగ్య రొట్టె’, ‘ఉద్యోగ రొట్టె’, ‘విద్యా రొట్టె’, ‘వివాహ రొట్టె’, ‘సంతాన రొట్టె’, ‘ధన రొట్టె’, ‘వీసా రొట్టె’.. ఇలా అనేక పేర్లు ఏర్పడ్డాయి. పరిస్థితులు, భక్తుల కోరికలకు అనుగుణంగా అక్కడి వారికి ఎలాంటి రొట్టెలు కావాలన్నా వెంటనే తయారు చేసిపెట్టె వ్యాపారాలు కూడా కాలక్రమంలో పుట్టుకొచ్చారు.


బారా షాహిద్ దర్గాకు ‘షియా’ మూలాలు:
ఎన్ని కథలు ప్రచారంలో ఉన్నప్పటికీ చరిత్ర పట్ల కాస్తో కూస్తో అవగాహనా, పరిశోధన పట్ల మక్కువ ఉన్నవారికి బారా షాహిద్ దర్గా వెనుక చరిత్ర ముసుగులో ప్రచారం అవుతున్న ఈ కధనం కల్పిత గాథ అని ఇట్టే అర్ధమవుతుంది. ముహర్రం తరువాతి 12 రోజులకు జరిపే రొట్టెల పండుగకు ఆక్రోట్ నవాబుకు ఉన్న సంబంధాలు, చనిపోయిన సైనికులను వీరులుగా కీర్తించడం వంటివి జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ మొత్తం వ్యవహారానికి షియా మూలాలు ఉన్న విషయం స్పష్టమవుతుంది. ఇందుకోసం ఆర్కాట్ ప్రాంతాన్ని వరుసగా పాలించిన నవాబుల మూడు విభిన్న వంశాలను పరిశీలిద్దాం. ఈ ప్రాంతాన్ని పాలించిన వారిలో జుల్ఫికర్ ఖాన్, దౌద్ ఖాన్ పన్నీ అనే నవాబులను ఔరంగజేబ్ నియమించాడు. ఆ తరువాతి వారు నవయతి వంశానికి చెందిన నవాబులు. అనంతరం 1740వ దశకంలో, వల్లాజా వంశానికి చెందిన నవాబుల పాలన మొదలైంది. వీరందరిలో మొదట పాలన చేసిన నవాబులు ఇస్లాంలోని షియా శాఖకు చెందినవారు కాగా, తరువాతి వారు సున్నీ ఇస్లాంకు చెందినవారు.ముహర్రం చరిత్ర:
10 అక్టోబర్ 680 ACE (ఇస్లామిక్ క్యాలెండర్‌లో 61 AH సంవత్సరంలో 10 ముహర్రం) నాడు రెండవ ఉమయ్యద్ ఖలీఫ్ యాజిద్-I సైన్యానికి, మహ్మద్ ప్రవక్త మనవడు హుసేన్ ఇబ్న్ అలీ నేతృత్వంలోని చిన్న సైన్యం మధ్య కర్బాలా యుద్ధం జరిగింది. ఈ యుద్ధం జరిగిన ప్రదేశం ప్రస్తుత ఇరాక్ దేశంలో ఉంది.

ఇమామ్ హుస్సేన్, ఇతర అమరవీరులకు అవమానం:

కర్బాలా యుద్ధానికి సంబంధించి షియాల చారిత్రక లెక్కల ప్రకారం.. ఇమామ్ హుస్సేన్ కింద పడిపోగా, అక్కడే ఉన్న సినాన్ ఇబ్న్ అనాస్ అనే వ్యక్తి వెంటనే హుస్సేన్ మీద దాడి చేసి, కత్తితో పొడిచి, ఆపై అతని తలను నరికివేశాడు. ఇమామ్ హుస్సేన్ వైపు చనిపోయిన వారి సంఖ్య డెబ్బై లేదా డెబ్బై రెండు మంది కాగా వీరిలో ఇరవై మంది అలీ తండ్రి అబూ తాలిబ్ వారసులు. ఆ ఇరవై మందిలో హుస్సేన్ యొక్క ఇద్దరు కుమారులు, ఆరుగురు సోదరులు (తండ్రి యొక్క సోదరుడి కుమారులు) ఉన్నారు. యుద్ధం తరువాత హుస్సేన్ యొక్క బట్టలు తీసివేయబడ్డాయి. అతని కత్తి, బూట్లు, సామాను అవతలివైపు వారు స్వాధీనం చేసుకున్నారు. హుస్సేన్ సహచరుల మృతదేహాల తలలు వేరు చేయబడ్డాయి. సమీపంలోని గాదిరియా గ్రామానికి చెందిన బాను అసద్ అనే తెగకు చెందిన వ్యక్తులు హుస్సేన్ యొక్క సహచరుల తలలేని మృతదేహాలను ఖననం చేశారు.

ఇమామ్ హుస్సేన్ కుటుంబ సభ్యులను యుద్ధ ఖైదీలుగా ప్రకటించి వారిని గొలుసులతో బంధించి, కుఫా నుండి డమాస్కస్ వరకు చెప్పులు నడిపించారు. ఈ అత్యంత కఠినమైన ప్రయాణంలో చాలా మంది చిన్నపిల్లలు అనారోగ్యంతో బాధపడుతూ మరణించారు. మిగిలిన వారు దారి పొడవునా అడుగడుగునా అవమానాలు పొందుతూ, ఆగంతకుల చేతిలో దాడులకు గురయ్యారు. ఈ క్రమంలో డమాస్కస్ నగరాన్ని అలంకరించాలని యాజిద్ ఆదేశించాడు. ఖైదీలను పట్టుకున్నందుకు నగర ప్రజలు ఏంటో ఆనందోత్సాహాలతో గుమిగూడారు. ఇమామ్ హుస్సేన్ మరియు అతని సహచరుల తలలను డమాస్కస్‌లో బహిరంగ ప్రదర్శన కోసం ఉంచారు. ఇమామ్ హుస్సేన్ కుటుంబాన్ని డమాస్కస్ వ్యాపార కూడలిలో ఊరేగించారు. కొంతమంది చరిత్రకారుల పరిశీలన ప్రకారం, యుద్ధ ఖైదీలపై చెత్త, రాళ్లతో దాడి చేశారు. వారి కుటుంబంపై మరుగుతున్న వేడి నీరు కూడా పోయడం జరిగింది.  గమనించారు. ఇది ఇస్లామిక్ చరిత్రలో అత్యంత విషాదకరమైన అధ్యాయాలలో ఒకటి. ప్రవక్త ముహమ్మద్ (SAW) యొక్క ప్రియమైన మనవడికి ఇంత కఠినమైన చికిత్స జరుగుతుందని ఎప్పుడూ ఊహించలేదు లేదా అనుకోలేదు.

750 A.C.E కాలంలో జరిగిన ఈ ఘటనతో ఉమయ్యద్ పాలన ముగిసి, అబ్బాసిడ్ రాజవంశం అధికారంలోకి వచ్చింది. రాజధాని ఖలీఫా నుండి బాగ్దాద్‌కు తరలింది. ఈక్రమంలో ఇమామ్ హుస్సేన్ తలను  మసీదు నుండి తరలించడంపై అనేక కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. ఇటువంటి ప్రచారంలో ఉన్న ఒక కధనం ప్రకారం.. ఇమామ్ హుస్సేన్ తలను అతని శరీరానికి చేర్చి, అతడి దేహం సమాధి చేయబడింది. మరొక కధనం ప్రకారం, అతడి తల ప్రస్తుత ఇజ్రాయెల్‌లోని అష్కెలోన్‌కు తరలించబడింది. అయితే, ఈ మసీదులో ఇమామ్ హుస్సేన్ తలకు సముచిత స్థానం ఉంది. అయితే, డమాస్కస్ మసీదులో ఇమామ్ హుస్సీన్ తల భద్రపరచినట్టుగా చెప్తున్న ప్రదేశం ఇప్పటికీ ప్రముఖంగా కనిపిస్తుంది.
షియా ఇస్లాంకు చెందిన 12 మంది అమరవీరుల స్మారక చిహ్నాన్ని సిరియాలోని డమాస్కస్‌లోని ఎమెవీయే మసీదులో నిర్మించారు. అమరవీరుల తలలను సూచించే వస్త్రాల కట్టలు స్మారక ప్రదర్శనశాలలో ఇప్పటికీ కనిపిస్తాయి.
కర్బాలా అమరవీరుల శిరచ్ఛేదం, తెగిపోయిన వారి తలలను డమాస్కస్‌కు ప్రదర్శనగా తీసుకురావడం.. ఈ వృత్తాంతం మొత్తం బారా షాహిద్ దర్గా చుట్టూ చేరి, ఆనోటా ఈనోటా నాని, స్థానికంగా జరిగిన ఘటనగా నమ్మించే పరిస్థితికి చేరింది. ప్రస్తుత ప్రదేశంలో అమరవీరుల తలలు పడిపోయిన కథను కర్బాలా వద్ద యుద్ధం తర్వాత జరిగిన సంఘటనలతో పోల్చవచ్చు.
ముహర్రం మాసంలో ‘రోట్’ అనబడే ఒకరకమైన పదార్ధం (బిస్కట్ వంటిది) ఇచ్చిపుచ్చుకోవడం అనేది భారత ఉపఖండంలో అక్కడక్కడా ఉన్న సాంప్రదాయమే. అదే కాలక్రమంలో ‘రొట్టెల పండుగ’గా రూపాంతరం చెందింది. ఈ రొట్టెల పండుగకు మూలాలు ముహర్రం మాసంలో ఇచ్చిపుచ్చుకునే రొట్టెల సంప్రదాయమే.
ఈ పరిశీలనల బట్టి బారా షాహిద్ దర్గా చుట్టూ తిరుగుతున్న కథాకథనాలకు, కర్బాలా యుద్ధానంతరం ఖైదీల తలలు నరికివేయడం వంటి కథనాలకు  ఉన్న పోలికలు సుస్పష్టంగా కనిపిస్తాయి. అంతేకాదు, ముహర్రం తరువాతి రోజు రొట్టెల పండుగ జరుపుకునే ఆచారం గమనించినట్లయితే.. ఇక్కడ బారా షాహిద్ దర్గాగా పేరుగాంచిన నిర్మాణానికి ఇస్లాంలోని  షియా వర్గానికి చెందిన మూలాలు అవగతమవుతాయి.