బెంగళూరు-విజయవాడ గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే

ఇటీవల అనంతపురం-గుంటూరు రహదారికి ఆమోదం తెలిపిన కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ తాజాగా మరో జాతీయ రహదారి నిర్మాణానికి గ్రీన్‌ సిగల్‌ ఇచ్చింది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. రూ.10 వేల కోట్లతో దాదాపు 370 కిలోమీటర్ల అధునాతన రహదారిని నిర్మించేందుకు నిర్ణయించింది. 

ప్రస్తుతం బెంగళూరు నుంచి విజయవాడ చేరుకోవాలంటే ఎన్నో మలుపులు తిరుగుతూ 560 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంది. అయితే, ఈ రహదారి పూర్తయితే కేవలం 370 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణించి విజయవాడ చేరుకోవచ్చు. అంతేకాదు, ఈ గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మిస్తే.. 6 జిల్లాలకు బెంగళూరుతో కనెక్టివిటీ ఏర్పడుతుంది. 

మరోవైపు ఈ హైవేను కోల్‌కత్తా – చెన్నై హైవే-65తో అనుసంధానిస్తారు. దీంతో శ్రీకాకుళం వరకు జాతీయ రహదారి మీదుగా కనెక్టివిటీ కల్పించినట్లు అవుతుంది. భారతమాల రెండోదశ కింద ఈ ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించింది. బెంగళూరు-విజయవాడ గ్రీన్‌ఫీల్డ్‌ హైవే కోసం కేంద్ర రవాణా, జాతీయ రహదారులశాఖ మూడు రూట్‌ మ్యాప్‌లను ప్రతిపాదించింది. 

రూట్‌మ్యాప్‌ను నిర్ణయించేది రాష్ట్ర ప్రభుత్వమే. బెంగళూరు నుంచి అనంతపురం జిల్లాలోంచి పులివెందుల మీదుగా కడప, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల మీదుగా విజయవాడ వరకు హైవే నిర్మాణ రూట్‌మ్యాప్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. దీన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది.

కిలోమీటరుకు దాదాపు రూ.25 కోట్లు వెచ్చించి ఈ హైవే నిర్మిస్తారు. భూసేకరణ వ్యయం దాదాపు రూ.745 కోట్లు అవుతుందని అంచనా వేస్తున్నారు. ఆ ప్రకారం ఈ గ్రీన్‌ఫీల్డ్‌ హైవేని దాదాపు రూ.10 వేల కోట్లతో నిర్మించనున్నారు. అందుకోసం డిపిఆర్‌ రూపొందించే బాధ్యతను టెండర్ల ద్వారా అర్వీ అసోసియేట్స్‌కు అప్పగించారు.