జగన్ ఇంటి సమీపంలో `భారత మాత’ విగ్రహం తొలగింపు

 ముఖ్యమంత్రి భద్రత పేరిట తాడేపల్లిలోని సుందరమైన భరతమాత విగ్రహాన్ని సోమవారం అర్ధరాత్రి అధికారులు తొలగించారు. భారీ క్రేనును తెచ్చి విగ్రహాన్ని పెకిలించివేశారు. రోడ్డు విస్తరణ పనుల కోసం తొలగించారా అంటే…విగ్రహం రోడ్డుపై లేదు. 

భద్రతాకోణంలో చూసినా, సీఎం నివాసానికి బాగా దూరంలో నెలకొని ఉంది. దీంతో  అధికారుల చర్య తాడేపల్లిలో కలకలం రేపింది. సీఎం ఇంటి సమీపంలోని అమరారెడ్డి కాలనీని ఇప్పటికే అధికారులు తొలగించారు. ఈ కాలనీ మొదట్లో, తాడేపల్లికి ప్రధాన ఆకర్షణగా భరత మాత విగ్రహం నిలిచింది. 

15 ఏళ్ల క్రితం ప్రతిష్టించినప్పుడు మూడు అడుగులు ఉండేది. అపురూప, ముఖ్య కట్టడాలకు, ప్రతీకలకు ఉండే విలువను గుర్తించిన చంద్రబాబు ప్రభుత్వం 2018లో 15 అడుగుల ఎత్తున సుందరంగా విగ్రహాన్ని తీర్చిదిద్దింది.

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా స్థానికులు ఈ నెల 15వ తేదీన చక్కటి అలంకరణ చేశారు. ఇంతలోనే విగ్రహాన్ని మున్సిపల్‌ అధికారులు తరలించడాన్ని వారు తట్టుకోలేకపోతున్నారు. కాగా, ఎన్టీఆర్‌ కట్టవద్ద ఉన్న పంప్‌ హౌస్‌ వద్ద విగ్రహాన్ని పునఃప్రతిష్ఠిస్తామని అధికారులు చెబుతున్నారు.