ఆఫ్ఘన్‌పై పుతిన్‌తో ప్రధాని మోదీ సంభాషణలు

ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ ఫోన్ చేశారు. దాదాపు 45 నిమిషాల‌పాటు వారి మ‌ధ్య ఫోన్ సంభాష‌ణ కొన‌సాగింది. ఆ 45 నిమిషాల్లో వారు పూర్తిగా ఆఫ్ఘ‌నిస్థాన్‌లో ప‌రిస్థితుల‌ గురించే చ‌ర్చించుకున్నారు. ప్ర‌ధాని కార్యాల‌య‌ వ‌ర్గాలు ఈ విష‌యాన్ని వెల్ల‌డించాయి. 

అంతకుముందు, ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి,  ప్రపంచంపై దాని ప్రభావాలపై జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్‌తో ప్రధాని మోదీ  మాట్లాడారు. ఓ ప‌ది రోజుల క్రితం తాలిబ‌న్‌లు టేకోవ‌ర్ చేయ‌డంతో ఆఫ్ఘ‌నిస్థాన్‌లో ప‌రిస్థితి అల్ల‌క‌ల్లోలంగా మారింది. అధ్య‌క్షుడు అష్ర‌ఫ్ ఘ‌నీ స‌హా నేత‌లంతా దేశం విడిచి పారిపోయారు. దాంతో అఫ్ఘాన్‌లో తాలిబ‌న్‌లు ఆడిందే ఆట‌, పాడిందే పాట‌గా మారింది.

అంతా ఊహించిన‌ట్టుగానే తాలిబ‌న్‌లు మ‌హిళ‌పైనా, గ‌త ప్ర‌భుత్వ మ‌ద్ద‌తుదారుల‌పైనా దాడులకు పాల్ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే భార‌త్ స‌హా ప‌లు దేశాలు ఆఫ్ఘ‌నిస్థాన్ నుంచి త‌మ పౌరులు స్వ‌దేశాల‌కు త‌ర‌లిస్తున్నాయి. ఆఫ్ఘనిస్థాన్‌లో పరిస్థితులతోపాటు ద్వైపాక్షిక సంబంధాలపై కూడా మంగళవారం సవివరంగా చర్చించినట్లు తెలిపారు. తమ మధ్య ప్రయోజనకరమైన సంభాషణ జరిగిందని, పరస్పరం అభిప్రాయాలను పంచుకున్నామని ఓ ట్వీట్‌లో తెలిపారు. 

ప్రధాని మోదీ మంగళవారం ఇచ్చిన ఓ ట్వీట్‌లో, ‘‘ఆఫ్ఘనిస్థాన్‌లో ఇటీవలి పరిణామాలపై నా మిత్రుడు, రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్‌తో వివరంగా చర్చించాను. పరస్పరం ప్రయోజనకరమైన రీతిలో అభిప్రాయాలను పంచుకున్నాం. కోవిడ్-19 మహమ్మారి విషయంలో భారత్-రష్యా మధ్య  సహకారంతో పాటు ద్వైపాక్షిక ఎజెండాపై చర్చించాం.  ముఖ్యమైన విషయాలపై సంప్రదింపులను కొనసాగించేందుకు అంగీకరించాం’’ అని తెలిపారు. 

ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ నుంచి దౌత్య మిషన్‌ను భారత దేశం ఖాళీ చేసింది. తాలిబన్ల వ్యవహార శైలి, ఇతర ప్రజాస్వామిక దేశాల స్పందన ఆధారంగా ఆ ప్రభుత్వంపై నిర్ణయం తీసుకుంటామని భారత్ చెప్తోంది.  రష్యా తన దౌత్యవేత్తలను కాబూల్‌లో కొనసాగిస్తోంది. తాలిబన్లతో సంప్రదింపులకు అన్ని మార్గాలను తెరచి ఉంచింది. తాలిబన్ల ప్రభుత్వాన్ని గుర్తించడంపై ఆచితూచి స్పందిస్తోంది. అతి సంప్రదాయవాద పాలకులపై ఓ నిర్ణయం తీసుకోవడానికి తాము ఆత్రుతపడటం లేదని తెలిపింది. 

భార‌త్ ఆప‌రేష‌న్ దేవి శ‌క్తి పేరుతో ఆఫ్ఘ‌న్ నుంచి భార‌తీయుల‌ను తీసుకొస్తున్న‌ది. ఈ క్ర‌మంలో ప్ర‌ధాని మోదీ ర‌ష్యా అధ్య‌క్షుడితో 45 నిమిషాలు మాట్లాడ‌టం ప్రాధాన్యం సంత‌రించుకున్న‌ది. ఆఫ్ఘనిస్థాన్ నుంచి పారిపోయిన ప్రజలను రష్యా, తదితర దేశాలకు పంపించాలనే పాశ్చాత్య దేశాల ఆలోచనను రష్యా అధ్యక్షుడు పుతిన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. శరణార్థుల ముసుగులో ఉగ్రవాదులు రావడాన్ని తాను కోరుకోవడం లేదని స్పష్టం చేశారు.