ఎస్సీలకు ఎందుకు రాజ్యాధికారం ఇవ్వరే?

దళితులపై సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే వారికి ఎందుకు రాజ్యాధికారం ఇవ్వలేదని నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ ప్రశ్నించారు. హుజూరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ దళితులపై ప్రేమ ఉంటే ఎస్సీల్లో ఒక్కరికే మంత్రి పదవి ఇచ్చారు.. ఇదేనా మీ పవిత్రత అని ప్రశ్నించారు. 
 
కేంద్ర మంత్రి వర్గంలో 12 మంది ఎస్సీలు, 27 మంది బీసీలు, ఎనిమిది మంది ఎస్టీలు, 11 మంది మహిళలున్నారని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్‌ 25 ఏళ్ల క్రితమే దళిత చైతన్య జ్యోతి మొదలు పెడితే ఎందుకు ఇంకా సిద్దిపేట దళితులు కోటిశ్వరులు కాలేదని నిలదీశారు. ఇండియా టుడే సర్వేలో  సీఎం స్థానం ఎలా దిగజారిందో చూసుకోవాలని హితవు చెప్పారు.
తెలంగాణలో అన్ని పథకాలూ అవినీతిమయమే అని ఆరోపిస్తూ  తెలంగాణ ట్రాన్స్‌కోకు లక్ష పదివేల కోట్ల అప్పులున్నాయని, కొన్న ప్రతి యూనిట్‌కు రూపాయి కమిషన్‌ సీఎం కొడుకు తీసుకుంటున్నాడని ఆరోపించారు. మిషన్‌ భగీరథ పూర్తి అవినీతిమయంగా మారిందని ధ్వజమెత్తారు. 
 
 కేసీఆర్ కుటుంబం లక్షా 70 వేల కోట్లు సంపాదించిందని పేర్కొంటూ  2023 లో విజయ్ మాల్య వెళ్లినట్టు కేటీఆర్, కవిత, సంతోష్, హరీశ్‌లు విదేశాలకు పారిపోతారని జోస్యం చెప్పారు. తెలంగాణ మంత్రి వర్గంలో 11 మంది ఓసీలకు చోటు ఇవ్వడం సరైనది కాదని స్పష్టం చేస్తూ సోషల్‌ ఇంజనీరింగ్‌ను ప్రధాని మోదీ దగ్గర నెర్చుకోవాలని అర్వింద్‌ హితవు చెప్పారు.